ప్రేమించాడని.. హత్య | Loved .. Murder | Sakshi
Sakshi News home page

ప్రేమించాడని.. హత్య

Published Sun, Jan 19 2014 2:39 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Loved .. Murder

తొండూరు, న్యూస్‌లైన్: ప్రేమించాడనే నెపంతో ఓ యువకుడు హత్యకు గురైనట్లు పులివెందుల డీఎస్పీ హరినాథబాబు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మండలంలోని మల్లేల ఘాట్ సమీపంలోని కొండలలో శనివారం లభ్యమైన యువకుడి మృతదేహాన్ని డీఎస్పీ తన సిబ్బందితో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతుడిది కదిరి మండలం చలమకుంట్లపల్లెకు చెందిన రవి(20)గా గుర్తించామన్నారు.
 
  దుస్తుల ఆధారంగా చనిపోయింది తన కుమారుడే అని మృతుడి తండ్రి శివ తెలిపారన్నారు. కదిరి మండలం చలమకుంట్లపల్లెకు చెందిన శివ, రామాంజనమ్మల కుమారుడు కూటగుళ్ల రవి కుటుంబ సభ్యులతో కలిసి రెండేళ్లుగా బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేసుకుంటుండేవాడన్నారు. చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లెకు చెందిన ఈశ్వరరెడ్డి తన కుటుంబంతో కలిసి బెంగుళూరులో ప్రయివేట్ ఫ్యాక్టరీలో కూలీ పనులు చేసుకుంటుండేవాడని చెప్పారు. వీరిరువుకే ఒకే ప్రాంతంలో ఉంటూ స్థానిక ఫ్యాక్టరీలలో కూలీ పనులకు వెళుతుండేవారని తెలిపారు. ఈ క్రమంలో ఈశ్వరరెడ్డి కుమార్తెను రవి ప్రేమించాడన్నారు.
 
 కొద్దిరోజుల తర్వాత రవి  చలమకుంట్లపల్లెకు ఈశ్వరరెడ్డి కుమార్తెతో కలిసి వచ్చారని,  వీరి ప్రేమ వ్యవహారాన్ని ఈశ్వరరెడ్డి అంగీకరించకపోవడంతో పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగి ఇరువురిని విడదీశారని వివరించారు. ఈశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వేంపల్లెలో నివాసం ఉంటున్నారన్నారు.  డిసెంబర్ 24, 25వ తేదీలలో తన కుమార్తెకు పెళ్లి నిశ్చయించుకొని వివాహం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రవి ఈశ్వరరెడ్డికి ఇంటికి వెళ్లి నేను ప్రేమించిన అమ్మాయిని వేరే వారు ఎలా పెళ్లి చేసుకుంటారని వాదించి పులివెందులలో ఉన్న తన మేనమామ ఇంటికి వచ్చాడన్నారు.  తన కుమార్తె వివాహానికి అడ్డుపడుతాడనే ఉద్దేశ్యంతో ఈశ్వర్‌రెడ్డి తన పెద్ద అల్లుడిని రవి మేనమామ ఇంటికి పంపించాడని చెప్పారు. అతను రవికి మాయమాటలు చెప్పి పులివెందుల నుంచి కొద్దిదూరం బయటికి తీసుకురాగా ఈశ్వరరెడ్డి ఆటోలో వచ్చి తన అల్లుడితోపాటు రవిని కూడా ఆటోలో ఎక్కించుకొని ముద్దునూరు వైపు బయలుదేరారన్నారు. మల్లేల ఘాట్ సమీపంలోకి రాగానే పక్కనే ఉన్న కొండ లోపలికి రవిని తీసుకె ళ్లి ఈశ్వరరెడ్డితోపాటు మరికొంతమంది బండరాళ్లతో కొట్టి చంపి మృతదేహాన్ని కనిపించకుండా రాళ్లతో పూడ్చారని తెలిపారు. హత్యపై విచారిస్తున్నామని పూర్తి వివరాలు వెళ్లడిస్తామని ఆయన అన్నారు.
 
 సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ
 జమ్మలమడుగు ఏఎస్పీ వెంకటప్పలనాయుడు, కొండాపురం సీఐ నారాయణమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి  జరిగిన సంఘటన పై  మృతుడి బంధువుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తొండూరు ఎస్‌ఐ మధుమల్లేశ్వరరెడ్డి, పీఎస్‌ఐ చెన్నకేశవులు, పులివెందుల, తొండూరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 
 రవిపై పులివెందులలో మిస్సింగ్ కేసు నమోదు
 రవి డిసెంబర్ 24వ తేదీ నుండి  కనిపించలేదని పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 8వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ భాస్కర్ తెలిపారు. రవి బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయగా దర్యాప్తులో  హత్యకు గురైనట్లు తేలిందని తెలిపారు. రవి మృతదేహానికి పులి వెందుల ఏరియా ఆసుపత్రి డాక్టర్ అమరనాథ్ పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement