హన్వాడ, న్యూస్‌లైన్: చిన్నారులంతా ఆడుతూ పాడుతూ పాఠశాల వెళ్లారు. బడి ముగిసింది.. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకునేలోపు మృత్యువు ఆటో రూపంలో ఓ బాలుడిని కబళించింది. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన బుధవారం మండలంలోని పెద్దర్పల్లి గ్రామంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదయ్యగౌడ్, అశ్వినిల ఒక్కగానొక్క కొడుకు గున్న ప్రణీత్(5) చిన్నదర్పల్లిలోని అభయా స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నర్సరీ చదవుతున్నాడు. ప్రణీత్ బుధవారం ఎప్పటిలాగే అందరితో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్లాడు. పాఠశాల ముగిసిన వెంటనే మళ్లీ అదే ఆటోలో ఇంటిముఖ ం పట్టారు.
కిక్కిరిసిన ఆటోలో ఉన్న ప్రణీత్ గ్రామ సమీపంలోని పల్లెమోనికాలనీ వద్ద ప్రధాన రహదారిపై ఆటో వేగానికి అదుపుతప్పి జారి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో వెనకనుంచి వస్తున్న కొందరు గుర్తించి 108 అంబులెన్స్‌కు ఫోన్‌చేశారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రణీత్‌ను మరో ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించిన కొదిసేపటికే ప్రాణాలు వదిలాడు.
ఆటోలో 60 మంది చిన్నారులు
ఇదిలాఉండగా, పెద్దర్పల్లి నుంచి చిన్నదర్పల్లిలోని అభయా స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రైవేటు పాఠశాలకు 60మంది చిన్నారులు వెళ్తారు. వీరంతా గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు చింతకింది రాములు ఆటోలోనే నిత్యం వెళ్లి వస్తుంటారు. ఇలా ఒక్కోట్రిప్‌కు 30మంది చిన్నారులను తరలిస్తారని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి బస్సు వేయాలని గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని కోరినా వారు వినిపించుకోలేదు. తీరా వారి నిర్లక్ష్యమే ప్రణీత్ ప్రాణాలను బలిగొందని తల్లిదండ్రులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
Published Thu, Nov 21 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement