వెద పద్ధతికి శ్రీకారం
తెనాలిటౌన్: డెల్టాలో వెద పద్ధతిలో వరిసాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలు పదును కావడంతో వెద సాగుకు రైతులు సిద్ధపడుతున్నారు. పొలాలను ట్రాక్టర్‌లతో దున్ని చదును చేస్తున్నారు. డెల్టా పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది రెట్టింపు విస్తీర్ణంలో వెద పద్ధతిలో వరి సాగు జరిగే అవకాశం ఉంది.
ఓ వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు కాలువలకు సకాలంలో సాగునీరు విడుదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు వెద పద్ధతిలో వరిసాగుకు ఉపక్రమిస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ వెద పద్ధతిని ప్రోత్సాహిస్తున్నారు.
ఇప్పటికే తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని కొల్లిపర, తెనా లి, దుగ్గిరాల మండలాల పరిధిలో వెద సాగును ప్రారంభించారు.
గత ఏడాది నవంబర్‌లో వచ్చిన హెలెన్ తుఫాన్ వల్ల వరి పంట దెబ్బ తినడంతోపాటు చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గాయి. వెద పద్ధతిలో సాగు చేసిన పొలాల్లో ఎకరాకు 25 బస్తాలు మాత్రమే దిగుబడులు వచ్చాయి.
అప్పట్లో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్‌లో 93,756 ఎకరాల్లో వరి సాగు చేయగా, దీనిలో 25 వేల ఎకరాల్లో వెద పద్ధతి ద్వారా వరిసాగు చేశారు.
ఈ ఏడాది సుమారు 40 వేల ఎకరాల్లో వెద పద్ధతి ద్వారా వరి సాగు జరగవచ్చని తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి తెలిపారు.
తెనాలి రూరల్ మండలంలోని నందివెలుగు, కొలకలూరుగ్రామాల పరిధిలోని ఇప్పటికే సుమారు వెయ్యి ఎకరాల్లో వెద పెట్టారు. నందివెలుగులో పొలాలను వ్యవసాయాధికారులు పరిశీలించి రైతులకు పలు సూచనలు సలహాలు అందజేస్తున్నారు. వెద పెట్టిన వెంటనే పొలాల్లో కలుపు మందులు జల్లుతున్నారు.
వెద సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలం చదునుగా ఉండాలి విత్తన శుద్ధి చేయాలి
ఎకరాకు 8 నుంచి 12 కిలోల విత్తనం నాటాలి పొలంలో 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో విత్తనం నాటాలి ప్రారంభంలో కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి కలుపు మందు పిచికారి చేసేటప్పుడు తేమ ఉండే విధంగా చూసుకోవాలి పొలాన్ని లేజర్ గైడర్‌తో లెవల్ చేసుకోవాలి
పదునులోనే విత్తనాలు విత్తుకోవాలి యంత్ర పరికరాలతో వెద పద్ధతి సులభం కలుపు నివారణకు స్టాంప్ అనే మందు పిచికారి చేయాలి కలుపు రాకుండా, కలుపు నివారణకు
గ్రానెట్ మందు చల్లాలి ఊద నివారణకు క్లించర్ అనే మందును వాడాలి.
నీటి, కలుపు యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే దిగుబడులు అధికం.10 ఎకరాల్లో సాగు చేస్తున్నా..ఈ ఏడాది 10 ఎకరాల్లో వెద పద్ధతి ద్వారా వరి సాగు చేస్తున్నా. దీని వల్ల ఎకరాకు రూ.5 వేలు ఖర్చు తగ్గుతోంది. నీటి యాజమాన్య ఖర్చులు తగ్గుతాయని అధికారులు చెప్పారు.
- నల్లూరి రాఘవేంద్ర, రైతు, నందివెలుగు