మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మలేరియా, డెంగీ, విషజ్వరాలతో మంచాన పడుతుం టే స్పందించి సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు. ఎక్కడ చూసినా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతూ మంచం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 120మంది, విజయనగరం జిల్లాలో 60మంది విషజ్వరాల వలనే మృత్యువా త పడ్డారన్నారు. విషజ్వరాలు విజృంభించడంతో విశాఖపట్టణంలోని కేజీహెచ్, గుంటూరు జిల్లాలో జీజీహెచ్, విజయవాడ ఆస్పత్రుల్లో బెడ్‌లు లేక ఒకే బెడ్‌పై నలుగురైదుగురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఆఖరకు రోగులను రోడ్డుపైకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్యాంధ్ర ప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా విషజ్వరాలే రాజ్యమేలుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు.
పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోనిచంద్రబాబు..
రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని తమ్మినేని అన్నారు. మలేరియా, విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క విశాఖ కేజీహెచ్‌లో నే 21 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గుంటూరులో 21 మందికి, తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని దుయ్యబట్టారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ సీఎం చంద్రబాబు వద్దే ఉందని, ఈ శాఖపై చంద్రబాబు దృష్టి సారించకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు.
ఇటీవలే చం ద్రబాబు జ్వరాలపై సమీక్షించి జ్వరాలపై నియంత్రణ కొరవడిందంటూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. జూలై 2016 నుంచి జూన్ 2017 మధ్యకాలంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు పట్టేందుకు రూ.60లక్షలు నిధులు ఖర్చు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్న లోకేష్ అవగాహనా రాహిత్యం వల్లనే గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దోమలబెడద అధికమైందని చెప్పారు. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేసి ఆదాయం వచ్చే మార్గాలనే అన్వేషిస్తోందన్నారు. బాబు డ్యాష్‌బోర్డుపైకి రాష్ట్ర ప్రజలకు అందుతున్న వైద్యసేవల నివేదిక చేరలేదా అని ప్రశ్నించారు.
అందని వ్యాక్సిన్లు..
అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా వ్యా క్సిన్ అందని దుస్థితి నెలకొందని తమ్మినేని సీతా రాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 38 వేల మంది శిశువులు జన్మిస్తున్నారని, చిన్నారులకు ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా వాక్సిన్‌లు వేయించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్‌లు పీహెచ్‌సీలు, సీహెచ్‌ల్లో అందుబాటులో లేకున్నా ప్రభుత్వం చలించకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చిన్నారులు రోటావాక్, హెపటైటిస్–బి వంటి వ్యాక్సిన్‌లకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత బొనిగి రమణమూర్తి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment