
వైద్యాధికారులూ.. పద్ధతి మార్చుకోండి
నరసరావుపేటవెస్ట్: ప్రజలు ఆస్పత్రికి వచ్చేది రోగాలు తగ్గించుకునేందుకా.. లేని జబ్బులు తగిలించుకునేందుకా..? అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులను నిలదీశారు.
నరసరావుపేటవెస్ట్:
ప్రజలు ఆస్పత్రికి వచ్చేది రోగాలు తగ్గించుకునేందుకా.. లేని జబ్బులు తగిలించుకునేందుకా..? అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులను నిలదీశారు. వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి చైర్మన్‌గా హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన వైద్యశాల పరిసరాలను, పలు విభాగాల తనిఖీ చేశారు.
ఏఆర్టీ సెంటర్ సమీపంలో మృతుల శరీర భాగాలు ప్లాస్టిక్ కవర్లలో చుట్టి పడేసి ఉండటం చూసి సూపరిండెంట్ టి.శ్రీనివాసరావును ప్రశ్నించారు. కనీసం రోజుకు ఒక అరగంటైనా వైద్యశాల పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టమని ఆర్‌ఎంవో మోహనశేషుప్రసాదు, సూపరిండెంట్‌లకు ఆదేశాలు జారీచేశారు. పైపులు పగిలి మల, మూత్రాలు బయట కన్పించటం, ఏఆర్టీ సెంటర్ వద్ద కుండీల్లో చెత్త పేరుకుపోయి ఉండటం గమనించి ‘రోజు చూడటంలేదా.. నీకు కన్పించటంలేదా..వైద్యశాలకు రోగులు వచ్చేది రోగాలు తగిలించుకునేందుకా’..అని పారిశుద్య సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిరోజూ చెత్తను తీసేయాలని సూచించార. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం నిర్వహణ బాగాలేదన్నారు. వైద్యశాలలో వైద్య సిబ్బంది కొరత కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వంద పడకల వైద్యశాలకు మరో వందపడకలకు అనుమతి లభించిందని చెప్పారు. బ్లడ్ బ్యాంకు నిర్వాహణ బాగుందని ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో వైద్యశాలను మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. అనంతరం అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, కె.శంకరయాదవ్, కందుల ఎజ్రా, ఎస్.సుజాతాపాల్, పంగులూరి విజయకుమార్, పాలపర్తి వెంకటేశ్వరరావు, బొమ్ము జయరావు, ఎం.రమణారెడ్డి, హుస్సేన్, డాక్టర్లు పాల్గొన్నారు.