
ఎమ్మెల్యే వెంకటరమణకు తీవ్ర అస్వస్థత
గుండెపోటుతో స్విమ్స్‌లో చేరిక పరిస్థితి విషమం అంటున్న వైద్యులు
తిరుపతి: గుండెజబ్బుతో బాధపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంక టరమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లో కళ్లుతిరిగి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ విలేకరులతో మాట్లాడుతూ బీపీ, సుగర్ లెవల్స్ తగ్గిపోయాయని, కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు.
దీనికితోడు గుండెపోటు కూడా రావడంతో పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్ కూడా 80/80కి పడిపోయిందని తెలిపారు. డయాలసిస్‌కు ఎమ్మెల్యే శరీరం సహకరించే పరిస్థితి కనపడడం లేదన్నారు. డయాలసిస్ చేస్తేగానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని ఎమ్మెల్యేకి వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ వెంగమ్మతో పాటు ముగ్గురు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్విమ్స్‌కు వచ్చి తిరుపతి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ నాయకులంతా స్విమ్స్ వద్దకు చేరుకున్నారు.