గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : సమాజంలో స్త్రీ, పురుష జనాభా సమానంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి ఎస్.ఎం.రఫీ చెప్పారు. శుక్రవారం సాయంత్రం డీఎంహెచ్‌వో చాంబర్‌లో గర్భస్థ పిండ పూర్వ లింగ నిర్ధారణ ఎంపిక నిషేధిత చట్టం(పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్) అమలుపై జిల్లా, ఉప జిల్లాస్థాయి సలహా సంఘం, జిల్లా, ఉప జిల్లా మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రఫీ మాట్లాడుతూ ఆధునిక వైద్య విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఆర్థిక భారమనే భావన ఉండటం వల్ల అసమానతలు తలెత్తుతున్నాయన్నారు. చట్టాన్ని ఉల్లఘించి స్కానింగ్‌లు చేసేవారి సమాచారం అందించాలని, సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని సూచించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లక్రితం బహిరంగంగానే స్కానింగ్ పరీక్షలు చేసేవారని, నేడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు.
ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రమాపద్మ మాట్లాడుతూ జిల్లాలో ఆరేళ్లలోపు బాలురు వెయ్యి మందికి 948 మంది మాత్రమే బాలికలు ఉండటం ఆందోళనకరమైన విషయమన్నారు.
స్కానింగ్ వివరాల్ని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని, జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు దానిని తమ సెంటర్‌లో పెట్టుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఒకటవ అదనపు జిల్లా జడ్జి బి.గిరిజామనోహర్, అడిషన్ ఎస్పీ జానకి దారావత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గప్రసాద్, లీగల్ కన్సల్టెంట్ విజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో గోపినాయక్, అడిషనల్ డీఎంహెచ్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల అభివృద్ధిపై ఆరా..
జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల్లో నూరుశాతం లక్ష్యాలను సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ తారాచంద్‌నాయడు అన్నారు. డీఎంహెచ్‌వో చాంబర్‌లో ఆయన జిల్లా వైద్యాధికారులతో స్కైపీ విధానంలో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు.
స్త్రీ, పురుష నిష్పత్తి సమంగా ఉండేలా చూడాలి
Published Sat, Mar 29 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM
Advertisement
Advertisement