తెలుగు తమ్ముళ్లకు దీపం | MLAs make a list of homes | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లకు దీపం

Published Wed, Feb 25 2015 1:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

MLAs make a list of homes

గ్యాస్‌లోనూ ‘పచ్చ’ముద్ర
సభలకు మంగళం
జన్మభూమి కమిటీలదే పెత్తనం
ఎమ్మెల్యేల ఇళ్లల్లో జాబితాల తయారీ

 
విశాఖపట్నం: ఏ నిధులు వచ్చినా..ఏ పథకానికి శ్రీకారం చుట్టినా అవి పచ్చనేతల సంక్షేమం కోసమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రాకరాక వచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. నిబంధనలను సైతం పక్కన పెట్టి వచ్చినవన్నీ పంచు కోవడమే తెలుగుతుమ్ముళ్ల లక్ష్యంగా మారింది. తాజాగా దీపం  గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ వరసలోకే చేరింది. జిల్లాకు 15,481 గ్యాస్‌కనెక్షన్లు మంజూరయ్యాయి. కానీ ఇవేమీకొత్తగా మంజూరు చేసినవేమి కావు. గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో రాష్ర్ట ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల మంజూరు చేయకుండా నిలిపివేసిన వేలాది కనెక్షన్లను ఇప్పుడు తామేదో కొత్తగా మంజూరు చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ పంపిణీకి సన్నద్ధం చేశారు. ఎన్నికల ముందు ఎంపికైన లబ్ధిదారులంతా ఈ కనెక్షన్ల కోసం కళ్లల్లో  ఒత్తులేసుకుని గ్యాస్ కంపెనీల చుట్టూ ఇన్నాళ్లు తిరిగారు. కానీ ఈ జాబితాలనుపక్కన పెట్టేసిన టీడీపీ సర్కార్ కొత్తగా అర్హుల జాబితా ఎంపిక కోసం గతనెల 21వ తేదీన జీవో నెం-2 ను జారీచేసింది. ఈ జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను గ్యాస్‌కంపెనీలు, పౌరసరఫరాలు, రెవెన్యూశాఖాధికారులుకు అప్పగించారు.

ఇదంతా సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభ సమక్షంలోనే జరగాలి. ఇలా అయితే తమ ముద్ర కనపడదనే భావనతో జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టేలా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. జన్మభూమి కమిటీ పర్యవేక్షణలోనే దీపం లబ్దిదారుల ఎంపిక చేపట్టాలన్నది ఈ జీవో సారాంశం. వితంతువులు, వికలాంగులు, అల్పాదాయ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. కానీ గ్రామసభలోనే ఎంపిక జరగాలి..కచ్చితంగా నిబంధనలను  పాటించాలి. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమ అనుచరులను ఈ జాబితాలో చేర్చి జన్మభూమికమిటీల ద్వారా ఆమోదముద్ర వేసి ఎంపీడీలకు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే సభల్లోనే ఎంపిక జరిగినట్టుగా రికార్డులు సైతం సృష్టిస్తున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే ఎమ్మెల్యే గార్ని అడగండి అంటూ సలహా ఇస్తు న్నారు.

ఈ నెలాఖరులోగా జాబీతాలు సిద్ధం చేసి వచ్చే నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వితంతు, వికలాంగ లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కంపెనీలిచ్చిన దరఖాస్తులన్నీ కార్యకర్తలు ఇచ్చి నింపుతున్నారు. వీరిలో చాలా మందికి గ్యాస్ కనెక్షన్లున్నప్పటికీ కుటుంబసభ్యుల పేరిట మరో కనెక్షన్లు తీసుకునేందుకు కార్యకర్తలు ఎగబడుతున్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్ద గ్యాస్ కనెక్షన్ల కోసం కార్యకర్తల సందడి కనిపిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement