
'దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అభద్రతా భావంలో ఉన్నారని వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా చేసే దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
ప్రతిపక్షం గొంతు నొక్కాలనుకోవటం మంచిది కాదని సూచించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలని చూస్తున్నారని మర్రిరాజశేఖర్ ఈ సందర్భంగా మండిపడ్డారు.