Mother and children died
-
తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం
కుషినగర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు. గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. సంగీత భర్త వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత కారణంగా వీలు కాలేదు.సంగీతతోపాటు ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు వయస్సున్న చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. ఫైరింజన్ వచ్చే సరికే ఈ ఘోరం జరిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
విషాదం: పుట్టిన కొన్ని గంటలకే శిశువు.. ఆ వెంటనే తల్లి..
సాక్షి. ఆదిలాబాద్: శుభవార్త కోసం వేచిచూస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.. మొదటి కాన్పు కావడంతో పుట్టింటి, నెట్టింటివారు గర్భి ణిని ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్న మగ శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శిశువు మృతిచెందగా, సాయంత్రం 5 గంటలకు బాలింత తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సయ్యద్ అక్బర్అలీ, షాకెర సుల్తానాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల షాకెరా సుల్తానా గర్భం దాల్చింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని శారద నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. 2.30 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే శిశువు శ్వాస సరిగా తీసుకోవడంలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించడంతో కుటుంబీకులు అంత్యక్రియలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలింత కూడా మృతిచెందిందని వైద్యురాలు చైతన్య స్రవంతి కుటుంబ సభ్యులకు తెలిపారు. మొదట బాలింత పరిస్థితి ఏ విధంగా ఉందని అడగగా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పినా ఇక్కడే వైద్యం అందిస్తామని వైద్యురాలు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: తెలంగాణ: ఒక్కరోజే ఆరుగురి మృతి.. దాంతో ఆటలోద్దు! డాక్టర్ నిర్లక్ష్యంతోనే.. వైద్యురాలి నిర్లక్ష్యంతో తల్లీబిడ్డ మృతిచెందారని బంధువులు, కుటుంబీకులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆస్పత్రిలోనికి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు యత్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలిపై కేసు నమోదు చేసి ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావ్, వన్‌టౌన్ సీఐ, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అయినా ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రిలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు బయటకు తీసుకురావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఓ వైద్యుడు సాధారణ కాన్పు జరిగిందని, బీపీ ఎక్కువై ఫిట్స్ రావడంతో బాలింత మృతిచెందిందని తెలిపారు. ఈ విషయమై వైద్యులను ‘సాక్షి’ సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
మిమ్మలను చంపి మరో పెళ్లిచేసుకుంటాననేవాడు..
పశ్చిమగోదావరి, మొగల్తూరు: మొగల్తూరులో సోమవారం తల్లీకూతుర్లు మృతి ఘటనలో మిస్టరీ వీడలేదు. కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మృతిరాలి తల్లితండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన రాత్రే మృతురాలి భర్త నల్లి మిల్లి వెంకట రామాంజనేయరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు నరసాపురం తరలించారు. సీఐ కృష్ణమోహన్ ఆధ్వర్యం లో దర్యాప్తు సాగుతోంది. సోమవారం రాత్రి తల్లి, కుమార్తెల మృతదేహాలను బంధువుల సమక్షంలో నరసాపురం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంగళవారం మృతదేహాలకు పో స్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మీప్రసన్న, కుమార్తెలు రోజా శ్రీలక్ష్మి, జాహ్నవి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజా శ్రీలక్ష్మి మెడకు ఎడమ వైపున రక్తపు గాటు ఉండటం, జాహ్నవి మెడవద్ద కూడా రక్తపు చారికలు కనబడటం, ఫ్యాన్‌కు ఉరివేసుకున్న లక్ష్మీప్రసన్న ముక్కు నుంచి రక్తం కారడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ కలహల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కుమార్తెలను చంపి తల్లి లక్ష్మీప్రసన్న ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామాంజనేయరెడ్డి తల్లి దశదిన కర్మ నిర్వహించిన ఆది వారం రోజున కుటుంబసభ్యులు లక్ష్మీప్రసన్నను వేధించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక దశలో రామాంజనేయరెడ్డి ఆవేశంతో మిమ్మలను చంపి మరో పెళ్లిచేసుకుంటానని అంటుండేవాడని మృతిరాలి తండ్రి కర్రి సత్యనారాయణరెడ్డి పోలీ సుల సమక్షంలో ఆరోపించాడు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పో స్టుమార్టం నివేదిక, పోలీస్ విచారణలో నిజ నిజాలు వెల్లడి కావాల్సి ఉంది. -
కన్నీరు పెట్టిన జైనా..
సాక్షి, ధర్మపురి: జైన కన్నీరుపెట్టింది.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తల్లీపిల్లల అంత్యక్రియలకు శనివారం ఊరంతా కదిలింది. ఒక పాడెపై తల్లి.. మరో పాడెపై ఇద్దరు పిల్లల మృతదేహాలను ఉంచి నిర్వహించిన శవయాత్ర అందరినీ కన్నీరు పెట్టించింది. తల్లీపిల్లలకు ఊరంతా కంటతడితో వీడ్కోలు పలికింది. జైనా గ్రామానికి చెందిన టేకుమట్ల సత్తవ్వ(32) దోహాఖతర్ నుంచి స్వగ్రామానికి వస్తున్న భర్తను తీసుకొచ్చేందుకు తన కుమారుడు శ్రావణ్(12), కూతరు శాలిని (10)తో వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరితోపాటు ధర్మపురికి చెందిన కారు డ్రైవర్ జెట్టి రాజ్‌కుమార్(24) కూడా దుర్మరణం చెందాడు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు స్వగ్రామానికి శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. జైనాలో తల్లీపిల్లల మృతదేహాలను చూసేందుకు ఊరంతా కదలివచ్చింది. ఒకే పాడెపై అన్నాచెల్లెలు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు సత్తవ్వ మృతదేహాన్ని ఒక పాడెపై, అన్నాచెల్లెలు శావ్రణ్, శాలిని మృతదేహాలను ఒకపాడెపై ఉంచి అంతిమాయాత్ర నిర్వహించారు. ఈదృశ్యం అందరినీ కదిలించింది. దోహాఖతర్ నుంచి వచ్చిన సత్తవ్వ భర్త రాజేశ్ ముగ్గురికీ నిప్పుపెట్టాడు. గ్రామ శివారులోని గోదావరి నది వరకు అంతిమయాత్ర సాగింది. ముగ్గురి మృతదేహాలను నదిలో ఖననం చేశారు. కాగా, ధర్మపురిలో కారు డ్రైవర్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. శనివారం జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు -
పట్టాలపై విడిచిన ప్రాణాలు
చాగల్లు: చాగల్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామానికి చెందిన మహిళ తన రెండేళ్ల కుమారుడితో సహా రైలుపట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాద ఘటన చాగల్లు–బ్రాహ్మణగూడెం రైల్వేస్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. తల్లి పెండ్ర బేబి (24), కుమారుడు వేణుకుమార్ (2) మృతిచెందారు. దీంతో వారి స్వగ్రామం ఎస్.ముప్పవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.ముప్పవరంలో పెండ్ర ఏసు, అతడి భార్య బేబి కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బేబికి కడుపునొప్పి రావడంతో ఏసు మందులు తీసుకువచ్చాడు. వేకువజామున నిద్రలేచి చూసేసరికి బేబితో పాటు చిన్నకుమారుడు వేణుకుమార్ నిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. అయినా ఆచూకీ తెలియలేదు. సోమవారం వేకువజామున వీరి ఇంటికి సమీపంలోని రైలు పట్టాలపై బేబి, వేణుకుమార్ విగతజీవులుగా పడి ఉండటాన్ని రైల్వే కీమేన్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదు మేరకు రాజ మండ్రి రైల్వే ఎస్సై శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ కలహాలే కారణమా.. కుటుంబ కలహాలే వీరి మృతికి కారణమని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఏసుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన బేబితో సుమారు నా లుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న మనోజ్‌కుమార్, రెండేళ్ల వయసున్న వేణుకుమార్ ఉన్నారు. బేబి అక్క కరుణ, ఏసు అన్న భార్యాభర్తలు. అక్కాచెల్లెళ్ల కుటుంబాలు గ్రామంలోని రెండు పోర్షన్ల డాబా ఇంట్లో నివసిస్తున్నాయి. ఏడాది క్రితం బేబి, ఏసు గొడవ పడటంతో బేబి పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత పెద్దల సమక్షంలో రాజీ చేసి బేబిని కాపురానికి పంపించారు. అల్లుడు ఏసు తరచూ తాగి వచ్చి తన కుమార్తె బేబిని వేధించేవాడని, ఈ దారుణానికి అల్లుడే కారణమని బేబి తండ్రి సిర్రాపు తాతారావు ఆరోపిస్తున్నారు. తల్లీబిడ్డలు మృతిచెందిన తీరును బట్టి చూస్తే ఇది హత్యేనని పలువురు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి
విద్యుదాఘాతమేనంటున్న బంధువులు ఫుడ్ పాయిజన్‌పై అనుమానాలు ముంజులూరు (బంటుమిల్లి) : మండలంలోని ముంజులూరు గ్రామంలో ధాన్యం, బియ్యం వ్యాపారం చేసుకునే సొలసా చంద్రశేఖర్ భార్య, పిల్లలు సోమవారం ఉదయం బెడ్ రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెంది ఉండటం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలో దాదాపు 15 సంవత్సరాలకు పైగా సొలసా చంద్రశేఖర్, హరికిషోర్ అన్నదమ్ములు రైస్ మిల్లు నడుపుతూ ధాన్యం, బియ్యం కమీషన్ వ్యాపారం చేస్తుంటారు. జాయింట్ కుటుంబంగా ఉంటున్న వీరు ఒకే ఇంట్లో ఉంటూ వంట, వార్పు కలసి చేసుకుంటారు. రాత్రి వేళ ఎవరికి వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తారు. రోజులాగానే ఉదయం 7 గంటలకు నిద్ర లేచి ఇంటి పనులు చేయాల్సిన చిన్న కోడలు ఇంకా బయటకు రాకపోవడంతో నిద్ర లేపుదామని సుమారు 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లిన అత్త శారదకు మంచంపై పడి ఉన్న కోడలు రాధిక(29), పెద్ద మనుమడు చంద్రహాస్(5), చిన్న మనుమడు లక్ష్మి చరణ్(3) ఎటువంటి కదలికలు లేకుండా పడి ఉండటం చూసి ఆందోళనకు గురై పెద్ద కొడుకు, కోడలుని కేక వేసింది. అక్కడికి వచ్చిన వారు చూసి ఆందోళనకు గురైన వారు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది పరిశీలించి అప్పటికే తల్లి పిల్లలు మరణించినట్లు పేర్కొన్నారు. మృతురాలు భర్త శేఖర్ ఆదివారం రాత్రి ధాన్యం సొమ్ములు వసూలు చేసుకువచ్చేందుకు మచిలీపట్నం వెళ్లాడు. ఆలస్యం కావడంతో అక్కడే అత్త ఇంటి వద్ద నిద్రించాడు. మృతురాలు రాధిక, భర్త శేఖర్లు మేనత్త, మేనమామ పిల్లలు కావడంతో వారి మధ్య ఎటువంటి వివాదాలు లేవని, ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమీ లేవని గ్రామస్తులు చెబుతున్నారు. భార్య మరణ సమాచారం బందరులో ఉన్న భర్త శేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో భర్త, ఆమె తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని విగతజీవులై పడి ఉన్న భార్యాపిల్లలను చూసి రోదించారు. తల్లీపిల్లల మృతిపై అనుమానాలు రాధిక, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించారని భర్త, తల్లిదండ్రులు పేర్కొం టున్నారు. కూలర్‌కు ఉన్న వైరు కారణంగా ప్రమాదం సంభవించిందని వారు చెబుతుండగా మృతదేహాల ఉన్న తీరు చూచిన వారు ప్రమాదానికి కరెంటు కారణం కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత శేఖర్ పిల్లల్లో ఒకరు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. అది ఎవరికీ తెలియరాలేదు. సంఘటన జరిగి న ప్రదేశంలో మృతదేహాలు ఉన్న తీరును బట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుదని పలువురు భావిస్తున్నారు. పోలీసులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలుస్తోంది. కానీ సమాచారం అందుకున్న బంటుమిల్లి ఎస్.ఐ పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విచారణ జరిపి మృతి కారణాలు తెలుసుకోవలసి ఉందని హెచ్చరించడంతో మృతురాలి తండ్రి పువ్వాడ సంపత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్.ఐ అనుమానాస్పద కేసు నమోదు చేశా రు. తన కూతురు, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని, పంచనామా, పోస్ట్‌మార్టం మంగళవారం నిర్వహిస్తామని ఎస్.ఐ తెలిపారు.