యంత్రం...కుతంత్రం
► యంత్రాలతో ఉపాధి పనులు
► కూలీల నగదు దిగమింగే ప్రయత్నం
ఉదయగిరి/వరికుంటపాడు : జాతీయ ఉపాధిహామీ పనులకు సంబంధించి యంత్రాలు ఉపయోగించకూడదు. కానీ ఈ నిబంధనను తుంగలో తొక్కి యంత్రాలతో పనులు చేస్తూ ఉపాధి కూలీల సొమ్మును దిగమింగే ప్రయత్నం వరికుంటపాడు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది.
కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు ఉపాధి హామీ సిబ్బందిలో స్థానం సంపాదించుకొని అందులో పనిచేస్తున్న అధికారులను ప్రసన్నం చేసుకొని నిధులు దోపిడీ చేస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో చేతులెత్తేస్తున్నారు. యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తే ఇంటికెళ్లవలసిందేనని ఓ వైపు జిల్లా కలెక్టర్, డ్వామా పీడీ హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం ఖాతరు చేయడం లేదు.
వరికుంటపాడు మండలం గువ్వాడిలో వర్క్ ఐడీ నం.091240219021170083తో ఎస్సీ కాలనీల్లో ఇంటి స్థలాల లెవెలింగ్ పేరుతో రూ.3,17,591 నిధులు మంజూరు చేశారు. దీనికి 771 మంది కూలీలను వినియోగించవలసి ఉంది. ఇందులో కూలీలు మట్టిని తవ్వి ట్రాక్టర్లకు పోస్తారు. దీనిని ఎస్సీ కాలనీల్లో అవసరమైన వారికి ఇంటి స్థలాలు చదును చేసేందుకు తోలుతారు. ట్రాక్టరు రవాణాకు సంబంధించి యజమానికి నగదు ఇస్తారు. కానీ ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందిన ఓ మేట్ తన పలుకుబడి ఉపయోగించి ముందస్తు వ్యూహం ప్రకారం గురు, శుక్రవారాల్లో పొక్లయిన్ ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా ఎస్సీ కాలనీల్లో ఇంటింటికి అవసరమున్నా, లేకపోయినా మట్టి తోలారు.
ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే తమకు అనుకూలమైన గ్రూపుల పేర్లతో మస్టర్లు వేసి నగదు కాజేసేందుకు వ్యూహరచన చేశారు. ఒకవేళ అభ్యంతరాలు వస్తే ప్రస్తుతానికి ఆ వర్క్‌కు మస్టర్లు వేయకుండా ఆపివేసి అనుకూలమైన సమయంలో మస్టర్లు వేసుకొని నిధులు దిగమింగే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. అదేవిధంగా గ్రామంలో చెరువుకట్టపైనున్న చెట్లను యంత్రాలతో తొలగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉపాధిహామీ పథకం కింద ఈ పని మంజూరు కాలేదు. ముందుగా పనిచేసి ఆ తర్వాత ఆ పనికి సంబంధించి మంజూరుపొంది దానికి సంబంధించిన నిధులను కాజేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు గ్రామస్తులు చెబుతున్నారు.
మట్టి తోలకంతో ఇక్కట్లు
ఎస్సీ కాలనీల్లో నీరు నిలబడే ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లకు అవసరమైన మేరకు మంచి మరసతో కూడిన మట్టిని తోలవలసి ఉంది. కానీ ఈ పనిచేయించిన కాంట్రాక్టరు తాను గతంలో ఇరిగేషన్ కింద పనిచేసిన చెక్‌డ్యాంలో ఉన్న మట్టిని ఎస్సీ కాలనీలకు తరలించారు. ఈ మట్టి నాణ్యత లేకపోవడం, పెద్దపెద్ద రాళ్లు, గుండులతో కూడి ఉండటంతో దీనిని ఎలా చదును చేసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.
పైగా అవసరం లేకపోయినప్పటికీ పలువురి ఇళ్లముందు మట్టి తోలారు. దీంతో తమకు చాలా ఇబ్బందిగా ఉందని వారు చెబుతున్నారు. అయితే సదరు కాంట్రాక్టరు ఒకే పనికి రెండు బిల్లులు పొందే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ కింద చేపట్టిన చెక్‌డ్యాం పూడికతీత పనికి సంబంధించిన బిల్లు, ఈ పూడికను ఎస్సీ కాలనీలకు తోలడం ద్వారా ఆ పనికి సంబంధించిన నగదును కాజేసే ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.