సాలూరులో లారీలు
గడిచిన ఎన్నికల సమయంలో సాలూరు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతవాసులకు ఏదేదో చేస్తామని హామీలు గుప్పించారు. ముఖ్యంగా లారీ పరిశ్రమకు పేరొందిన ఈ ప్రాంత లారీ యజమానులు, కార్మికుల సంక్షేమానికి కల్లబొల్లి హామీలన్నీ ఇచ్చేశారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే ప్రాంతానికి గురువారం సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలిస్తారా! కొత్తవి ఇస్తారా! ఏమైనా ఇక బాబును నమ్మం బాబూ...అంటున్నారు.
సాక్షి, సాలూరు: ప్రతిపక్ష నాయకుడిగా 2014 ఎన్నికల ప్రచారానికి సాలూరు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాలూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రధానంగా లారీ పరిశ్రమ, యజమానులు, కార్మికుల సంక్షేమానికి ఏవేవో చేసేస్తానని హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేశారు. మళ్లీ ఎన్నికలు రావడంతో మాకే ఓట్లేయాలని ఎప్పటిలాగే ప్రచారానికి రోడ్ షో పేరుతో గురువారం సాలూరు పట్టణానికి సీఎం వచ్చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఆయనకు, ఆ పార్టీ నాయకులకు గుర్తున్నాయో... లేదోగానీ నియోజకవర్గం ప్రజలకు మాత్రం మదిలోనే మెదులుతున్నాయి.
అప్పట్లో పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షోభంలో వున్న లారీ పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. ఆటోలు, జీపులు, లారీల కొనుగోలుకు రాయితీపై రుణాలను మంజూరు చేస్తామన్నారు. లారీ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలను స్థాపించి, కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా చెప్పారు. మోటారు పరిశ్రమపైనే ఆధారపడ్డ కుటుంబాలు సాలూరులో ఎక్కువుగా వున్నందున పదో తరగతి పాసవ్వకపోయినా డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
40ఏళ్లుగా సాలూరు పట్టణవాసులు కలగంటోన్న బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, దానిగుండానే సాలూరు వస్తానన్నారు. సంధ్యారాణి విజ్ఞప్తి మేరకు అరకు రహదారిని పూర్తి చేస్తామని ప్రకటించారు. వంద పడకల ఆస్పత్రిగా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిని మారుస్తామన్నారు. ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసారో చంద్రబాబు చెప్పాలన్న డిమాండ్ వ్యక్తమౌతోంది. లారీ పరిశ్రమ అభివృద్ధికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్న వాదన వినవస్తోంది. అలాగే సాలూరు బైపాస్ రోడ్డుకు రైతులు ఆనందంగా భూములిచ్చినా, ఆపై రెండేళ్లుగా కదలిక లేకుండాపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆటోనగర్ పరిస్థితి కూడా మొండిగోడలు, అరకొర సౌకర్యాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏమాత్రం పురోగతి లేకుండా మిగిలి వుంది. వంద పడకల ఆస్పత్రి హామీని మాత్రం ఎన్నికల కోడ్ నేడో, రేపో కూసేస్తుందన్న సమయంలో ప్రకటించారే తప్ప, ప్రజలపై అభిమానంతో కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబు రోడ్‌షో పేరుతో అదే బోసుబొమ్మ జంక్షన్‌కు వస్తున్నందున మళ్లీ అవే హామీలు ఇస్తారా?, ఇంకేమైనా కొత్త హామీలు కురిపిస్తారా...! అన్న చర్చ జరుగుతోంది.
హామీలు నీటి మూటలయ్యాయి...
చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మారాయి. విజయవాడ తర్వాత లారీ పరిశ్రమకు పెట్టింది పేరైన సాలూరులో లారీ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారే ఎక్కువుగా వున్నారన్న విషయం తెలుసుకుని ఓట్లు కోసం గాలమేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ఊసే పూర్తిగా మరిచిపోయారు. పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామన్న హామీని పదవీకాలం ముగుస్తోన్న తరుణంలో జీఓను ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తునే వున్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.
– జరజాపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు
ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు...
ముఖ్యమంత్రి అయితే ఎంతో మేలు చేసేస్తానని నమ్మించి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఏమీ చేయలేదు. సాలూరు ప్రాంతవాసులను వంచించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు?. సాలూరు నియోజకవర్గం వాసులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయి. హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజల ముందుకు రావడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు.
– పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment