
రాజాం: వీధిలోకి వచ్చేసిన మహిళలు,(ఇన్‌సెట్‌లో)భూకంపం కారణంగా ఓ ఇంట్లో చిందరవందరగా పడిన వస్తు సామగ్రి
రాజాం, సంతకవిటి: మధ్యాహ్నం 12.30 గంటల సమయం.. ఇంట్లో సామాను చెల్లాచెదురై ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితి.. అందరూ బయటకు పరుగులు తీశారు. రాజాం పట్టణం, సంతకవిటి మండలం పుల్లిట, మామిడిపల్లి గ్రామాల్లో గురువారం భూమి స్వల్పంగా కంపించింది. రాజాం పట్టణ పరిధిలోని అమ్మవారి కాలనీలో ప్రకంపనలు వచ్చి ఒక్కసారిగా ఇళ్లలో స్టీలు సామగ్రి కదలి శబ్దంతో నేలపై పడ్డాయి. దీంతో ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చేశామని అమ్మవారి కాలనీకి చెందిన జి.శారదమ్మ, ఎం.కళ్యాణి, బి.శకుంతల తదితరులు తెలిపారు. మంచాలు, టేబుల్‌పై సామగ్రి వంటివి కదిలాయని తెలిపారు. అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలో ఇలా భూమి కంపించడంతో పెద్దగా విషయం బయటకురాలేదు.
అమ్మవారి కాలనీలో మాత్రం ఇళ్లలోని సామాన్లు కిందపడిపోవడంతో కలకలం రేగింది. కొంతమంది ఇది భూకంప ప్రభావమని పేర్కొనగా, మరికొంతమంది ఏదో పెద్ద వాహనం వీధిలోకి రావడం కార ణంగా ఇలా జరిగి ఉంటుందని, భూకంపం కాదని కొట్టిపారేశారు. సంతకవిటి మండలం పుల్లిట, మామిడిపల్లి గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయి. ప్రధానంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇవి వచ్చినట్లు ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. చాలామంది ఈ సమయంలో ఇంటి వద్ద లేకపోవడంతో స్పష్టమైన సమాచారం లేదు. మామిడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కదలికలు కనిపించాయని ఆ సమయంలో అక్కడ ఉన్నానని రామారావు అనే యువకుడు తెలిపారు. పుల్లిటలో తాను ఇంట్లో ఉన్న సమయంలో డబుల్ కాట్ మంచం కంపించిందని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment