రుణమాఫీ హామీకి తిలోదకాలు
ఇసుక రీచ్‌లను తప్పించే యత్నాలు
ధాన్యం కొనుగోలు కమీషన్ ఇవ్వకుండా తాత్సారం
ఆవేదనలో మహిళలు
డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని ఊరూరా తిరిగి గొంతు అరిగిపోయేలా చెప్పారు. అధికారం వచ్చాక సవాలక్ష మెలికలు పెట్టి ఆ హామీని మాఫీ చేశారు. ధాన్యం కొనుగోలును మహిళా సంఘాలకు అప్పగించారు. అంత కష్టపడి కొనుగోళ్లు చేస్తే కమీషన్ ఇవ్వకుండా ఏడిపించారు. ఇసుక రీచ్‌ల విషయంలోనూ ఇదే ధోరణి. రీచ్‌ల నిర్వహణ నుంచి మహిళా సంఘాలను తప్పించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడి నిర్వాకం. మాటివ్వడం ఆనక మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు అప్పగించి ఆఖరుకు తప్పులు తమపై నెట్టేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ. 550 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉండగా దాన్ని గాలికొదిలేసి పెట్టుబడి నిధి కింద రూ. 124 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లాలో మహిళలకు 50
ఇసుక రీచ్‌లను అప్పగించి, ఇప్పుడు సమస్యల నెపంతో వారిని రీచ్‌ల నిర్వహణ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామైక్య సంఘాలతో చాకిరీ చేయించుకున్న ప్రభుత్వం వాటికివ్వాల్సిన కమీషన్ రూ. ఆరు కోట్లకు గాను రూ.నాలుగు కోట్లు ఇచ్చి మిగతా సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఏదొక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నానికి ఒడిగగుతోంది.
ఆదిలోనే రాజకీయం చేశారు. తమ పార్టీకి అనుకూలమైన సంఘాలతో మేక్ సొసైటీల్ని ఏర్పాటు చేసి, ఇసుక రీచ్‌లను అప్పగించారు. వాటి ముసుగులో అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు. రీచ్‌ల ద్వారా అధికారికంగా సుమారు రూ. 20కోట్లు ఆదాయం రాగా, అక్రమార్కులకు అంతకు రెండింతల ఆదాయం వచ్చింది. మరో 70 అనధికార రీచ్‌లైతే ఇసుకాసూరుల దందాకు అడ్డేలేకుండా పోయింది. దాదాపు రూ. 20కోట్ల ఇసుక ఈ రకంగా పక్కదారి పట్టిందన్న ఆరోపణలున్నాయి.
తమ పార్టీనేతలే కావడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మేక్ సొసైటీలు చొరవ చూపలేకపోయాయి. ఇప్పుడా అక్రమార్కుల జోలికి వెళ్లకుండా సమస్యలున్నాయని చెప్పి స్వయం సహాయక సంఘాల నుంచి రీచ్‌లను తప్పించేందుకుప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లోపాలు సరిదిద్ది, సమస్యలను అధిగమించకుండా క్యూబిక్ మీటర్‌కు రూ. 25చొప్పున కమీషన్ పొందుతున్న మహిళా సంఘాలకు అన్యాయం చేసేందుకు సర్కార్ ప్రయత్నించడంపై మహిళా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఇసుక విక్రయాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. కోటీ 14లక్షల వరకు కమీషన్ వచ్చింది. కొత్త విధానంలో భాగంగా రీచ్‌ల నిర్వహణ తప్పిస్తే ఇసుక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాల కోల్పోవల్సి వస్తోంది. అదే మేక్ సొసైటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి ఉంటే అక్రమాలకు తావుండేది కాదు.
ధాన్యం...దైన్యం
ధాన్యం కొనుగోలు బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన క్వింటా ధాన్యానికి రూ. 31.25పైసలు కమీషన్, హమాలీ చార్జీ కింద రూ. 4.72పైసలు ఇస్తామని ప్రకటించింది. ఇంకేమంది మహిళలు రెట్టింపు ఉత్సాహంతో ధాన్యం కొనుగోలు చేపట్టారు. కమీషన్ కింద రూ. 5,25,75, 908, హమాలీ చార్జీల కింద రూ. 79,41,65 రావల్సి ఉంది. మొత్తంగా చూస్తే రూ. 6,05,16, 973 గ్రామైక్య సంఘాలకు రావల్సి ఉంది.
కానీ దాంట్లో కేవలం రూ. 4కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇప్పుడా మొత్తంలో కంప్యూటర్లు, ప్రింటర్ అద్దె, రవాణా చార్జీలు, శిక్షణా ఖర్చులు, నెట్ కనెక్షన్, స్టేషనరీ, జెరాక్స్ ఇతరత్రా ఖర్చుల కింద అయ్యే సొమ్మును మినహాయించి మిగతాది జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పంపిణీ చేసుకోవాలని సూచన ప్రాయ సలహా ఇచ్చింది. దీంతో క్వింటాకు రూ. 31. 25పైసలు వస్తుందనుకున్న చోట రూ. 10.45పైసలు వచ్చింది. ఎందుకింత మోసమని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
హామీ మాఫీ...
రుణమాఫీ మామీ అటకెక్కింది. పెట్టుబడి నిధి పేరుతో కొంత మొత్తాన్ని ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన హామీ ప్రకారం జిల్లాలోని 41,997డ్వాక్రా సంఘాలకు రూ. 550కోట్ల వరకు రుణాలున్నాయి. రుణమంతా మాఫీ చేస్తామని ప్రకటించడంతో బ్యాంకులకు పైసా కూడా చెల్లించనక్కర్లేదని మహిళలు భావించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాఫీ జాన్తానై అని ప్రకటించి పెట్టుబడి నిధి పేరుతో రూ. 136కోట్లు ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొన్నారు.
మాఫీ చేయవలిసిన డ్వాక్రా రుణం : రూ.550 కోట్లు
పెట్టుబడి నిధిపేరిట చెల్లించింది : రూ 124 కోట్లు
గ్రామైక్య సంఘాలకు చెల్లించవలసిన ధాన్యం కమీషన్ : రూ 6 కోట్లు
చెల్లించింది : రూ.4కోట్లు
ఇన్నిమోసాలా..?
Published Sat, Nov 28 2015 2:33 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement