ఏంటీ స్పెషల్ ట్రీట్‌మెంట్
- మెన్ స్పెషల్‌లో మహిళా ఖైదీ
- కేజీహెచ్‌లో కలకలం
- అంతా అనధికారికమే..
- ఇతర ఖైదీల బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి
విశాఖ మెడికల్: ఓ మహిళా రిమాండ్ ఖైదీకి మెన్ స్పెషల్ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక సదుపాయాలు గల గది కేటాయింపు వ్యవహారం మంగళవారం కేజీహెచ్‌లో వివాదానికి దారితీసింది. తోటి ఖైదీల బంధువులు ఈ విషయాన్ని డెప్యూటీ జైలు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఈ విషయమై కేజీహెచ్ సూపరింటెం డెంట్‌ను ఆరా తీయగా మంగళవారం సంబంధిత విభాగానికి చెందిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను చాంబర్‌కు పిలిచి నిజానిజాలను విచారించగా ఖైదీకి స్పెషల్ రూమ్ కేటాయింపేకాదు, నాలుగు రోజులుగా రిమాండ్ ఖైదీ తమ యూనిట్‌లో చికిత్స పొందుతున్న విషయం తమకు తెలియదని తేల్చిచెప్పారు.
దీంతో ఆశ్చర్యపోయిన సూపరింటెండెంట్ మొత్తం వ్యవహారాన్ని కూపీ లాగారు. చింతపల్లి ఖజానా కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా అరెస్టయిన పాడేరు అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.స్వప్న కుమారి రిమాండ్ ఖైదీగా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈనెల 23న జ్వరం, డయాబెటిస్‌తో పాటు గుండె సంబంధ ఇబ్బందితో ఆమెను జైలు వైద్యులు కేజీహెచ్‌కు తరలించారు. అత్యవసర వైద్య విభాగంలో పరీక్షించిన సీఎంఓ మెడిసిన్ నాలుగో యూనిట్‌లో అడ్మిట్ చేశారు. ఈ వ్యవహారం సంబంధిత యూనిట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు తెలియకుండా జరగడం విశేషం. స్వప్నకుమారి బంధువైన మత్తువైద్య విభాగానికి చెందిన ఓ పీజీ వైద్యుడు సిఫార్సుతో నాలుగో యూనిట్‌కు చెందిన ఓ సహాయ వైద్యురాలు ఆమెను చేర్చుకున్నట్లు తెలిసింది.
కేజీహెచ్‌లో మహిళా రిమైండ్ ఖైదీలను ఉంచి చికిత్స అందించేందుకు ప్రత్యేక సెల్ లేకపోవడంతో స్వప్నకుమారిని రాజేంద్రప్రసాద్ వార్డులోని సీ వార్డులో అడ్మిషన్ కల్పించారు. 24వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆమెను ఆర్‌పీసీ వార్డులోఉంచి చికిత్సలు అందించారు. అనంతరం అనధికారికంగా మెన్ స్పెషల్ వార్డుకు తరలించారు. ఈ తరలింపు వెనుక కూడా ఆమెను చేర్చుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్, మత్తు విభాగం పీజీలతో పాటు ఆస్పత్రికి చెందిన కొంత మంది అధికారుల హస్తం ఉన్నట్లు తేలింది. మహిళా ఖైదీలకు ప్రత్యేక సెల్ లేకపోవడంతో ఆర్‌పీసీలోని ఓ గదిలో ఉంచి చికిత్సలు అందించాలని తొలుత భావించినప్పటికీ, స్వప్నకుమారి విముఖత వ్యక్తం చేయడంతో మెన్ స్పెషల్ వార్డులో ఉంచేందుకు ఆస్పత్రి అధికారులు మొగ్గు చూపినట్లు తెలిసింది.
ఆమెకు సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్‌ను సైతం మచ్చికచేసుకొని, సాధారణ ఖైదీకి ఇవ్వాల్సిన విధంగా కాకుండా వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం వెనుక ఆస్పత్రి అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వెల్లువెత్తడంతో మంగళవారం మధ్యాహ్నం సూపరింటెండెంట్ ఆమెను యథావిధిగా రాజేంద్రప్రసాద్‌లోని సీ వార్డుకు చికిత్స కోసం వెనక్కి పంపారు. దీంతో వివాదం సద్దుమనిగింది. ఖైదీల బంధువుల ఫిర్యాదు వెనుక ఓ మాజీ ఆర్‌ఎంఓ హస్తం ఉన్నట్లు సమాచారం. కేవలం బెయిల్ ప్రయత్నంచేసుకోవడానికే ఈ విధంగా చికిత్సకోసం పథకాన్ని రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.