వినాయకుడి విగ్రహం తీసివేసిన ప్రదేశాన్ని చూపుతున్న గ్రామస్తులు (ఇన్‌సెట్‌లో) విరగ్గొట్టిన వినాయకుడి విగ్రహం
కావలిరూరల్: వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మంగళవారం రాత్రి లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. రూరల్ పోలీసులు, లక్షీపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామం చివరన చెరువు కట్ట సమీపంలో వినాయకుడి విగ్రహం ఉంది. కొన్ని తరాలుగా అక్కడ ఉన్న విగ్రహానికి స్థానికులు పూజలు చేస్తున్నారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులకు విగ్రహం కనిపించలేదు. దీంతో పరిసరాల్లో వెతకగా చెరువులోని నీటిలో సగం విరిగిన విగ్రహం కనిపించింది. దీంతో ఊర్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
పూజలు చేసి..
ఏకశిల విగ్రహమైన వినాయకుడి ప్రతిమను అపహరించి ధ్వంసం చేశారు. చాతి భాగం నుంచి కింది భాగం వరకు తీసుకెళ్లారు. మిగిలిన పైభాగం అక్కడ చెరువులోని నీటిలో పడవేశారు. వినాయక నిమర్జనం సమయంలో చేసే పూజలు ఇక్కడ చేశారు. పూలు, పండ్లు, నవధాన్యాలు నీటిలో వేసి ఉన్నారు. సమీపంలో పూజలకు ఉపయోగించిన నూనె, కర్పూరం అగ్గిపెట్టె ఉన్నాయి. దుండగులు చెరువు వద్ద మద్యం సేవించిన ఆనవాళ్లున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఊరికి అరిష్టం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
గుప్తనిధి కోసమేనా?
వినాయకుడి విగ్రహం బొజ్జలో బంగారం, వజ్రాలు ఉంటాయని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. పొరుగునే ఉన్న పేపాలవారిపాలెంలో సుమారు 6 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment