ఎన్నికలకు సర్వం సిద్ధం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లు గురించి విలేకరులకు వివరించారు. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న వాటి పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.
మే 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అరకు, పాడేరు నియోజకవర్గానికి మాత్రమే ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో కొత్తగా 103 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రూ.29 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం రూ.6 కోట్లు మంజూరైనట్టు చెప్పారు.
24 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ
జిల్లాలో కొత్తగా 1.45 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటి పరిశీలన వేగంగా జరుగుతోందని, మరో 15 వేలు మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల 15లోగా వాటి పరిశీలన కూడా పూర్తి చేసి 19వ తేదీ నాటికి ఓటరు జాబితాను రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఫొటో ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఆ స్లిప్పును చూపించి ఎన్నికల్లో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు.
ఓటరు జాబితాలో పేరు ఉండి ఎన్నికల గుర్తింపు కార్డు లేనప్పటికీ ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపులలో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్మార్ట్ ఓటరు కార్డులు వస్తాయని, ఎన్నికల సంఘం జిల్లాకు పంపించిన వెంటనే బీఎల్‌వో ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు ఉన్న వారు కలర్ కార్డు కావాలంటే మీ-సేవా కేంద్రాల్లో రూ.25 చెల్లించి పొందవచ్చని తెలిపారు.
ఓటుపై అవగాహన
ఈ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 85 నుంచి 90 శాతం జరిగేలా ఓటు వినియోగంపై ప్రజల్లో చైతన్యానికి స్వీప్ కార్యాక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్‌కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ వాక్ ఫర్ ఓట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అలాగే సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఏజెన్సీ సంతల్లో కళాజాత కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికలను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇందుకు పార్టీలు, ప్రజలు సహకరించాని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరావు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.