ప్రేమ..అందమైన, మధురమైన అనుభూతి. ఎవరెన్ని భాష్యాలు చెప్పినా ప్రేమ అమరం. మది శాసిస్తే దొరకదు. ఎవ్వరినైనా తన పంజరంలో బంధించగలదు. మనల్ని పూర్తిగా తన వశం చేసుకొనే శక్తి దానికే ఉంది. కులమతాల గోడలను బద్దలు కొట్టుకొని, సామాజిక కట్టుబాట్లను తెంచుకొని సజీవంగా నిలబడుతోంది. ఏ స్వార్థానికి లొంగనిది, ఎంతటి త్యాగానికైనా వెనుకాడనిది ప్రేమ.
ప్రేమ గుడ్డిది అంటారు కొందరు..ఇది దేవునితో సమానమంటారు మరికొందరు..ఎవరి వాదన ఎలా ఉన్నా యువత మాత్రం ఈ జపం చేయకుండా ఉండలేకపోతోంది. హృదిలో ఈ భావన మొదలవగానే వారు ఈ ప్రపంచాన్ని మరచిపోతారు. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కనిపెంచిన తల్లిదండ్రులను కాదని, అండగా ఉండే బంధువులను సైతం వదులుకొనేందుకు సిద్ధపడతారు. ప్రేమను గెలిపించుకునేందుకు పెద్ద యుద్ధమే చేస్తారు. కులమతాలు, పేదధనిక..తదితదర తారతమ్యాలను అధిగమించి వివాహంతో వీరు ఒక్కటై సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ప్రేమలో విజయం సాధించడంతోపాటు దాంపత్య జీవనంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. శనివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వీరి స్ఫూర్తి గాథలు ..
ప్రేమ ‘స్వరూప’ం..
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన డాక్టర్ శంకర్ శర్మ, అనంతపురం జిల్లా పామిడి మండలం ఇల్లూరు గ్రామానికి చెంది డాక్టర్ స్వరూప రాణిది ప్రేమ వివాహం. కర్నూలు మెడికల్ కాలేజీలో కలిసి పనిచేయడంతో వీరు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా పెద్దల అంగీకారంతోనే వీరు పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కులాలు ఏ విధంగానూ అడ్డు రాలేదని, తమ పెళ్లిని సమాజం కూడా అంగీకరించిందని వీరు తెలిపారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని, దాంతో పాటు అనుబంధం, ఆత్మీయత కూడా మెండుగానే ఉంటుందన్నారు. పిల్లలకు పెళ్లిళ్ల విషయంలో కొన్ని సమస్యలు వస్తాయని, వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. స్వార్థం లేని ప్రేమ దైవంతో సమానమని వీరు పేర్కొన్నారు.
-డాక్టర్ బి. శంకరశర్మ, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు
ప్రేమ ‘ప్రసన్న’ం
‘‘ ప్రేమించు కానీ కెరీర్‌ను మాత్రం మరిచిపోకు... నీ బాధ్యతలను విస్మరించకు... ఓ పద్ధతి లేని ప్రేమకు మనుగడ లేదు’’ అంటున్నారు ఆలూరుకు చెందిన కిషోర్‌బాబు, ప్రసన్న దంపతులు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివే సమయంలో ఈయనకు తిరుపతికి చెందిన ప్రసన్న అనే విద్యార్థితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాక తల్లిదండ్రుల అంగీకారం మేరకు పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైనా..తాము అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నామని వీరు తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే వారి ప్రేమకు అర్థం ఉంటుందని చెప్పారు.
‘రత్న’ంలాంటి ప్రేమ
వీరిది మతాంతర ప్రేమ వివాహం. మొదట పెద్దలను నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా వారిని ఒప్పించి చివరకు ఒకటయ్యారు. వారే శిరివెళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు రత్నమ్మ, పఠాన్ షాహినూర్‌లు. ఎంకాం వరకు చదివిన రత్నమ్మ స్థానిక జె డ్పీ ఉన్నత పాఠశాలలో రెండు సంవత్సరాలు విద్యావలంటీర్‌గా పనిచేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఈమె పేరును సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. భర్త ప్రోత్సాహంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఒక వైపు గృహిణిగా, మరో వైపు ప్రజాప్రతినిధిగా భాద్యతలు నెరవేరుస్తూ ఈమె ముందుకు సాగిపోతున్నారు. తమ సంసారంలో ఎలాంటి
ఒడిదుడుకులు లేవని ఈమె చెప్పారు.
మనసునమనసై..
రుద్రవరం గ్రామం చెన్నుని వీధికి చెందిన కరీంబాషా, ఆదే కాలనీలో ఉంటున్న వెంకట సుబ్బమ్మలది ప్రేమ వివాహం. వెంకట సుబ్బమ్మ వికలాంగురాలు అయినప్పటికీ తోటి వారికి సహాయ పడేగుణం. అది గమనించిన కరీంబాషా ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. అయితే పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారికి తెలియకుండా 2007లో పెళ్లి చేసుకున్నారు. ఇరువురు మేజర్లు కావడంతో రుద్రవరం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్‌ఐ దస్తగిరి బాబు వారి కుటుంబ పెద్దలను స్టేషన్‌కు పిలిపించుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వీరు నంద్యాల పట్టణంలో నివాసం ఉంటున్నారు.
వెంకటసుబ్బమ్మ బీఈడీ పూర్తి చేసింది. వీరికి ఇమ్రాన్, ఇర్ఫాన్ ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు సంవత్సరాల అనంతరం పెద్దలు శాంతించారు. కరీంబాషా గ్రామంలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. వెంకటసుబ్బమ్మ కస్తూరిభా గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ దాపత్య జీవితంలో ఎటువంటి మనస్పర్థలు రాలేదని వారు చెప్పారు.
‘ప్రియ’మైన ప్రేమ
వారిద్దరివీ వేర్వేరు కులాలు. పెద్దలు వద్దన్నా ప్రేమను కాదనలేకపోయారు. వివాహం చేసుకొని అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా వారిరువురూ స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకొని వచ్చి పత్తికొండ పట్టణంలో కాపురం పెట్టారు. ఫలించిన ప్రేమగురించి ఆవుల బలరాముడు మాట్లాడుతూ..‘‘ నేను ఇంటర్ చదువుతున్న సమయంలో టెన్త్ చదువుతున్న ప్రియాంకతో స్నేహం ఏర్పడింది. డిగ్రీలోకి చేరాక ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగడంతో 2012 జూన్‌లో 20 తేదీన స్నేహితుల సహకారంతో తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. భార్య ప్రియాంక ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మేం ముందుకు సాగుతున్నాం.
ప్రేమ తరగనిధి
Published Sat, Feb 14 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM
Advertisement
Advertisement