వాణిజ్య వాహనాల అభివృద్ధికి వ్యయం
టాటా మోటార్స్ ఈడీ గిరీశ్ వాఘ్
న్యూఢిల్లీ: కొత్త వాణిజ్య వాహనాలు, యంత్ర పరికరాల అభివృద్ధిపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడిని కొనసాగిస్తామని టాటా మోటార్స్ ఈడీ గిరీశ్ వాఘ్ వెల్లడించారు. ఇందులో ఎలక్ట్రిఫికేషన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, కనెక్టెడ్ వెహికిల్ ప్లాట్‌ఫామ్ వంటి నూతన సాంకేతికతలపై 40 శాతంపైగా వెచి్చస్తామన్నారు.
సంస్థకు చెందిన వాణిజ్య వాహన విభాగం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఉద్గారాలను వెదజల్లని బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వంటి వివిధ సాంకేతికతలపై పని చేస్తోందని చెప్పారు. సున్నా ఉద్గారాల దిశగా పరివర్తన వెంటనే జరగదు కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నామని అన్నారు. ‘నగరాలు, సమీప దూరాలకు బ్యాటరీ వాహనాలు పనిచేస్తాయి. సుదూర ప్రాంతాలకు, అధిక సామర్థ్యానికి హైడ్రోజన్ వంటి సాంకేతికత అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ పరిష్కరించే సాంకేతికతలలో పెట్టుబడి పెట్టాం’ అని వివరించారు.
హైడ్రోజన్ ట్రక్స్..
హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ట్రక్స్‌ను మార్చిలోగా పైలట్ ప్రాతిపదికన వినియోగిస్తామని గిరీశ్ వాఘ్ వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఐవోసీఎల్‌తో కలిసి కంపెనీ 18 నెలల పాటు మూడు రూట్లలో ఈ ట్రక్కులను నడుపనుంది. ఫలితాలను బట్టి వాహనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని
చెప్పారు. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వాఘ్ పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసిన 15 ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ బస్‌లు ఐవోసీఎల్ 10 నెలలుగా వినియోగిస్తోందని వివరించారు. ఒకట్రెండేళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ వాహనాలను వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment