గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: వీఆర్వో పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈనెల 26న వీఆర్వో మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. స్థానిక బ్రాడీపేటలోని సమాఖ్య జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పోటీ పరీక్షల్లో నిపుణులైన అధ్యాపకులతో ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం నిర్వహించే వీఆర్వో పరీక్షకు జనరల్ స్టడీస్‌లో 60 ప్రశ్నలు, అర్ధమెటిక్ నుంచి 30, లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలుంటాయని వివరించారు. జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ అంశాలపై ఉంటాయని, దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పరీక్ష రాయగోరు వారు బ్రాడీపేట 4/14 లోని సమాఖ్య కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి కె. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
26న వీఆర్వో మోడల్ పరీక్ష
Published Wed, Jan 8 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement