సాక్షి, నెల్లూరు : ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ఉడ్‌హౌస్ సంఘం, శెట్టిగుంటరోడ్డు, పప్పులవీధి, అదే విధంగా 41వ డివిజన్ మన్సూర్‌నగర్ ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీని కోసం సోమశిల నుంచి పెన్నా నీటిని అందించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదన్నారు. నగరంలో నీటికి ఇబ్బందుల్లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. సంగం బ్యారేజీని పూర్తి చేస్తే నీటికి ఇబ్బందులు ఉండవన్నారు. నగర ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. శెట్టిగుంట రోడ్డులోని రైల్వేస్థలాల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లను తొలగించకుండా వెనుకవైపు ఉన్న కాలువలను మూసేసి, రోడ్డును ముందుకు తీసుకొచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు.
గత ఐదేళ్లలో కార్పొరేషన్ అవినీతిమయం
అభివృద్ధి అంటే హడావుడిగా రోడ్లు వేసి కమీషన్లు దండుకోవడం కాదని, గత ఐదేళ్లలో కార్పొరేషన్ అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో నిజాయతీగా పనిచేసే అధికారులను కూడా తీసుకొని వస్తున్నామని పేర్కొన్నారు. రెండు వేల ఇళ్లకు సంబంధించి ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, అందుకు సంబంధించి పది మంది సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. ఎవరూ కూడా కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదని తెలిపారు. ఏ పని ఎంతకు చేశామో మొత్తం ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 11 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో 9.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిందే చేస్తారని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను మరో రెండు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ గోగుల నాగరాజు, నాయకుడు కొణిదల సుధీర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment