పట్నంబజారు (గుంటూరు): కార్మిక వీరుల బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అణుగుణంగా సవరణలు చేస్తున్నాయని, దీనిని ప్రతి కార్మికుడు ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపునిచ్చారు. స్థానిక పట్నంబజారులోని కన్యాకపరమేశ్వరి దేవస్థానం వద్ద శుక్రవారం మే డేను పురస్కరించుకుని సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ జరిగింది. సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.నళీనీకాంత్ అధ్యక్షత వహించారు.
మధు మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అంతు తేలుస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులు కాలరాసే విధంగా లేనిపోని చట్టాలను తీసుకుని వస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీరు కార్మికవర్గానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కార్మిక శక్తిని చిన్నచూపు చూసిన ప్రభుత్వాలు మట్టికరిచిపోయాయని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కార్మికుల వేతన, పని గంటల విషయంలో ఎర్రజెండాల స్పూర్తితో సీపీఎం ఎనలేని పోరాటాల చేసిందని గుర్తు చేశారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.భావన్నారాయణ మాట్లాడుతూ కార్మిక సంపదను ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా జెండాను ఆవిష్కరించిన నేతలు పట్నంబజారు, లాలాపేట, మార్కెట్, నాజ్‌సెంటర్, ఓవర్‌బ్రిడ్జి, శంకర్‌విలాస్, లాడ్జిసెంటర్‌ల వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు కె.శ్రీనివాస్, కె.రామిరెడ్డి, మల్లే కోటేశ్వరరావు, ముత్యాలరావు, నికల్సన్, వేమారెడ్డి, షకీలా, ఎల్.అరుణ, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల సవరణలను ప్రతిఘటించండి
Published Sat, May 2 2015 1:59 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement