ఆకలికి వైద్యం అన్నం పొట్లం | Women Cooking An Extra Food And Feeding Strangers One Meal At A Time | Sakshi

ఆకలికి వైద్యం అన్నం పొట్లం

Jun 27 2023 12:28 AM | Updated on Jun 27 2023 7:16 AM

Women Cooking An Extra Food And Feeding Strangers One Meal At A Time - Sakshi

సేకరించిన అన్నం పొట్లాలు పంచుతున్న డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు

హాస్పిటల్‌లోని పేషెంట్లకు వైద్యులు వైద్యం చేస్తారు. కాని వారి ఆకలికి ఎవరు వైద్యం చేస్తారు? కేరళలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని  పేషెంట్ల కోసం, వారిని చూసుకుంటూ ఉండిపోయిన బంధువుల కోసం ఎందరో గృహిణులు వంట చేస్తారు. ‘అన్నం పొట్లం’ కట్టి అందిస్తారు. ఇలా దాదాపు రోజూ 40 వేల అన్నం పొట్లాలు అక్కడి యూత్‌ ఫెడరేషన్‌ ద్వారా నిత్యం సరఫరా అవుతూనే ఉంటాయి.

ఉదయాన్నే లేచిన సౌమ్య ఆఫీసుకు వెళ్లే భర్త కోసం క్యారేజీ కట్టే హడావిడిలో ఉంది. అలాగే పిల్లలకు కూడా లంచ్‌ బాక్సులు కట్టాలి. ఒకటిన్నర గ్లాసుల బియ్యం పడేస్తే సరిపోతాయి. కాని ఆమె ఆ రోజు రెండు గ్లాసులకు పైనే వండింది. భర్తకు, పిల్లలకు కట్టగా తను తినాల్సింది గిన్నెలో పెట్టి మిగిలింది పొట్లంగా కట్టింది. అన్నంతో పాటు పప్పు, పచ్చడి, తాలింపు, ఒక ఆమ్లెట్టు... చక్కగా అరిటాకులో వేసి న్యూస్‌పేపర్‌లో చుట్టింది.

ఆ పొట్లాన్ని కాసేపటికి ఒక కార్యకర్త వచ్చి సేకరించుకుని వెళ్లాడు. అలా ఆ కార్యకర్త ఆ వీధిలో అన్నం పొట్లం కట్టమని చెప్పిన ఇళ్లన్నింటికీ వెళ్లి అన్నం పొట్లాలను సేకరించాడు. ఇలా సేకరించినవి మధ్యాహ్నానికి ఊళ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుతాయి. లోపల ఉన్న పేద పేషెంట్లకూ వారి కోసం బయట కాచుకుని ఉన్న అటెండర్ల కోసం పంచుతారు. ‘ఏ తల్లి కట్టిచ్చిన అన్నమో’ అని తిన్నవారు ఆ గృహిణులను ఆశీర్వదిస్తారు. ఇలా కేరళలో గృహిణుల వల్ల గత నాలుగేళ్లుగా రోగుల ఆకలి తీరుతోంది. వారి ఆరోగ్యం బాగుపడుతోంది.

ఇంటి నుంచి ఆస్పత్రికి
కేరళలోని డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డివైఎఫ్‌ఐ) 2017లో 300 అన్నం పొట్లాలు సేకరించి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుసంధానంగా ఉండే పెద్దాస్పత్రులకు పంచే కార్యక్రమం మొదలు పెట్టింది. దీనికి వారు పెట్టిన పేరు ‘హృదయపూర్వం పొత్తిచోరు’. అంటే ‘హృదయపూర్వకంగా అన్నం పొట్లం’. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు అన్నం కొనుక్కునే స్తోమత అన్ని వేళలా ఉండదు.

అలాగే వారిని చూసుకోవడానికి వచ్చే బంధువులు కూడా అన్నం కొనుక్కోలేరు. పేదవారు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా అని డివైఎఫ్‌ఐ కార్యకర్తలకు అనిపించింది. ‘ప్రతి ఇంట్లోనూ ఓ అమ్మ అన్నం వండుతుంది. ఒక గుప్పెడు అదనంగా వండమని కోరుదాం. ఒకరికి భోజనం పొట్లం కట్టి ఇవ్వమని అడుగుదాం. ఇస్తారు’ అని స్త్రీల కరుణ మీద ఉండే విశ్వాసంతో ధైర్యంగా రంగంలోకి దిగారు. కార్యక్రమ ప్రారంభం రోజున 300 అన్నం పొట్లాలు వచ్చాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 40,000 అన్నం పొట్లాలు పంపిణీ అవుతున్నాయి.

పకడ్బందీగా సేకరణ
కేరళ అంతా డివైఎఫ్‌ఐ కార్యకర్తలు ఉన్నారు. వారు తమ తమ ఊళ్లలో ఎన్ని అన్నం పొట్లాలు అవసరమో లెక్కించి తమ ఏరియాలో ఉన్న గృహిణులను ముందు రోజే రిక్వెస్ట్‌ చేస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం అన్నం పొట్లం ఇవ్వమంటారు. అలా ఒకోరోజు ఒక ఏరియాలో కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని అడుగుతారు. మళ్లీ ఆ ఇళ్లలోని గృహిణులను అడగడానికి వారం పదిరోజులు పట్టొచ్చు. అందుకని స్త్రీలు సంతోషంగా అన్నం పొట్లం కట్టి ఇస్తారు. కొందరు స్త్రీలు రెండు మూడు పొట్లాలు కట్టిచ్చి సంతోష పడతారు.

సారీ అంకుల్‌!
ఈ అన్నం పొట్లాల పంపిణిలో ఎన్నో ప్రేమమయ సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక రోగికి తన వంతుగా అందిన అన్నం పొట్లంలో చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది. ‘అంకుల్‌.. అమ్మకు వీలు కాలేదు. నేనే స్కూల్‌కు వెళ్లే హడావిడిలో  వంట చేశాను. అంత రుచిగా లేవు. క్షమించండి. మీరు తొందరగా కోలుకోండి’ అని ఒక అమ్మాయి రాసింది. దానిని అందుకుని ఆ రోగి ఆ చీటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ ‘బంగారుతల్లీ... నువ్వు పంపిన భోజనం ఎంతో రుచిగా ఉంది. మెతుకు మెతుకులో నీ ప్రేమ ఉంది’ అని రాశాడు.
అన్నం పొట్లం కట్టివ్వడానికి అమ్మలాంటి స్త్రీలు ఎందరో ఉంటారు.
చేయవలసిందల్లా ప్రయత్నమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement