సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజా సంక్షేమం కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ఆమదాలవలసలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానన్న హామీ.. రైతులు, నిరుద్యోగుల్లో ఆనందం నింపిందని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగన్ సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాన్నందుకు నియోజకవర్గ ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్నపై ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు చూసి, ఓర్వలేక టీడీపీ నాయకులు లేనిపోని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు 2003లో అంబికా లామినేషన్ నుంచి కోట్ల రూపాయలు కమీషన్లు అందుకుని విజయవంతంగా నడుస్తున్న ఆమదాలవలస కర్మాగారానికి జోన్ ఏరియా లేదని అబద్ధా లు చెప్పారని విమర్శించారు. అప్పట్లో మంత్రిగా ఉన్నా తాను ఫ్యాక్టరీ మూసేయడానికి వీల్లేదని అసెంబ్లీ సమావేశాల్లో అభ్యంతరం తెలిపి, బయటికి వచ్చి నిరసన తెలియజేసినా కనీసం పట్టించుకోలేదన్నారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో ఆమదాలవలస సుగర్స్‌ని తెరిపిస్తానన్న హామి ఇచ్చి.. ఇటీవల ఏరువాక కార్యక్రమానికి వచ్చి అదే నోట తెరిపించడం కుదరదని చెప్పడం సిగ్గుచేటన్నారు. జ్ఞానం లేని విప్ రవికుమార్, ఆయన అనచరులు పిచ్చికూతలు కూస్తూ దానిని మూసి వేయడానికి తానే కారకుడని చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు.
ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి సీఎం అయిన అనంతరం ఆమదాలవలస చక్కెర కర్మాగారంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును విత్‌డ్రా చేశారని గుర్తుచేశారు. మళ్లీ ఫ్యాక్టరీ తెరుచుకోనున్న సమయంలో ఆయన అకాల మరణంతో ప్రతిపాదనలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై వాస్తవాలను తెలుసుకోకుండా.. ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు ఇప్పటికైనా నిజం గ్రహించాలని సూచించారు. చేతకాని ప్రభుత్వానికి మతిస్తిమితం లేని సీఎం పరిపాలిస్తే ఇలానే ఉంటుందని విమర్శించారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టేలా ప్రజలంతా సహకరించాలని, చక్కెర కర్మాగారం వల్ల అనేక మంది రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తమ్మినేని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్(నాని), కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, పొన్నాడ వెంకటరావు, కొల్లి లక్ష్మణరావు, గంట్యాడ రమేష్, బొడ్డేపల్లి రమేష్, సనపల శ్రీనివాసరావు, పప్పల దాలినాయుడు, లొలుగు కాంతారావు, బొణిగి రమణమూర్తి, శ్యామలరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment