
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : మూడు నెలల విరామం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి ముచ్చట్ల సంబరాలు మొదల వుతున్నాయి. నేటితో మూఢాలు ముగియడంతో సోమవారం నుంచి భాజా భజంత్రీలు మోగనున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకూ రెండు మూఢాలు రావడం, మంచి రోజులు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభ కార్యాలకు ముహూర్తాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫాల్గుణ మాసంలో ఈనెల 19 నుంచి ముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. మార్చి 3, 4వ తేదీల్లో వివాహాలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ లగ్నాలను ఖరారు చేసుకున్నారు. శుభలేఖలు పంచి వివాహ వేదికలను బుక్ చేసుకుని పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జూలై 7 వరకూ శుభకార్యాల సందడి
పండితుల సమాచారం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంలో జూలై 7వ తేదీ వరకూ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో సంబంధాలు ఖరారైన కుటుం బాలు ఫాల్గుణ, భాద్రపద, మార్గశిర మాసాల్లో వివాహాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర నగరాల్లో మార్చి 3, 4వ తేదీల్లో అత్యధిక కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి.
దూర ప్రాంతాల నుంచి పురోహితులు..
పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటంతో కొందరు దూర ప్రాంతాల నుంచి పురోహితులను రప్పిస్తున్నారు. బ్యాండ్ మేళం, క్యాటరింగ్, వేదికల అలంకరణ బృందాలకు డిమాండ్ పెరిగింది. ఇక పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ఖర్చులకు తోడు జీఎస్టీ అదనపు భారంగా మారిందని మధ్యతరగతి కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి.
ఖరీదైన వేడుకలు...
పెళ్లి వేడుకలు చూసేవారికి బాగుంటున్నా ఖర్చులు మాత్రం సాధారణ కుటుంబాలు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఏసీ సదుపాయం ఉన్న కల్యాణ వేదికల ఒకరోజు అద్దె హాల్ పరిమాణాన్ని బట్టి రూ. 70 వేల నుంచి రూ.1.3 లక్షల వరకూ ఉంది. ఏసీకి, నాన్ ఏసీకి మధ్య రూ.20 వేల వరకూ వ్యత్యాసం ఉంటోంది. విజయవాడలో మధ్యస్థాయి ఫంక్షన్ హాళ్ల అద్దె రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉంది. ఇక వివాహ వేదికల అలంకరణ ఖర్చు కనీసం రూ.లక్ష పైమాటే.
సీమకు బెంగళూరు రోజా పూలు..
రాయలసీమలో పెళ్లి మండపాల అలంకరణకు రకరకాల రోజా పూలను బెంగళూరు నుంచి తెప్పిస్తున్నారు. అలంకరణ పనులను కాంట్రాక్టుకు ఇవ్వడం రివాజుగా మారింది. ఫంక్షన్ హాలు పరిమాణం, అలంకరణ తీరు ఆధారంగా లక్ష నుంచి రెండు లక్షల వరకూ తీసుకుంటున్నారు. అరటి పిలకలు కట్టడం, మామిడి తోరణాలు, పూలతో అలంకరణ దాకా అంతా వారే చూసుకుంటారు. భారీ కల్యాణ మండపాల అలంకరణ ఖర్చు ఐదారు లక్షల రూపాయల వరకూ ఉంటుందని బెంగళూరుకు చెందిన అలంకరణ కాంట్రాక్టరు విజయసింహరాజు తెలిపారు.
పసందైన విందుకు భారీ ఖర్చు...
కోస్తాలో పెళ్లంటే బొబ్బట్లు, జిలేబి, జీడిపప్పుతో కూడిన చక్కెర పొంగలి లాంటి స్వీట్లతోపాటు గారె, కూరగాయల బిర్యానీ, నోరూరించే పులిహోర తదితరాలు మెనూలో తప్పనిసరిగా మారాయి. ప్రాంతాన్ని బట్టి వంటకాలు మారుతుంటాయి. మాంసాహారమైతే మెనూ వేరుగా ఉంటుంది. గతంలో పెళ్లిళ్లకు వంటవాళ్లను పిలిపించి సరుకులు తామే తెప్పించి చేయించేవారు. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ కేటరింగ్ పార్టీలకే అప్పగిస్తున్నారు. ఎంతమంది వస్తారు? పిండివంటలు, ఆహార పదార్థాలు ఏం ఉండాలో చెబితే చాలు. వడ్డించడంతో సహా అంతా కేటరింగ్ పార్టీ వారే చూసుకుంటారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి నగరాల్లో మధ్యతరగతి పెళ్లిళ్లకు ఒక్కో ప్లేటు భోజనానికి మెనూను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకూ తీసుకుంటున్నారు. ఉదాహరణకు వెయ్యి మందికి భోజనం పెట్టాలంటే ప్లేటు రూ.250 ప్రకారం రూ.2.50 లక్షలు అవుతుంది. ఉదయం అల్పాహారం బిల్లు దీనికి అదనం.
డ్రోన్లతో చిత్రీకరణ..
గతంలో పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు వచ్చి ఫొటోలు, వీడియోలు తీసేవారు. కాలంతోపాటు అదికూడా మారిపోయింది. ప్రస్తుతం డ్రోన్లతో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment