అమ్మమ్మే ఆసరా...
Published Fri, Mar 14 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
సాక్షి, కాకినాడ :తండ్రికి బాధ్యత పట్టదు... దీంతో తల్లే అన్నీ అయి ఆ ముగ్గురు పిల్లల్నీ పెంచుకునేది. అంతలో విధి వక్రించింది. కాకినాడ ఏటిమొగకు చెందిన ఆ తల్లి రచ్చా వీరమణి (25) 2013 మే నెలలో రాజమండ్రి నుంచి ఆటోలో కోరుకొండ వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె మరణం తర్వాత భర్త అయిపూ ఆజా లేకుండా పోయాడు. ప్రమాదం జరిగిన వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు లేకపోవడంతో పరిహారం కూడా అందలేదు. ఆపద్బంధు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలూ ఆ కుటుంబం దరిచేరలేదు. ఇలా విధి చేతిలో అన్యాయమైపోయిన ఆ కుటుంబంలో ప్రశాంత్ (ఏసు) (8), అగస్టిన్ (5), జాన్ (4) అనే ముగ్గురు పిల్లలూ అనాథలుగా మిగిలారు. తల్లీ తండ్రీ దూరమైన ఆ పిల్లల పోషణ భారం అమ్మమ్మ చెన్ని కామేశ్వరిపై పడింది.
ఆమె ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రమే. బిడ్డలను సాకలేని ఆ పేదరాలు కలెక్టర్ నీతూప్రసాద్ ను కలసి గోడు వెళ్లబోసుకుంది. దీనికి స్పందించిన నీతూప్రసాద్ వెంటనే ప్రశాంత్‌కు హాస్టల్లో సీటు ఇప్పించారు. ఆ బాలుడి బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లా బీసీ సంక్షేమాధికారి టీవీఎస్‌జీ కుమార్ ఆమేరకు చర్యలు తీసుకున్నారు. మిగిలిన ఇద్దరూ ప్రస్తుతం అంగన్‌వాడీ పాఠశాలలో సేదదీరుతున్నారు. అయితే మరీ చిన్నపిల్లలు కావడంతో ఇప్పటికిప్పుడు వారికి సహాయం అందించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ దశలో మరో దారిలేక అమ్మమ్మ కామేశ్వరే వారిని కళ్లలో పెట్టి చూసుకుంటోంది. ప్రశాంత్ (ఏసు)ను తమ హాస్టల్లో చేర్చుకున్నామని, వయసు ప్రాతిపదికగా మూడో తరగతిలో చేర్చామని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. మిగిలిన ఇద్దర్నీ కూడా ఎవరైనా ఆదుకోవాలని అమ్మమ్మ కామేశ్వరి కోరుతోంది.
Advertisement