కొమరాడ: మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురం గ్రామంలో గిరిజన గర్భిణి కోలక ఇందిర(22) గత నెల 6న ఆకస్మికంగా మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి సోమవారం సంబంధిత సిబ్బందిని ఆరా తీశారు. దీనిపై వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసలు ఐసీడీఎస్ నుంచి గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ప్రశ్నించారు. కొమరాడ మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి సక్రమంగా పౌష్టికాహారం అందడంలేదని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఆమె మృతిపై వైద్యాధికారులు కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని అసహనం వెలిబుచ్చారు. ఎక్కువగా ఏజెన్సీలో గిరిజన గర్భిణులే మృతిచెందుతున్నారని, ఇదంతా వైద్యులు, ఐసీడీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంవల్లే జరుగుతున్నట్లు తేలిందన్నారు. సూపర్‌వైజర్లు ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పర్యవేక్షించాలని, తాను కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, తన తనిఖీలో అక్రమాలు వెలుగులోకొస్తే బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తానని స్పష్టం చేశారు. పౌష్టికాహారం వినియోగంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అలాగే వైద్యసిబ్బంది కప్పటికప్పుడు తనిఖీలుచేసి తగిన మందులు అందించాలని సూచించారు.
గర్భిణి మృతిపై ఎమ్మెల్యే ఆరా
Published Tue, Jun 9 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement