అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి | mysterious case Mother and children died | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి

Published Tue, Jun 2 2015 4:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

mysterious case Mother and children died

విద్యుదాఘాతమేనంటున్న బంధువులు
ఫుడ్ పాయిజన్‌పై అనుమానాలు
 
 ముంజులూరు (బంటుమిల్లి) : మండలంలోని ముంజులూరు గ్రామంలో ధాన్యం, బియ్యం వ్యాపారం చేసుకునే సొలసా చంద్రశేఖర్ భార్య, పిల్లలు సోమవారం ఉదయం బెడ్ రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెంది ఉండటం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలో దాదాపు 15 సంవత్సరాలకు పైగా సొలసా చంద్రశేఖర్, హరికిషోర్ అన్నదమ్ములు రైస్ మిల్లు నడుపుతూ ధాన్యం, బియ్యం కమీషన్ వ్యాపారం చేస్తుంటారు. జాయింట్ కుటుంబంగా ఉంటున్న వీరు ఒకే ఇంట్లో ఉంటూ వంట, వార్పు కలసి చేసుకుంటారు. రాత్రి వేళ ఎవరికి వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తారు.

రోజులాగానే ఉదయం 7 గంటలకు నిద్ర లేచి ఇంటి పనులు చేయాల్సిన చిన్న కోడలు ఇంకా బయటకు రాకపోవడంతో నిద్ర లేపుదామని సుమారు 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లిన అత్త శారదకు మంచంపై పడి ఉన్న కోడలు రాధిక(29), పెద్ద మనుమడు చంద్రహాస్(5), చిన్న మనుమడు లక్ష్మి చరణ్(3) ఎటువంటి కదలికలు లేకుండా పడి ఉండటం చూసి ఆందోళనకు గురై పెద్ద కొడుకు, కోడలుని కేక వేసింది. అక్కడికి వచ్చిన వారు చూసి ఆందోళనకు గురైన వారు 108కి సమాచారం ఇచ్చారు.

108 సిబ్బంది పరిశీలించి అప్పటికే తల్లి పిల్లలు మరణించినట్లు పేర్కొన్నారు. మృతురాలు భర్త శేఖర్ ఆదివారం రాత్రి ధాన్యం సొమ్ములు వసూలు చేసుకువచ్చేందుకు మచిలీపట్నం వెళ్లాడు. ఆలస్యం కావడంతో అక్కడే అత్త ఇంటి వద్ద నిద్రించాడు. మృతురాలు రాధిక, భర్త శేఖర్‌లు మేనత్త, మేనమామ పిల్లలు కావడంతో వారి మధ్య ఎటువంటి వివాదాలు లేవని, ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమీ లేవని గ్రామస్తులు చెబుతున్నారు. భార్య మరణ సమాచారం బందరులో ఉన్న భర్త శేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో భర్త, ఆమె తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని విగతజీవులై పడి ఉన్న భార్యాపిల్లలను చూసి రోదించారు.

 తల్లీపిల్లల మృతిపై అనుమానాలు
 రాధిక, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించారని భర్త, తల్లిదండ్రులు పేర్కొం టున్నారు. కూలర్‌కు ఉన్న వైరు కారణంగా ప్రమాదం సంభవించిందని వారు చెబుతుండగా మృతదేహాల ఉన్న తీరు చూచిన వారు ప్రమాదానికి కరెంటు కారణం కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత శేఖర్ పిల్లల్లో ఒకరు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. అది ఎవరికీ తెలియరాలేదు. సంఘటన జరిగి న ప్రదేశంలో మృతదేహాలు ఉన్న తీరును బట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుదని పలువురు భావిస్తున్నారు.

పోలీసులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలుస్తోంది. కానీ సమాచారం అందుకున్న బంటుమిల్లి ఎస్.ఐ పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విచారణ జరిపి మృతి కారణాలు తెలుసుకోవలసి ఉందని హెచ్చరించడంతో మృతురాలి తండ్రి పువ్వాడ సంపత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్.ఐ అనుమానాస్పద  కేసు నమోదు చేశా రు. తన కూతురు, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని, పంచనామా, పోస్ట్‌మార్టం మంగళవారం నిర్వహిస్తామని ఎస్.ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement