విధి వక్రీకరించడమంటే ఇదేనేమో.. తాను రెండేళ్ల వయసున్నప్పుడు అమ్మను కోల్పోయి తల్లి లేని అనాథగా పెరిగింది. ఇప్పుడు తాను చనిపోతూ రెండేళ్ల కుమార్తెను ఒంటరి చేసి వెళ్లిపోయింది. డెంగీ మహమ్మారి కారణంగా చింతాడలో నిండు గర్భిణితో పాటు కడుపులో బిడ్డ సైతం మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారం పది రోజుల్లో ఇంటికి మరో చిన్నారి వస్తుందని ఆశగా ఎదురుచూసినా కుటుంబ సభ్యులు గర్భిణి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని చింతాడ గ్రామంలో డెంగీ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చింతాడకు చెందిన గుండ సత్యనారాయణతో కిల్లిపాలెం గ్రామానికి చెందిన గీత గాయత్రీ(27)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 21 నెలల వయసున్న దేదీప్య అనే కుమార్తె ఉంది. భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం గీత గాయత్రీ తొమ్మిది నెలల గర్భిణి కావడంతో ప్రసవం కోసం చింతాడకు రెండు వారాల క్రితమే వచ్చింది. ఈ నెల 11న జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో విశాఖపట్నం తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా డెంగీ జ్వరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ప్లేట్‌లెట్స్ ఎక్కించినా జ్వరం తగ్గలేదు. నిండు గర్భిణి కావ డం, శరీరం సహకరించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున గీత గాయత్రీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కళ్లు తెరవకుండానే కాటికి.
గీత గాయత్రీకి చికిత్స అందిస్తున్నప్పుడే కడుపులోని బిడ్డ మృతి చెందింది. వైద్యులు సాధారణ ప్రసవం చేయించి మృతశిశువును బయటకు తీశారు. తల్లి రెండు గంటల సమయంలో మృతి చెందింది. గీతగాయత్రీ మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియక కుమార్తె దేదీప్య బిత్తరచూపులు చూడటం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గీతా గాయత్రీ రెండేళ్ల పాపగా ఉన్నప్పుడే తల్లి మృతి చెందిందని, ఇప్పుడు ఆమె కూడా అలాగే చనిపోవడం ఘోరమని స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
మరో పది మంది వరకు డెంగీ బాధితులు..
చింతాడలో బోర హనీష్, గుండ నవ్య, మణ్యం రామలక్ష్మి, చింతాడ అరుణలు ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వీరితో పాటు మరో పది మంది డెంగీ జ్వరంతో, సుమారు 70 మంది వైరల్, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టినట్లు పేర్కొన్నారు. గీత గాయత్రీ మృతితో ఆయా కుటుంబాలు భయాందోళనకు గురౌతున్నాయి.
పారిశుద్ధ్య లోపం వల్లే జ్వరాల విజృంభణ
చింతాడలో పారిశుద్ధ్యం క్షీణించింది. శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో కలిసి ఈ గ్రామం ఉండడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి అయినప్పటికీ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామం మధ్యలో ఉన్న సాంబయ్య బంద మురికికూపంగా మారినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. వారపు సంతలోనూ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలేదని, రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి పారిశుద్ధ్య పనులు నిర్వహించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment