చాగల్లు: చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన మహిళ తన రెండేళ్ల కుమారుడితో సహా రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాద ఘటన చాగల్లు–బ్రాహ్మణగూడెం రైల్వేస్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. తల్లి పెండ్ర బేబి (24), కుమారుడు వేణుకుమార్ (2) మృతిచెందారు. దీంతో వారి స్వగ్రామం ఎస్.ముప్పవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.ముప్పవరంలో పెండ్ర ఏసు, అతడి భార్య బేబి కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం సాయంత్రం బేబికి కడుపునొప్పి రావడంతో ఏసు మందులు తీసుకువచ్చాడు. వేకువజామున నిద్రలేచి చూసేసరికి బేబితో పాటు చిన్నకుమారుడు వేణుకుమార్ నిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. అయినా ఆచూకీ తెలియలేదు. సోమవారం వేకువజామున వీరి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై బేబి, వేణుకుమార్ విగతజీవులుగా పడి ఉండటాన్ని రైల్వే కీమేన్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు రాజ మండ్రి రైల్వే ఎస్సై శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
కుటుంబ కలహాలే కారణమా..
కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఏసుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన బేబితో సుమారు నా లుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న మనోజ్‌కుమార్, రెండేళ్ల వయసున్న వేణుకుమార్ ఉన్నారు. బేబి అక్క కరుణ, ఏసు అన్న భార్యాభర్తలు. అక్కాచెల్లెళ్ల కుటుంబాలు గ్రామంలోని రెండు పోర్షన్ల డాబా ఇంట్లో నివసిస్తున్నాయి. ఏడాది క్రితం బేబి, ఏసు గొడవ పడటంతో బేబి పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత పెద్దల సమక్షంలో రాజీ చేసి బేబిని కాపురానికి పంపించారు. అల్లుడు ఏసు తరచూ తాగి వచ్చి తన కుమార్తె బేబిని వేధించేవాడని, ఈ దారుణానికి అల్లుడే కారణమని బేబి తండ్రి సిర్రాపు తాతారావు ఆరోపిస్తున్నారు. తల్లీబిడ్డలు మృతిచెందిన తీరును బట్టి చూస్తే ఇది హత్యేనని పలువురు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment