► రెండు వారాల్లో రెండో ఘటన
► రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల ధర్నా
► చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో వరుస సంఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత నెల 20వ తేదీన ఆహారం కలుషితమై పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడవక ముందే తాజాగా ఆదివారం రాత్రి వైవీయూ హాస్టల్స్‌లో వండిన రసంలో 3 బల్లులు పడి చనిపోయాయి. అయితే ఇదే ఆహారాన్ని విద్యార్థులు తీసుకోవడంతో పలువురు అస్వస్తతకు గురయ్యారు. ఇలా రెండు వారాల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థులు కన్నెర్రజేశారు. చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని అధికారులను హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో హాస్టల్, మెస్ నిర్వహణ సక్రమంగా లేదని చీఫ్ వార్డెన్ మొదలు వైస్ చాన్సలర్ వరకు అందరికీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి వేళ సైతం ఆందోళనకు దిగారు. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థుల ఓపిక నశించింది. సోమవారం యూనిరర్సిటీ ప్రధాన గేటు, హాస్టల్స్ గేట్ల ముందు భైఠాయించారు.
అర్ధరాత్రి నుంచి ఆందోళనలో విద్యార్థులు..: ఆదివారం రాత్రి భోజన సమయంలో రసంలో మూడు బల్లులు చనిపోయి ఉండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. అప్పటికే భోజనం చేసిన కొందరు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో నీరసించి క్యాంపస్‌లోని ఆరోగ్యకేంద్రానికి చేరుకున్నారు. మరికొందరు భయంతో ముందస్తుగా మందులు వేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధగా వ్యవహరిస్తున్న హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రాత్రి నుంచే ఆందోళనకు దిగారు. దీంతో సంఘటనా స్థలానికి హాస్టల్ చీఫ్ వార్డెన్ ఆచార్య గులాంతారీఖ్ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపడతామని.. వైస్ చాన్సలర్ వచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.
ఘటనపై కమిటీ ఏర్పాటు..?: ప్రస్తున ఘటనపై వంట సిబ్బందిని విచారించగా తాము రోజుమాదిరిగానే శుభ్రంగా వండి, భోజనం పూర్తయిన బయోమెట్రిక్‌లో నమోదు చేసి ఇంటికి వెళ్లామని చెప్పారు. అయితే ఆ తర్వాత బల్లులు పడ్డాయని విద్యార్థులు ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ఘటనపై మంగళవారం విచారణ కమిటీ వేయనున్నట్లు సమాచారం. మళ్లీ ఘటనలు పునరావృతం కాకుండా భోజన నిర్వహణను అవుట్‌సోర్సింగ్ ఏజన్సీకి కేటాయించాలనే ఆలోచన అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయింపు..: సోమవారం ఉదయం చనిపోయిన బల్లులు పడిన పాత్రలను శవయాత్రలా హాస్టల్స్ నుంచి వైవీయూ ప్రధానద్వారం వద్దకు తీసుకువచ్చి అక్కడ బైఠాయించి విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో పెండ్లిమర్రి ఎస్‌ఐ రోషన్ నేతృత్వంలో పోలీసుల బృందం అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అయినప్పటికీ వారు శాంతించారు. వీరికి జతగా లేడీస్ హాస్టల్ విద్యార్థినులు సైతం హాస్టల్ ద్వారం వద్ద బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. దీంతో వైస్ చాన్సలర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, చీఫ్ వార్డెన్ ఆచార్య గులాంతారీఖ్ తదితరులు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పలువురు విద్యార్థి సంఘనాయకులు వైస్ చాన్సలర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వైవీయూలో పెల్లుబికిన ఆందోళన
Published Tue, Mar 7 2017 3:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement