సాక్షి, నెల్లూరు(పొగతోట): అమ్మఒడి మొదలు..ఆశ కార్యకర్తలు..మధ్యాహ్న భోజన కార్యకర్తలు..మున్సిపల్ కార్మికులు..హోంగార్డులు..అన్నదాతలకు ఇలా అన్ని వర్గాలకు నెలరోజుల్లో వరాలు కురిపించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరడానికి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదలచేయనుంది.
ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సన్నద్ధమలవుతోంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 10,340 మంది నిరుద్యోగులకు గ్రామ సచివాలయ పోస్టులు దక్కనున్నాయి. మున్సిపాలిటీల్లోనూ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ లోగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూల నిర్వహణ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. నూతన సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్నారని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరుద్యోగులు, ప్రజలు సీఎంను అభినందిస్తున్నారు. ఇచ్చిన హామీలను రోజుల వ్యవధిలోనే అమలు చేస్తున్న సీఎంను ప్రస్తుతం చూస్తున్నామని ప్రజలు, నిరుద్యోగులు అంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చింది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మెరిట్ ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రచురించి వారికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజే నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. గత ప్రభుత్వం ఇంటికోక ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి ఐదేళ్లు అధికారాన్ని దక్కించుకుంది. టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైంది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంది. ఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు ప్రకటించాడు. నాలుగున్నర సంవత్సరాలు కాలయాపన చేసిన చంద్రబాబుకు 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులు గుర్తుకొచ్చారు.
ఆగమేఘాల మీద నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించి చతికలపడ్డారు. నాలుగున్నర సంవత్సరాలు ఆటలాడుకున్నందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగులు టీడీపీకి బుద్ధిచెప్పారు. నూతన ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా జీఓ విడుదల చేశారు. జిల్లాలో 80 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాలో 940 పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో 11 మందితో గ్రామ సచివాలయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసేలా రూపకల్పన చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా పంపించి అర్హులైన లబ్ధిదారులకు 72 గంటల్లో పథకాలు అందేలా సిస్టమ్‌ను ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
టీడీపీ ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, నివేశన స్థలాలు, ఇళ్ల కోసం ప్రజలు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వచ్చేది. జన్మభూమి కమిటీలు సంతకం చేసిన వారికి మాత్రమే నెలల సమయంలో రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేసే వారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించనున్న గ్రామ సచివాలయ పోస్టుల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. ప్రజలు మండల కేంద్రానికి పోకుండా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం గ్రామంలో అందుబాటులో ఉండే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తులు చేసుకున్న 72 గంటల్లో అర్హులకు సంక్షేమ పథకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేయనుంది. గ్రామ సచివాలయాలతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి ఉండదు. ప్రజలకు సమయం మిగులుతుంది. ఖర్చు ఉండదు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment