
బడిఈడు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న మణికంఠన్
చిన్నతనంలో అందరిలానే తానూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని జీలపాటూరు పంచాయతీ, ఏవీఎస్ నగర్ కాలనీ వాసి కూసరవేడు మణికంఠన్ కలలు కన్నారు. అయితే పోలియో కబళించడంతో పాఠశాలకు వెళ్లాలనే ఆశ అడియాసగా మిగిలింది. తనలా చదువుకు ఎవరూ దూరం కాకూడదని నిశ్చయించుకున్నారు. గ్రామంలో పాఠశాల లేకపోవడం.. వేరే ప్రాంతాల్లోని పాఠశాలలకు పంపాలంటే ప్రమాదాలు జరుగుతాయని భయపడిన తల్లిదండ్రులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. రోజూ 15 మంది పిల్లలను దాతలకు తనకు సమకూర్చిన మూడు చక్రాల బండిలో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని దొడ్లవారిమిట్టలోని పాఠశాలలో దింపుతూ.. తిరిగి తీసుకొస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెళ్లకూరు: తమిళనాడు రాష్ట్రం పండ్రోటి ప్రాంతానికి చెందిన కొందరు వలస కూలీలు 40 ఏళ్ల క్రితం మండలంలోని జీలపాటూరు పంచాయతీ, ఏవీఎస్ నగర్ కాలనీలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. కాలనీకి చెందిన కూసరవేడు శాంతి, గోపాల్‌కు మూడో సంతానం మణికంఠన్. పుట్టుకతో మణికంఠన్ పోలియో బారిన పడటంతో మంచానికే పరిమితమయ్యారు. చిన్నతనంలో పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేదు. దీనికితోడు తల్లిదండ్రులు రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. దీంతో చిన్నతనంలో తోటి పిల్లలంతా గంతులేస్తూ పాఠశాలకు వెళుతుంటే చూస్తూ కాలం వెళ్లదీయడం తప్ప అడుగు ముందుకేసి బడి మెట్లు ఎక్కి అ..ఆలు నేర్చుకునే అవకాశం ఈయనకు లభించలేదు.
భరోసా
ప్రస్తుతం ఏవీఎస్ నగర్‌లో సుమారు 52 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాలనీలో సుమారు 15 మంది బడిఈడు పిల్లలు ఉన్నారు. ఏవీఎస్ నగర్‌లో పాఠశాల లేకపోవడం, సమీప గ్రామాల్లోని పా ఠశాలలకు పంపాలంటే రోడ్డు మార్గంలో వాహనాల ప్రమాదాలతో భయం.. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత లేక అక్కడి ప్రజలు తమ బిడ్డలను చదివించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో మణికంఠన్ పిల్లల తల్లిదండ్రులకు నేను సైతం అంటూ భరోసా ఇచ్చారు. రోజూ తన మూ డు చక్రాల బండిలో కాలనీలోని 15 మంది పిల్లలను వెంటబెట్టుకొని దొడ్లవారిమిట్ట ప్రభుత్వ పాఠశాలకు జాతీయ రహదారి మార్గంలో జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. తిరిగి ఇంటికి చేరుకొని తమ శక్తికి తగినట్టు చిన్నపాటి పనులు చేసి కుటుంబసభ్యులకు ఆసరాగా నిలుస్తున్నారు.సాయంత్రం మళ్లీ పాఠశాల వద్దకు చేరుకొని పిల్లలందర్నీ తీసుకొస్తున్నారు. కాలనీలోని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే సమయంలో అక్కడి ఉపాధ్యాయులు నేర్పిన పదాలు, పాఠాలు, పద్యాలను పిల్లలతో చెప్పించుకొంటూ తానూ నేర్చుకుంటున్నారు.
పిల్లలందరూ బాగా చదువుకోవాలి
కాలనీలో పాఠశాల సదుపాయం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాల రాకపోకలతో పిల్లలకు ప్రమాదం ఉందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాలనీలోని ప్రజలు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి పిల్లలందరూ బాగా చదువుకొని ప్రయోజకులవ్వాలనే లక్ష్యంతో ఆరేళ్లుగా పాఠశాలకు వెంటబెట్టుకొని తీసుకెళ్తున్నాను. రెండు కాళ్లు పని చేయకపోవడంతో పాఠశాలకు వెళ్లి చదువుకునే అవకాశం లభించలేదు. ఇక్కడి పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. – మణికంఠన్, ఏవీఎస్ నగర్
Comments
Please login to add a commentAdd a comment