
సాక్షి, గుంటూరు: ‘మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన పీఏ సారథి నన్ను బెదిరిస్తున్నారు. చంపుతామని హెచ్చరించారు. ఇక ఆయన నన్ను బతకనివ్వడు. నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోతా’ అంటూ చిలకలూరిపేటకు చెందిన మద్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీనివాసరావు సోదరుడు వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ముక్తేశ్వరానికి చెందిన ఊటుకూరి శ్రీనివాసరావు మొదట్నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుడిగా ఉన్నాడు. ఈ ఏడాది బల్లికురవ మండలం కొమ్మాలపాడులో శ్రీనివాసరావు మద్యం దుకాణం ఏర్పాటు చేశాడు. గొట్టిపాటి తన వర్గానికి చెందిన నాగేశ్వరరావుతో ఆ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేయించారు. తన వర్గంలో చేరాలని.. లేదంటే మద్యం దుకాణం మూసేసి వెళ్లిపోవాలంటూ గొట్టిపాటి, ఆయన పీఏ సారథి, మరికొందరు నిత్యం బెదిరింపులకు దిగుతూ శ్రీనివాసరావును మానసికంగా వేధించారు. మాట వినకపోవడంతో.. ఎమ్మెల్యే చివరకు తన అధికార బలం ఉపయోగించి మద్యం దుకాణాన్ని మూసివేయించారు. దీంతో శ్రీనివాసరావు వారం కిందట తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..
తన సోదరుడు శ్రీనివాసరావు అదృశ్యంపై ఈ నెల 16న చిలకలూరిపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెంకట సుబ్బారావు ‘సాక్షి’తో చెప్పారు. గొట్టిపాటి, పీఏ సారథి, మద్యం వ్యాపారి నాగేశ్వరరావు బెదిరింపుల వాయిస్ రికార్డులను అందించినప్పటికీ వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మిస్సింగ్ కేసుగా నమోదు చేశారన్నారు.
గొట్టిపాటి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్
Comments
Please login to add a commentAdd a comment