వివాహిత దారుణ హత్య? | Married assassination? | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య?

Published Tue, Jan 14 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Married assassination?

అనంతపురం క్రై ం, న్యూస్‌లైన్ : నగరంలోని రామ్‌నగర్‌లో ఓ వివాహితను ఆమె మరిది దారుణంగా హతమార్చాడన్న వదంతులు షికారు చేస్తుండగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ హత్యోదంతం బయటకు పొక్కకుండా నిందితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని,  గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చి వేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు న్యూస్‌లైన్‌కు అందిన వివరాలు ఇలా వున్నాయి.
 
 రామ్‌నగర్‌లోని కమ్మభవన్ సమీపంలో ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు, రఘువీరా టవర్స్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో శిక్షణకు వెళుతున్న కమలానగర్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు అవమానంగా భావించి తమ ఇంటిని అమ్మేసి హైదరాబాదు చేరుకున్నారు. శిక్షణకు రావద్దంటూ బ్యూటీ పార్లర్ శిక్ష కురాలు కూడా ఆ యువతికి చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త, అత్తారిల్లే లోకంగా జీవనం సాగిస్తుండేది. స్థానికంగా ఓ ఫుడ్ క్యాటరింగ్‌లో ఆమె సోదరుడు పని చేస్తున్నా.. చెల్లెలిని కలిసే అవకాశం ఉండేది కాదని, ఏడాదిలో ఒకటి, రెండుమార్లు ఫోన్లో మాట్లాడేవాడని తెలుస్తోంది.
 
 ఈ క్రమంలో ఆమె ఆదివారం మృతి చెందింది. తన అన్న కులాంతర వివాహం చేసుకోవడం నచ్చకనో... మరే ఇతర కారణాలో గానీ మరిదే ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె మృతిని దాచిన భర్త, కుటుంబీకులు.. ఆమెది సాధారణ మృతి అని చుట్టుపక్కల వారు నమ్మేలా ప్రచారం చేసి వారి మతాచారం మేరకు రాత్రికి రాత్రే అంత్యక్రియలు ముగించినట్లు సమాచారం. ఆమె కమలానగర్‌కు చెందినదని తెలుసుకున్న స్థానికులు, ఆమె బంధువుల వివరాలు కూడా లేకపోవడంతో దీనిపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా చికెన్ కొట్టు బంద్ చేసినట్లు నిర్వాహకుడి కుటుంబ సభ్యులు చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు.
 
 ఇక జులాయిగా తిరుగుతున్న ఆమె మరిది కూడా వదిన అంత్యక్రియలకు రాకపోవడంతో అనుమానాలు రెట్టింపయ్యాయంటున్నారు. స్థానికులు కొందరు టూ టౌన్ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులుగా సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా రహస్యంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. విషయంపై టూ టౌన్ పోలీసులను ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మృతురాలికి ఓ ఆడబిడ్డ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె బంధువులెవరూ ఈ సంఘటనపై స్పందించలేదని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement