అమరుల త్యాగాల ముందు..పదవీత్యాగం చిన్నదే..
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్:తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేశారని, తాను చిన్న పదవిని త్యజించడం గొప్ప అనుకోవడం లేదని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయనకు తెలంగాణచౌక్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకొనే కుట్రలో భాగంగానే తన శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించారని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. సోనియా నిర్ణయాన్ని అమలుచేస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం తప్పా అని ప్రశ్నించారు. రాజీనామా చేశాక కొంతమంది కావాలని తనపై విషప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్ది కోసం ఏనాడూ పాకులాడలేదని, తానంత నీచానికి దిగజారనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం త మ తండ్రి శ్రీపాదరావును కోల్పోయామని గుర్తుచేశారు. తాను రాజీనామా చేస్తే భయమెం దుకని, ఎందుకు కొంతమంది భుజాలు తడుముకొంటున్నారని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న వాదాన్ని అధిష్టాన వర్గానికి చెప్పామన్నారు. అధిష్టాన వర్గం తో మాట్లాడిన ప్రతీ విషయం బయటకు చెప్పే అలవాటు తనకు లేదన్నారు. తనపై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు వచ్చాయని, తెలంగా ణ సాధన కోసం ఆ అవమానాలన్నింటిని సహించానని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేసే శక్తి ప్రతి ఒక్కరికి ఉందని, తెలంగాణ నాయకుల్లో సఖ్యత ఉండాలనే తాను భరించానని వివరించారు. తానెవరిని ఎప్పుడూ అరెస్ట్ చే యాలని చెప్పలేదని, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తన నైజం కాదని అన్నారు. అసెం బ్లీ ప్రోరోగ్ విషయంలో తనకున్న అధికారాలతో ఆపితే మ్యాచ్ ఫిక్సింట్ అంటూ కొంతమంది మూర్ఖులు విమర్శలు చేశారన్నారు. ఇది అహంకారానికి, ఆత్మాభిమానానికి నడుమ జరుగుతున్న పోరాటమని, చివరకు ఆత్మాభిమానమే గెలుస్తుందన్నారు. పార్టీ అధిష్టానవర్గం నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తెలంగాణ కు అడ్డుపడనని సీఎం ఎన్నోమార్లు చెప్పాడన్నారు.
అసెంబ్లీకి బిల్లు రాగానే సీఎం ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో చెప్పాలన్నారు. తన నుంచి శాఖను తప్పించినా, తిరిగి తెలంగాణ మంత్రులకు ఇవ్వకపోవడంలోనే కుట్ర తేటతెల్లమవుతోందని మండిపడ్డారు. రాష్ట్రపతి కేవలం అభిప్రాయం కోసమే అసెంబ్లీకి బిల్లు పంపించారని, ఓటింగ్ డిమాండ్ కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అసెం బ్లీల గురించి మాట్లాడుతున్నారని, అక్కడి ని బంధనలు, మన నిబంధనలు వేరని అన్నారు. అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ చేయాలంటే కుదరదని, ఓటింగ్‌కు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23 తరువాత కేంద్రానికి బిల్లు పంపించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆ తరువాత రెండు నెలల్లో రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అక్కసుతోనే శ్రీధర్‌బాబు శాఖ మార్పు
ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారనే అక్కసుతోనే శ్రీధర్‌బాబు శాఖను మార్చిన మూర్ఖుడు సీఎం అని విమర్శించారు. పార్టీ అధిష్టానవర్గం ఆదేశాల మేరకు అవిశ్వాసం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తే, సీఎం అందించిన ప్రతిఫలమిదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ శ్రీధర్‌బాబు చేసిన రాజీనామాను తాను స్వాగతిస్తున్నానన్నారు. తెలంగాణ కల నిజం కాబోతోందని, ధర్మపోరాటంలో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడు తూ.. అధిష్టానం ఆదేశంతో అవిశ్వాసం గండం నుంచి తాము సీఎంను కాాపాడితే, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టకుండా ఆయన అడ్డుకున్నారని విమర్శించారు. శ్రీధర్‌బాబు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారని, ఈ విషయాన్ని స్పీకర్ స్థానంలో ఉన్న భట్టివిక్రమార్క ప్రతిపక్షనేతకు తెలిపారన్నారు. శ్రీధర్‌బాబు శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉంటే తెలంగాణ బిల్లుకు ఎక్కడ ఆమోదం లభిస్తుందనే భయంతోనే శాఖను తప్పించారన్నారు.
మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సోనియా నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తే సీఎం తన వక్ర బుద్ధిని చాటుకున్నారన్నారు. బిల్లును ఆపడానికే కుట్రపూరితంగా శ్రీధర్‌బాబు శాఖను తప్పించారన్నారు. సీమాంధ్ర నాయకులు ఆపాలని చూసినా చర్చను ప్రారంభింపచేసిన ఘనత శ్రీధర్‌బాబుకు దక్కిందన్నారు. సాహసోపేతంగా సీఎం కుట్రను మంత్రిగా ఉండి ఆయన వ్యతిరేకించారన్నారు. శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.
ఘన సన్మానం..
అనంతరం శ్రీధర్‌బాబును పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. టీఎస్‌జేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరురవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్‌రావు, టి.సంతోష్‌కుమార్, ఐ.వెంకట్రావు, ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మత్స్యపారిశ్రామిక సంస్థ అధ్యక్షుడు చేతి ధర్మయ్య, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పనకంటి చంద్రశేఖర్, పీసీసీ అధికారప్రతిని కటుకం మృత్యుంజయం, నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, జువ్వాడి కృష్ణారావు, కోడూరి సత్యనారాయణగౌడ్, రేగులపాటి పాపారావు, మోహన్‌రెడ్డి, కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఆకుల రాము, ఆవాల సరోజ, నేరెళ్ల శారద, గుగ్గిళ్ల జయశ్రీ, ప్యాట రమేష్, అంతటి అన్నయ్యగౌడ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఆమ ఆనంద్, పొన్నం సత్యం, గందె మహేష్, వి.అంజన్‌కుమార్, నందెల్లి రమ, గందె మాధవి, అర్ష మల్లేశం, బామండ్ల నరేందర్ పాల్గొన్నారు.