కోటంరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులను అడ్డుకుంటున్న ప్రజలు..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని శనివారం తీవ్ర ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనాయ్యంగా అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయనను తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంటూ పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయంలో ఉన్నారన్న సమాచారంతో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి నేతృత్వంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ భారీగా పోలీసు బలగాలతో వచ్చి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదురుచేసి ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకోగా పెనుగులాట జరిగింది. వారిని చెదరగొట్టి అక్కడనుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సొమ్మసిల్లారు. అయినా పోలీసులు ఆయనను నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పి చివరికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యేను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
అంతకు ముందు ఏం జరిగిందంటే..
మూడురోజుల కిందట నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేతాజీనగర్‌లో ముగ్గురు యువకులు ట్యాబ్‌లతో సర్వే పేరిట ఓట్లు తొలగిస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారిని వేదాయపాళెం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలోనే సర్వే బృందంలోని వారికి ఇంటెలిజెన్స్ డీఎస్పీ చెంచుబాబు ఫోను చేయడమే కాక వారిపై చర్యలు తీసుకోవద్దంటూ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సర్వే బృందం నుంచి ఫిర్యాదు తీసుకుని వైఎస్సార్‌సీపీ క్యాడర్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాకుండా సర్వేకు వచ్చిన యువకులను వదిలివేశారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఇదే అన్యాయం అంటూ వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.నరసింహరావును ప్రశ్నించారు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలని పట్టుబట్టారు. అక్కడే మూడు గంటల పాటు కూర్చున్నారు. దీంతో 24 గంటలు మౌనం వహించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి హడావుడిగా కేసు నమోదు చేశారు. అనంతరం కోటంరెడ్డి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే తర్వాత తమ విధులకు భంగం కల్గించారంటూ ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నాయకులు సాయి సునీల్, బెజవాడ మేఘనాథ్‌సింగ్, మురహరి, పిండి సురేష్, పురుషోత్తంనాయుడు, శామ్యూల్, విష్ణు, శ్రీనివాసులపై (ఎఫ్‌ఐఆర్ 70/2019) 143, 353, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ కింద నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశారు.
అస్వస్థతతో కింద పడిపోయిన కోటంరెడ్డి.. నిరసన వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు
జైలులో ఆమరణదీక్ష....
పోలీసుల తీరుకు నిరసనగా కేంద్రకారాగారంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. తమపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, నియోజకవర్గంలో తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనకేమైనా జరిగితే నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగానిదే పూర్తి బాధ్యత అని కారాగార అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చినట్లు సమాచారం.
ఎంత కాలం ఈ దుర్మార్గం: కోటంరెడ్డి
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షపార్టీకి చెందిన ఓట్లు తొలగించి దుర్మార్గపు పాలన సాగిస్తున్నారంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తాను నాలుగు నెలలుగా కార్యకర్తల సాయంతో నియోజకవర్గంలో అక్రమంగా తొలిగించిన 32 వేల ఓట్లను తిరిగి చేర్పించానన్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వే బృందం పదే పదే అదే పనిచేస్తోంది. వారి అక్రమాలను అడ్డుకుంటున్న మా కార్యకర్తలపై కేసులు పెట్టడం, దాన్ని ప్రశ్నించినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. తమ కార్యకర్తలను రాత్రి 11 గంటల దాకా కోర్టుకు హాజరుపర్చకపోవడంతో తాను స్టేషన్‌కు వెళ్లి ఇప్పటి వరకు కోర్టుకు హాజరుపర్చలేదేమిటని గౌరవంగా సీఐని అడిగానన్నారు. అప్పుడు మూడు గంటల సేపు తాను స్టేషన్‌లో ఉన్నానని, సీఐతో పాటు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారన్నారు. తాను నిజంగా దౌర్జన్యం చేసి ఉంటే తనను ఎందుకు అప్పుడే అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
అధికార పార్టీ ఒత్తిళ్లతోనే
ఇదంతా జరిగిన 24 గంటలు గడిచిన తరువాత శుక్రవారం రాత్రి నుంచి తనపై కుట్ర ప్రారంభమైందన్నారు. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, జిల్లా డీఎస్పీ చెంచుబాబు, సీఐ నరసింహారావు కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారన్నారు. తాము తప్పుచేయలేదని, తమ కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తాను పోరాటాలకు సిద్ధంగా ఉంటానన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment