చినబాబుకు పట్టం!
లోకేశ్‌కు టీడీపీలో కీలక బాధ్యతల అప్పగింతపై చంద్రబాబు దృష్టి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంపై ఆయన తండ్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వాస్తవానికి కుమారుడికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలని బాబు ఎప్పట్నుంచో అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన పది నెలల నుంచి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చే నేతలకు.. ఒకసారి లోకేశ్ బాబును కూడా కలవకపోయారా అని చెబుతూ.. కుమారుడికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని నేతలు గుర్తించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ రకంగా పార్టీలో లోకేశ్ ప్రాధాన్యతను క్రమంగా పెంచాలని, వచ్చే మహానాడులో ఆ మేరకు ఒక ప్రకటన చేయాలని కూడా చంద్రబాబు భావించారు. కుమారుడి విషయంలో ఎంతచేసినా.. తెలుగుదేశంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీనియర్ల నుంచి వ్యతిరేకత తప్పదనే సంకేతాలు రావడంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. తాను నిర్ణయం ప్రకటించడం కాకుండా కిందిస్థాయి నుంచి ఈ డిమాండ్ చేయించి, ఆ తర్వాత ఎంపిక చే స్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పథకంలో భాగంగానే పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలతో మాట్లాడించారు.
గత మహానాడుతోనే మొదలు
గత మహానాడు సందర్భంగానే చంద్రబాబు ఈ మేరకు పునాది వేశారు. లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నియమించారు. అప్పట్నుంచే పార్టీలో అంతా తానే అన్నట్టుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టుల అప్పగింత వంటి అనేక వ్యవహారాల్లో గత పది నెలలుగా లోకేశ్ జోక్యం విపరీతంగా పెరిగిందని టీడీపీ నేత లే అంగీకరిస్తున్నారు. ఈ విధంగా.. ముఖ్యంగా పెద్దాచిన్నా తేడా లేకుండా నేతల వ్యవహారాల్లో లోకేశ్ జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువురు సీనియర్లు సందర్భోచితంగా పార్టీ నేతల సమావేశాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని గమనించిన బాబు స్పీడును కొంత తగ్గించారు. తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఇస్తున్నట్టు ఎన్నికలకు ముందు లీకులు ప్రచారంలో పెట్టారు. ఎన్నికల ముగిసిన తర్వాత ఆ విషయం ఎక్కడా ప్రస్తావనకు రాకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్త పడింది. లోకేశ్‌ను తెరమీదకు తేవడంపై మరింత ముమ్మరంగా దృష్టి సారించింది.
ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అటు తెలంగాణలోను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. డివిజన్, వార్డు, మం డల, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలూ జరుగుతున్నా యి. ఈ సందర్భంగానే ఎక్కడికక్కడ లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ నేతల నుంచి వచ్చేలా ఎన్‌టీఆర్ భవన్ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఆయా సమావే శాల్లో లోకేశ్‌కు పార్టీలో కీలకమైన పదవి అప్పగించాలని కోరుతూ తీర్మానాలు సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మూడో వారం చివరలో జిల్లా స్థాయి సమావేశాలు (మహానాడులు) జరగనున్నాయి. వీటిల్లో కూడా లోకేశ్‌కు కీలక బాధ్యతలపై తీర్మానాలు చేయించటంతో పాటు నేతల నుంచి డిమాండ్లు చేయించనున్నట్టు సమాచారం.
ముందుగా నిర్ణయించిన ప్రకారం.. వచ్చే నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో టీడీపీ మహానాడు జరగనుంది. ఆ మహానాడులోనూ లోకేశ్‌కు బాధ్యతల అప్పగింతపై నేతలు పెద్దఎత్తున డిమాండ్ చేసేలా ఇప్పటికే వ్యూహం సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్‌ను కూర్చోబెట్టాలన్నదే చంద్రబాబు లక్ష్యమని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్‌కు రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించాలనేది బాబు వ్యూహమని చెబుతున్నారు.
జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా పార్టీ తీర్మానం చేస్తుంది. పార్టీకి జాతీయ హోదా లేనప్పటికీ ముందుముందు విస్తరిస్తామన్న పేరుతో చంద్రబాబు ఆ హోదాలో కొనసాగుతారని చెబుతున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభాగాలకు వేర్వేరుగా కార్యవర్గాలను ప్రకటిస్తారు.
ఏపీ విభాగం అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావును నియమించనున్నట్టు సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఎల్. రమణ కొనసాగుతున్నారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.