మసక చీకటిలో ‘పాల’ వెలుగు | Milk collection Became Difficult In West Godavari | Sakshi
Sakshi News home page

మసక చీకటిలో ‘పాల’ వెలుగు

Published Sun, Jul 7 2019 6:31 AM | Last Updated on Sun, Jul 7 2019 6:41 AM

Milk collection Became Difficult In West Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ఒకప్పుడు నిండుకుండలా ఉన్న గోదావరి డెయిరీ నేడు వట్టిపోతున్న పాల గేదెను తలపిస్తోంది.  ఒకప్పుడు 35 వేల లీటర్ల పాల సేకరణతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ డెయిరీకి నేడు నాలుగు వేల లీటర్ల పాల సేకరణ కష్టంగా మారింది. ఈ సమయంలో నవ, యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల సేకరణ ధర పెంపు హామీతో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగాకర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.. గోదావరి డెయిరీకి పాల సేకరణ తగ్గుముఖం పట్టడానికి కూడా పలు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క గోదావరి డెయిరీ చెల్లించే పాల సేకరణ ధర రైతులను నిరాశకు గురి చేస్తుండగా, మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు గోదావరి డెయిరీకి పాలు పోసే రైతులకు ఎర వేయడంతో పాలుపోసే రైతులను నిలుపుకోవడం బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ (బీఎంసీ)లకు కష్టంగా మారుతోంది. ఒకప్పుడు జిల్లాలో రోజుకు 35 వేల లీటర్ల వరకూ పాల సేకరణ చేపట్టగా ఇప్పుడు రోజుకు 4–5 వేల లీటర్లు సేకరించడమే కష్టంగా మారుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో డెయిరీ నిర్వహణ మరింత దిగజారే అవకాశం ఉంది.

జవసత్వాలు నింపిన రాజశేఖరరెడ్డి
గోదావరి డెయిరీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజ   శేఖరరెడ్డి జీవం పోశారు. 2008 నవంబర్‌ 22న గోదావరి డెయిరీని ఘనంగా ప్రారంభించారు. తొలినాళ్లలో 10 వేల లీటర్లతో ప్రారంభమైంది. రాయవరం, అచ్యుతాపురం, రావులపాలెం, అయినవిల్లి, కడియం, పెద్దాపురంలో బీఎంసీలు ఏర్పాటు చేసి పాలసేకరణ ప్రారంభించారు.

అప్పటి కలెక్టర్‌ గోపాలకృష్ణద్వివేది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీఎంసీకి ఒక అధికారిని కూడా నియమించారు. ప్రతివారం డెయిరీ నిర్వహణతీరుపై కలెక్టర్‌ స్వయంగా సమీక్ష నిర్వహించేవారు. డెయిరీ ప్రారంభంలో లీటరు పాలు రూ.28.50కు కొనుగోలు చేయగా, అప్పట్లో ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.26.50 చెల్లించేవి. ఫలితంగా ప్రారంభంలో గోదావరి డెయిరీకి అధిక పాలసేకరణ జరిగింది.

35 వేల లీటర్లతో పాలపొంగులే..
జిల్లాలో గోదావరి డెయిరీకి పాలు పోసే రైతుల సంఖ్య పెరగడంతో తొలుత ఏర్పాటు చేసిన ఆరు బీఎంసీలకు తోడుగా మరిన్ని బీఎంసీలను ఏర్పాటు చేశారు. అనంతరం తాటిపాక, శంఖవరం, కిర్లంపూడి, డి.పోలవరం, తొండంగితోపాటు విశాఖ జిల్లాలోని ఎస్‌.రాయవరంలో బీఎంసీలు ఏర్పాటు చేశారు. మొత్తం 14 బీఎంసీల ద్వారా రికార్డు స్థాయిలో 35 వేల లీటర్ల పాల సేకరణ చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుందన్న విషయాన్ని గమనించిన ప్రైవేటు డెయిరీలు దశలవారీగా గోదావరి డెయిరీకన్నా అధికంగా పాలసేకరణ ధరను పెంచుకుంటూ పోయాయి.

దీనికితోడు రాజశేఖరరెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు డెయిరీపై ఆసక్తి కనబరచకపోవడంతో గోదావరి డెయిరీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.58 నుంచి రూ.65 వరకు చెల్లిస్తుండగా, గోదావరి డెయిరీ మాత్రం లీటరుకు రూ.54.60 చెల్లిస్తోంది. ఇది రైతులపైన, పాల సేకరణపైన ప్రభావం చూపుతోంది. లీటరు పాల ధరలో రూ.10 వరకూ వ్యత్యాసం ఉండడంతో సహజంగానే రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పాల సేకరణ తగ్గి తాటిపాక, కిర్లంపూడి, తొండంగి, డి.పోలవరం, రంపచోడవరం, విశాఖ జిల్లాలోని ఎస్‌.రాయవరం బీఎంసీలను మూసివేశారు. 

రూ.30 లక్షల వరకూ బకాయిలు
గోదావరి డెయిరీ రైతులకు చెల్లించాల్సిన పేమెంట్ల విషయంలో జాప్యం చోటుచేసుకోవడం కూడా పాల సేకరణ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. రూ.88 లక్షల వరకూ పాల రైతులకు డెయిరీ బకాయిలు పడగా, ఇటీవలే రూ.50 లక్షల వరకూ చెల్లింపులు చేశారు. ఇంకా రూ.30 లక్షల వరకూ పాలుపోసే రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. సాధారణంగా డెయిరీలు 10–15 రోజులకు పాడి రైతులకు పేమెంట్లు చేస్తాయి. పేమెంట్లు ప్రతి పది రోజులకూ కచ్చితంగా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పూర్వ వైభవం దిశగా...
ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గోదావరి డెయిరీకి పూర్వ వైభవం రానుందని పాడి రైతులు సంతోషం వ్యక్తం  చేస్తున్నారు. ఇప్పటికే సహకార డెయిరీల పాల మద్దతు ధరను లీటరుకు రూ.4 పెంచుతామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇది అమలులోకి వస్తే నష్టాల్లో ఉన్న సహకార డెయిరీల నెత్తిన పాలు పోసినట్లవుతుంది.

ఈ చర్యలు తీసుకుంటే:
జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్‌లు గోదావరి డెయిరీపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని పాడి రైతులు భావిస్తున్నారు. ’డెయిరీ పూర్వ వైభవానికి కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉంది.

’పాడి రైతులను ప్రోత్సహించడంలో భాగంగా సబ్సిడీపై దాణా, కాల్షియం, బీమా వంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. ’అలాగే సబ్సిడీపై పాడి గేదెలను డెయిరీ ద్వారా పాడి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ’ఎప్పటికప్పుడు ప్రైవేటు డెయిరీలతో సమానంగా పాల సేకరణ ధరను పెంచాల్సి ఉంది. ’ప్రతి బీఎంసీపై పర్యవేక్షణ పెంచితే పాల సేకరణ పెరిగే అవకాశం ఉంది. ’ప్రభుత్వం ఇచ్చే పాల మద్దతు ధరను ఎప్పటికప్పుడు సవరించాల్సిన అవసరం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement