ఆసరా కోల్పోయి.. అప్పులు తీర్చలేక! | Lost prop .. Able to redeem the debts! | Sakshi
Sakshi News home page

ఆసరా కోల్పోయి.. అప్పులు తీర్చలేక!

Published Thu, Dec 19 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

ఆసరా కోల్పోయి.. అప్పులు తీర్చలేక!

ఆసరా కోల్పోయి.. అప్పులు తీర్చలేక!

=రాంబాబు మరణంతో కుటుంబీకుల డీలా
 =సాగుచేసినందుకు చనిపోలేదంటూ తహశీల్దార్ విచారణ నివేదిక
 =ఆగని మరణమృదంగంపై అధికారుల స్పందన ఇదీ..

 
సాక్షి, మచిలీపట్నం/కూచిపూడి, న్యూస్‌లైన్ : పుడమితల్లిని నమ్ముకున్న కౌలురైతు గుండె ఆగింది.. అతడిని నమ్ముకున్న ఆ కుటుంబం ఆసరా కోల్పోయింది.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది.. ఆపన్నహస్తం అందించాల్సిన అధికార యంత్రాంగం సాకులకోసం    వెదుకుతోంది. మొవ్వ మండలం అవురుపూడికి చెందిన రైతు మేడిశెట్టి రాంబాబు (56) మరణంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే అతడు కౌలుసాగు చేయడంవల్ల చనిపోలేదని తహశీల్దార్ విచారణలో తేల్చేశారు.

తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను చూసి రాంబాబు గత నెల 28న గుండెపోటుతో చనిపోయిన సంగతి విదితమే. ఆ విషయాన్ని కుటుంబసభ్యులు తెలపడంతో ‘ఆగని మరణమృదంగం.. ఆగిన మరో రైతుగుండె’ శీర్షికన గత నెల 30న సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై తాము గ్రామంలో విచారణ నిర్వహించినట్టు మొవ్వ తహశీల్దార్ జి.భద్రు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు కొడుకులున్న రాంబాబుకు కొంత సొంత మాగాణితోపాటు కౌలుకు కూడా పొలాన్ని చేస్తున్నాడని విచారణలో తేలినట్టు పేర్కొన్నారు. అతడి చేను తుపాను, వర్షాలకు దాదాపు 50 శాతం దెబ్బతిందని వివరించారు. అయితే కౌలురైతుగా నమోదుకు అర్జీ పెట్టుకోలేదని, అతడి మరణంపై కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టలేదని, పోస్టుమార్టం కాలేదని, ఈ పరిస్థితుల్లో రాంబాబు చేను దెబ్బతిన్నందునే గుండె ఆగి మరణించినట్లు కాదని తహశీల్దార్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
 
ఆ కుటుంబానికి దిక్కేది..

ఈ పరిస్థితుల్లో ఆసరా కోల్పోయిన ఆ  కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. రాంబాబు మృతిచెందడంతో కుటుంబ సభ్యులను అప్పుల బాధలు మరింత కుంగదీస్తున్నాయి. అతడు కౌలుకు పొలాన్ని సాగుచేస్తూ అప్పులపాలై గుండెపోటుతో మరణించాడని, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుటుంబసభ్యులు బుధవారం తెలిపిన వివరాలివి.. అవురుపూడి కరణం రక్తసంబంధీకులకు చెందిన ఐదెకరాలతోపాటు మాగంటి హరిబాబుకు చెందిన 5.20 ఎకరాలు, విజయవాడకు చెందిన బర్మా వెంకటేశ్వరరావుకు చెందిన 2.11 ఎకరాలు, బర్మా ఉదయకుమారికి చెందిన 3.50 ఎకరాలు కౌలుకు చేస్తూ సొంత పొలం 1.80 ఎకరాలను సాగుచేస్తున్నామన్నారు.

తాము తమ తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నామని కుమారులు మేడిశెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ చెప్పారు. హెలెన్, లెహర్ తుపానులకు పంట మొత్తం నేలపాలైందని, సాగు కోసం అటు బ్యాంకులు, ఇటు వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేనన్న మనోవ్యధను అనుభవించారని చెప్పారు. ఏ విధమైన దురలవాటు లేక ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ తండ్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అప్పులిచ్చినవారు ఊపిరాడనీయడం లేదన్నారు.  నిమ్మకూరు ఆంధ్రాబ్యాంకు, స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ, గూడూరు కో-ఆపరేటివ్ బ్యాంకులతోపాటు బయట వడ్డీలకు తెచ్చిన అప్పులు సుమారు రూ.4.50 లక్షల వరకు ఉన్నాయని రాంబాబు భార్య రామ తులశమ్మ, పెద్ద కోడలు వెంకట నాగజ్యోతి, కుమారులు ఆవేదన చెందుతున్నారు.  
 
 మనోవ్యధతో మరణించాడు..
 రాంబాబుకు ఏ దురలవాట్లు లేవు. ఐదారేళ్లుగా కౌలు చేస్తున్నాడు. అప్పులు కూడా ఉన్నాయి. పంటచేను దెబ్బతిని మనోవ్యధ పడి గుండెపోటుతో మృతి చెందాడు. అతడు చనిపోయిన మూడో రోజు నుంచే అప్పిచ్చినవాళ్లు పంచాయితీ పెట్టారు.
 -ఏనుగు మోహనరావు, సర్పంచి, అవురుపూడి
 
 అతడి గుండె ఆగిపోయింది..
 రాంబాబు చనిపోయిన రోజు కూడా విపరీతంగా వర్షం పడింది. దీనివల్ల పొలాలు మరింత నీట మునిగాయి. ఇదే విషయాన్ని పలువురితో చర్చించాడు. ఇంటికి వెళ్లి టీవీలో తుపాను సమాచారాన్ని చూస్తుండగా గుండె ఆగింది. ఈ విషయం  గ్రామంలో అందరికీ తెలుసు.
 -కుక్కల రాఘవులు, వ్యవసాయదారుడు
 
 అప్పులబాధతో చనిపోయినట్టు అందరికీ తెలుసు..
 ఇటీవల నుంచి వ్యవసాయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎంతో సౌమ్యుడిగా పేరొందిన రాంబాబు అప్పులకు భయపడి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంగతి  గ్రామస్తులందరికీ తెలుసు. ఇదే విషయాన్ని వారు ఎమ్మెల్యే, వీఆర్వోకు కూడా చెప్పారు.
 - కుక్కల శ్రీనివాసరావు, గ్రామస్తుడు
 
 పొలం నష్టంపై ఆరాతీస్తాను..
 రాంబాబు చనిపోయిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. పోస్టుమార్టం చేయలేదు. కౌలు గుర్తింపు కార్డు కూడా లేదు. ఇదే విషయాన్ని అతడు చనిపోయిన రెండు రోజులకే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. అయితే పొలాల్లో పంట ఎంత నష్టం జరిగింది? అతను చనిపోవడంతో కుటుంబ పరిస్థితి.. అప్పులు తదితర విషయాలపై ఆరాతీస్తాం.  
 -జి.భద్రు, తహశీల్దార్, మొవ్వ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement