సెస్సు.. లెస్సు! | Local Administrators Are Not Paying Cess Bills In Chittoor | Sakshi
Sakshi News home page

సెస్సు.. లెస్సు!

Published Mon, Oct 14 2019 8:20 AM | Last Updated on Mon, Oct 14 2019 8:20 AM

Local Administrators Are Not Paying Cess Bills In Chittoor - Sakshi

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి సెస్సు వసూలు చెల్లించకపోవడం అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థలు వసూలు చేసుకున్న సెస్సు సంస్థకు అందితే అభివృద్ధి పనులు, వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుంది. జిల్లాలో ఇప్పటికీ ఏడు మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది. గ్రంథాలయాలకు వస్తున్న వారంతా నిరుద్యోగులు, విద్యార్థులు. వీరికి పోటీ పరీక్షల సామగ్రి, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే సెస్సు నిధులు అందనందున అధికారులు దీనిపై స్పష్టమైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా జిల్లాలో గ్రంథాలయాలు నీరసించిపోతున్నాయి.

సాక్షి, బి.కొత్తకోట(అనంతపురం) : జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజల నుంచి వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్సును జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ పూర్తిస్థాయి సెస్సులు చెల్లించకపోవడంతో గ్రంథాలయ సంస్థ జిల్లాలో పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. స్థానిక సంస్థల నుంచి అందాల్సిన సెస్సు కోసం జిల్లా అధికారులతో మొరపెట్టుకొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 33 మేజర్‌ గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాటలిటీలు, రెండు కార్పొరేషన్లలో గ్రంథాలయాల నిర్వహణ సాగుతోంది. 71 గ్రంథాలయాలు నడుస్తుండగా అందులో గ్రేడ్‌–1 నాలుగు, గ్రేడ్‌–2 తొమ్మిది, గ్రేడ్‌–3లో 59 గ్రంథాలయాలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 12 పనిచేస్తుండగా, మిగిలినవి మండల కేంద్రాల్లో ఉన్నాయి.

జిల్లాలో 7 మండలాలకు గ్రంథాయాలు ఏర్పాటు కాలేదు. కాగా జిల్లాలో గ్రంథాలయాల నిర్వహణకు ఆర్థిక మూలాధారం సెస్సు.   స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ప్రజలనుంచి వసూలుచేసే పన్నుల్లో భాగంగా గ్రంథాలయ సెస్సును కూడా వసూలు చేస్తారు. ఇవి రూ.100కు రూ.8 సెస్సుగా వసూలు చేస్తారు. ఈ సెస్సును స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేయాలి. అయితే సెస్సు వసూలు చేసుకుంటున్న స్థానిక సంస్థలు దాన్ని చెల్లించడం లేదు. దీంతో 2007–08 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు సెస్సు బకాయి రూ.14.78 కోట్లు పెండింగ్‌లో ఉంది. జిల్లాలోని 34 పంచాయతీలనుంచి రూ.3,86,01,864 పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ.10,92,18,800 బకాయి పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం రూ.14,78,20,664 పెండింగ్‌లో ఉన్నాయి. 

నోటీసులిస్తూనే ఉన్నాం 
సంస్థకు రావాల్సిన సెస్సు కోసం పంచాయతీలకు నోటీసులిస్తున్నాం. పలుమార్లు జిల్లా అధికారులను కలిసి విన్నవించాం. స్థానిక సంస్థలు వసూలు చేసుకుంటున్న సెస్సు చెల్లిస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది. గ్రంథాలయాల స్థాయి పెంచుకోవడం ముఖ్యం. నిధులు చెల్లించేందుకు స్థానిక సంస్థలు సహకరించాలి. 
– జి.రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, చిత్తూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement