ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాం
♦ గార్డ్‌పై కత్తితో దాడిచేసి మాపై ఎదురు దాడికి దిగారు
♦ రుయాలో చికిత్స పొందుతున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెల్లడి
తిరుపతి కార్పొరేషన్ : ‘గార్డ్‌గా వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎర్రకూలీలు మారణాయుధాలతో దాడి చేశారు. షాక్‌కు గురైన మేము తమ వారిని రక్షించుకుంటూ, మా ప్రాణాలను కాపాడుకునేందుకు కాల్పులు జరిపాం.. లేకుంటే స్మగ్లర్ల చేతుల్లో మేము బలియ్యే వాళ్లం’ అని ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడి రుయాలో చికిత్స పొందుతున్న టాస్క్‌ఫోర్సు సిబ్బంది తెలిపారు. చంద్రగిరి సమీపంలోని శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతం చీకటీగల కోన, సచ్చినోడి బండ వద్ద మంగళవారం వేకువజామున ఎర్రచందనం కూలీలకు, టాస్క్‌ఫోర్సు సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎర్రచందనం స్మగ్లర్లుగా భావిస్తున్న 20 మంది హతమయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ 8 మంది టాస్క్‌ఫోర్సు సిబ్బందిని వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది..
ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ టాస్క్‌ఫోర్సు సిబ్బంది వైద్యం కోసం వస్తున్నట్టు సమాచారం అందడంతో రుయా ఆర్‌ఎంవో డాక్టర్ యు.శ్రీహరి అప్రమత్తమయ్యారు. రుయా అత్యవసర చికిత్స విభాగంలో బెడ్లు సిద్ధం చేశారు. 12 గంటల ప్రాంతంలో రుయాకు వచ్చిన టాస్క్‌ఫోర్సు ఎస్‌ఐ కిషోర్‌కుమార్ (స్వల్పగాయాలు), మునస్వామి (తలపై గాయం), సంతోష్ (ఎడమ మోచేతికి గాయం), వెంకటేశ్వర్లు (స్వల్ప గాయాలు), ఆర్‌ఎస్‌ఐ విజయ్ (తలపై గాయం), సత్య (స్వల్పగాయం), షేక్‌జాని (స్వల్పగాయం), హరికృష్ణ (స్వల్పగాయం)కు ఆర్‌ఎంవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విభాగం సీఎంవో డాక్టర్ చలపతిరెడ్డి వైద్య సేవలు అందించారు.
ముందు కత్తితో దాడి చేశారు..
ముందుగా అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం నుంచి కూంబింగ్ చేస్తున్న తమకు మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో చీకటీగల కోన వద్ద 40 మందికిపైగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల గుంపు ఎదురుపడింది. మా పార్టీకి ముందు గార్డ్‌గా వెళుతున్న మునస్వామి, సంతోష్‌ను స్మగ్లర్లు అడ్డుకున్నారు. ఇద్దరే అనుకున్న స్మగ్లర్లు చేతిలో ఆయుధం లేని మునస్వామి తలపై కత్తితో దాడి చేశారు. మునస్వామి అరుపులతో వెనుకనే వస్తున్న తాము అప్రమత్తమై ముందుగా గాల్లోకి కాల్పులు జరిపాము. వారు మూకుమ్మడిగా రాళ్లు, కత్తులు, గొడ్డళ్లను తమపైకి విసిరారు. అందుకే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది.
సార్ ఆకలేస్తోంది..
‘సార్ ఆదివారం ఉదయం కాస్త పెరుగన్నం తిన్నాం. ఇంతవరకు ఏమి లేదు. ఆకలేస్తోంది. ముందు అన్నం ఉంటే తెప్పించండి’ అని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దీనంగా వేడుకోవడం కనిపించింది. స్పందించిన సీఎంవో డాక్టర్ చలపతిరెడ్డి టాస్క్‌ఫోర్సు సిబ్బందికి ఫ్లూయిడ్స్ అందించారు. అనంతరం టీటీడీ పంపిణీ చేస్తున్న శ్రీవారి అన్నప్రసాదం తెప్పించి ఇచ్చారు.