కొండా సిద్ధార్థతో మాట్లాడుతున్న మిథున్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి
చిత్తూరు, బి.కొత్తకోట: ‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆశయాలకనుగుణంగా కలిసి పనిచేద్దాం రండి’ అంటూ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్దార్థను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. సోమవారం పెద్దతిప్పసముద్రం ఎంపీపీ కొండా గీతమ్మ, ఆయన తనయుడు కొండా సిద్ధార్థ టీడీపీకి రాజీనామా చేశారు. వీరిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు మిథున్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డి మంగళవారం ఉదయం కుర్రావాండ్లపల్లెకు వచ్చారు. సిద్ధార్థను కలిసి మాట్లాడారు. పార్టీలో యువతకు కల్పిస్తున్న ప్రాధాన్యం, పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరించారు.
మిథున్‌రెడ్డి మాట్లాడుతూ కొండా సిద్ధార్థ కుటుంబానికి తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో బంధు, అనుచరగణం ఉందన్నారు. రాజకీయంగా కొండా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సిద్ధార్థ ఆస్ట్రేలి యాలో ఉన్నత స్థాయి ఉద్యోగం, ఆదాయం వదులుకుని సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. టీడీపీలో ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేశారని ప్రశంసించారు. పార్టీపరంగా టీడీపీలో ఉన్నప్పటికీ కొండా కుటుంబంపై తమకు గౌరవం ఉందన్నారు. ఈ కుటుంబం ఏనాడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదన్నారు. చదువుకునే రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డితో సిద్ధార్థకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఆయన తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని, తంబళ్లపల్లె రాజకీయాలు మలుపు తిరుగుతాయని అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధార్థను పార్టీలో చేరమని కోరుతున్నట్టు చెప్పారు.
పెద్దిరెడ్డి కుటుంబంతోనే కార్యకర్తలకు అండ..
కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడడం పెద్దిరెడ్డి కుటుంబానికేచెల్లుతుందని కొండా సిద్ధార్థ అన్నారు. పార్టీ శ్రేణులను కాపాడుకునే సత్తా ఆ కుటుంబానికే ఉందన్నది వాస్తవమని స్పష్టం చేశారు. పార్టీ వీడినా తాను టీడీపీకి చెందిన ఎవర్ని విమర్శించబోనని అన్నా రు. ‘టీడీపీ ఆవిర్భావంలో రాజకీయ విలు వలు ఉండేవి.. ఇప్పుడా విలువలు కనిపిం చడం లేదు.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు అందరికి తెలిసిందే’ అని పేర్కొన్నారు. మనస్సాక్షిని చంపుకుని టీడీపీలో కొనసాగే పరిస్థితి లేకపోవడం వల్లే తన తల్లి ఎంపీపీ గీతమ్మ, తాను రాజీ నామా చేశామన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చాక విద్యలో తనకు సీనియర్ అయిన జగన్‌మోహన్‌రెడ్డిని ఒక మిత్రునిగానే కలిశాను తప్ప, టీడీపీ వీడే ఆలో చన చేయలేదన్నారు. అయినప్పటికీ పార్టీలో అవమానాలు భరించాల్సి వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణ యం వెల్లడిస్తానని చెప్పారు.
విండో చైర్మన్‌కూ ఆహ్వానం..
కొండా సిద్ధార్థను పార్టీలో చేర్చుకునేందుకు కుర్రావాండ్లపల్లెకు వచ్చిన మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇక్కడికి వచ్చిన పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ సింగిల్‌విండో చైర్మన్ ఎం.భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. రైతులకు ఎంతో సహకారం అందించిన భాస్కర్‌రెడ్డి పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆయనకు భరోసా ఇవ్వగా సానుకూలంగా స్పందించారు. చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో పెద్దతిప్పసముద్రం మండలంలోని టీడీపీ ము ఖ్యనేతలంతా వైఎస్సార్‌సీపీలోకి చేరిపోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment