మంత్రిగారికి నిరాశ
ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ మధ్య తన శాఖ పరిధిలో సమూల మార్పులకు శ్రీకారం చుడతానని హడావుడి చేశారు. ఈ హడావుడి తనకు కాసుల వర్షం కురిపిస్తుందని ఆయన చాలా ఆశ పడ్డారట. చివరకు ఆయన ఆశ నిరాశ కావటంతో హడావుడి తగ్గించి పాత పద్ధతిలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ మంత్రి గారు చేసిన హడావుడి వెనుక ఉన్న అసలు కథ ఇపుడు సచివాలయంలో చర్చ నీయాంశమైంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రిగారు తన శాఖ పరిధిలో మార్పులు చేస్తానని ప్రకటించారు.
ఎక్కడ విలేకరుల సమావేశం పెట్టినా ఇదే ప్రశ్న మరీ అడిగించుకుని సమాధానం చెప్పేవారు. ఈ మాటలకు భయపడి మార్పుల వల్ల ఇబ్బంది పడే సంస్థల ప్రతినిధులు తనను ఆశ్రయించి ఎంతో కొంత ముట్టచెబుతారని ఆ మంత్రివ ర్యులు ఆశించారు. ఐతే అలా ఇబ్బంది పడే వారిలో ఆ మంత్రిగారి దగ్గరి బంధువులు కూడా ఉన్నారట. ముందు మీ వారు ఎంత ఇస్తారో చెప్పండి ఆ తరువాత మా సంగతి చెప్తాం అని మిగిలిన సంస్థల ప్రతినిధులు స్పష్టం చేయటంతో అటు సొంత వారిని గట్టిగా మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని అడగలేక, మిగిలిన వారిపై ఒత్తిడి చేయలేక, ఒకవేళ చేస్తే అసలుకే మోసం వస్తుందని భయపడి మార్పుల యోచనకు మంగళం పాడారట.