పోలీసులపై టీడీపీ నేతల కన్ను
- అర్బన్, చిత్తూరు జిల్లాల్లో సీఐలపై త్వరలో వేటు
- మండల స్టేషన్లలో ఎస్‌ఐలకూ స్థానచలనం
- ఇప్పటికే బాబు దృష్టికి తీసుకెళ్లిన తమ్ముళ్లు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకుల దృష్టి అధికారులపై పడింది. నిన్నమొన్నటి వరకు పాలనా వ్యవహారాల్లో తమకు అనుకూలమైన వారి జాబితాను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పోలీసులపై దృష్టి సారించారు. పోలీసు శాఖలో తమకు అనుకూలమైన అధికారులను పోస్టింగ్‌లు వేయించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వారంలోపే ఈ మార్పులు చేయించాలని జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పట్టుదలగా ఉన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ముఖ్యంగా తిరుపతి నగరంలో కమ్మ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన అధికారులను తెచ్చుకోవాలనే ఆలోచనలో కసరత్తు మొదలుపెట్టారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి వంటి పట్టణాల్లోని కీలక పోస్టింగ్‌లో ఉండే పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో బయటి జిల్లాలకు వెళ్లలేదు. వరుసగా వచ్చిన మూడు ఎన్నికల్లో పోలీసులు తమకు అనుకూలంగా వ్యవహరించకపోగా ఇబ్బంది పెట్టారన్న కోపంతో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులను తక్షణం బదిలీ చేయాల్సిందేనని చంద్రబాబును కోరనున్నట్లు సమాచారం.
సీఐలే లక్ష్యం
చిత్తూరు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాల్లో మూడేళ్లకు పైగా పనిచేస్తూ తిరుపతి, చిత్తూరులో కొనసాగుతున్న సీఐలకు స్థాన చలనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. చిత్తూరులో గతంలో తమ రాజకీయ ప్రత్యర్థులు చెప్పినట్లుగా అధికారులు పనిచేశారని, అలాంటి వారు తమకు అక్కరలేదని, తక్షణం బదిలీ చేసి, తాము సూచించిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ క్రమంలో చిత్తూరు ఒన్ టౌన్, టూటౌన్‌లతోపాటు రూరల్ సర్కిల్, ట్రాఫిక్, క్రైం సీఐలకు స్థాన చలనం తప్పకపోవచ్చని సమాచారం. తిరుపతిలో ఈస్టు, వెస్ట్, తిరుచానూరు, ఎస్వీ యూనివర్సిటీ, అలిపిరి సీఐలకు కూడా స్థానచలనం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఒకరిద్దరు గల్లా అరుణకుమారి ప్రాపకంతో తిరుపతిలోనే కొనసాగేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.
తిరుపతి నగరానికి సంబంధించి ఎన్నికల్లో పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఎమ్మెల్యే వెంకటరమణ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన కూడా తనకు అనుకూలురైన పోలీసు అధికారులను పిలిపించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
డీఎస్పీలపైనా త్వరలో బదిలీ వేటు
జిల్లాలో 10కి పైగా ఉన్న డీఎస్పీ పోస్టింగ్‌ల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. తిరుపతి ఈస్టు, వెస్ట్‌లతోపాటు శ్రీకాళహస్తి, తిరుమల డీఎస్పీ పోస్టింగ్‌ల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికలకు ముందే బాధ్యతలు స్వీకరిం చిన ఒకరిద్దరు డీఎస్పీలు కూడా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో వచ్చినవారు కావడం తో వారిపైనా వేటు పడనుంది.
చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో పలమనేరు, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు డీఎస్పీల పోస్టింగుల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసిన తర్వాత కొత్తవారిని నియమించి ఆ తర్వాతే కింది అధికారుల బదిలీలకు తెరలేపుతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధినేత ద్వారా తమ నియోజకవర్గాల్లో కొత్త అధికారుల నియామకం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.