mysterious case
-
సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!
గతజన్మ ఉందని కొందరూ నమ్ముతుంటారు. అలాగే మన మత సంప్రదాయంలో ఆ విషయాల గురించి నొక్కి చెబతుంటాయి. అది వాస్తవికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది స్పష్టంగా తెలియదు. కానీ అందుకు సంబంధి పలు సినిమాలు మాత్రం వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చిన సినిమాలు భారీగా హిట్టయ్యాయి కూడా. అయితే ఈ విషయమై శాస్త్రవేత్తలు ఎన్నాళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. వారికి 1926లో జన్మించిన శాంతి దేవి కథ ఓ సవాలుగానూ ఆసక్తికరంగానూ మారింది. చెప్పాలంటే వారి పరిశోధనలకు సరైన సమాధానంగా ఆమె కేసు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అంతేగాదు ఆ కేసు పునర్జన్మ ఉందని నర్మగర్భంగా తేల్చి చెప్పింది. వివరాల్లోకెళ్తే..1926 డిసెంబర్ 11న ఢిల్లీ నగరంలో శాంతి దేవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో పెద్దదానిలా మాట్లాడుతూ అందర్నీ ఆశ్యర్యపరిచింది. పైగా తనకు జన్మనిచ్చిన తల్లిందండ్రులనే కాదని తిరస్కరించింది. తనకు భర్త, పిల్లలు కుటుంబం ఉందంటూ నమ్మశక్యం కానీ గతజన్మ గురించి పలు ఆసక్తికర విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఈ విషయం దావానంలో భారతదేశం అంతటా వ్యాపించింది. అయితే ఆమె చెప్పే విషయాలను తల్లిదండ్రులు, స్నేహితులు కొట్టిపడేసేవారు. పైగా పిచ్చిదానిలా చూసేవారు ప్రజలంతా. అయితే ఆమె చెప్పే విషయాలు ఎంతవరకు కరెక్ట్ అనేదిశగా పలువురు జర్నలిస్టులతో సహా 15 మంది వ్యక్తులతో కూడిన కమిటి వాస్తవికతను తెలసుకునేందుకు ఇన్విస్టిగేట్ చేయడం ప్రారంభించారు. వారిలో డాక్టర్ కీర్తి స్వరూప్ రావత్ అనే ప్రముక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి శాంతి దేవి కేసును బూటకం అంటూ విర్శిస్తూ ఉండేవారు. వాస్తవాలేంటో చూపించాలనే దిశాగా ఆయన దర్యాప్తులో పాలుపంచుకుని విస్తుపోవడం జరిగింది. దర్యాప్తు బృందం శాంతి దేవి చెబుతున్న గత జన్మకు సంబంధించిన వ్యక్తుల అడ్రస్ ఇవ్వమని అడిగారు. గత జన్మలో తన పేరు లుగ్దీ అని తన భర్తతో కలిసి మధురలో ఉండేదాన్ని అంటూ ఆ చిరునామ ఇచ్చింది. అది నిజమా? కాదా? అని ఆ చిరునామాకు ఉత్తరం రాయగా రిప్లై వచ్చింది. అలాగే శాంతి దేవి చెప్పిన వివరాలు తమ కుటుంబంతో సరిపోయాయని ఆమె మా బంధువని అను పూర్తిగా విశ్వసిస్తున్నామని అని ఆ ఉత్తర సారాంశం. ఇక్కడ శాంతి దేవి ప్రస్తుత జన్మలో ఢిల్లీలో తల్లిదండ్రులతో జన్మిస్తుంది. ఆమె ఉన్న నివాసానికి దాదాపు 145 కిలోమీటర్లు దూరంలో మధుర ఉంది. ఇంతవరకు శాంతి దేవి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లింది కూడా లేదు. ఒక వైపు ఆ బృందం అంతా విచారణ చేస్తుండగా..శాంతి దేవి తన వాళ్లను కలవాలని పట్టుబట్టింది. దీంతో వాళ్లు దేవి చెప్పిన వివరాల ప్రకారం ఆ బంధువులను తీసుకువచ్చారు వారందర్నీ గుర్తించింది. చివరగా ఆమె తన గత జన్మలో భర్తగా చెబుతున్న వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేయగా అతడిని గుర్తుపట్టింది. పైగా తన కొడుకును కలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత జన్మలో ఆమె భర్త పేరు కాంజి మాల్ చౌబే. ఆయన తన మూడో భార్యను తీసుకుని శాంతి దేవిని కలవడం జరిగింది. అంటే చౌబేకు గత జన్మలో శాంతి దేవి రెండో భార్య. ఆయన కూడా ఆమె గుర్తింపుని నిర్థారించేలా తమ ఇద్దరికే తెలిసిన సన్నిహిత ప్రశ్నలు అడిగారు. అందుకు శాంతి దేవి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది ఆమె తన భార్యగా గుర్తించడం విశేషం. నిజానికి మన మత సంప్రదాయాల ప్రకారం ఆత్మకు కొత్త జన్మరాగనే గత జన్మ తాలుకా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఆమెకు గుర్తుండటం ఆశ్చర్యం కలిగించడమే గాక పునర్జన్మ ఉంది అనేందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది శాంతి దేవి.(చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ
వాషింగ్టన్: అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. చైనాలో చిన్నపిల్లలో న్యుమోనియా కేసుల తరహాలోనే.. ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయట. ఈ నేపథ్యంలో అమెరికాలోని రిపబ్లికన్ సెనెటర్లు అమెరికా-చైనా మధ్య ప్రయాణ రాకపోకలను(ట్రావెల్ బ్యాన్‌ను) వెంటనే నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. రిపబ్లికన్ సెనెటర్ల తరఫున ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో, బైడెన్‌కు రాసిన లేఖలో.. ‘చైనాలో వేగంగా విస్తరిస్తున్న బ్యాక్టీరియల్ న్యుమోనియాను.. అమెరికాలో వ్యాపించకుండా అడ్డుకునేందుకు వెంటనే చైనాతో ప్రయాణ రాకపోకలను నిషేధించాలి. గతంలో పలు ప్రజారోగ్య సంక్షోభాలకు చైనా కారణమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో.. వైరస్ ఎలా పుట్టిందనేదానికి ఆ దేశం స్పష్టత ఇవ్వలేదు. ఇచ్చిన వివరణలోనూ పారదర్శకత లోపించింది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. .. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించేంత దాకా మేం చూస్తూ ఉండలేం. అమెరికన్ల ఆరోగ్యం, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అవసమైన చర్యలు తీసుకుంటాం. ప్రయాణ నిషేధంతో న్యూమోనియా కేసుల పెరుగుదల, మరణాలు, లాక్డౌన్ విధించడం వాటిని నిరోధించవచ్చు అని లేఖలో రూబియో అభిప్రాయపడ్డారు. ఈ లేఖపై వైట్‌హౌజ్ స్పందించాల్సి ఉంది. మరోవైపు పెరుగుతున్న న్యుమోనియా కేసులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
డెత్ మిస్టరీ: టీవీ చూస్తూ అస్థిపంజరంలా మారిన మహిళ..
ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తుంటారు. కొన్ని సహాజ మరణాలు కాగా, మరికొందరు అసహజ రీతిలో మరణిస్తుంటారు. అయితే కొన్ని సంఘటనలు వింటే అస్సలు నమ్మబుద్ది కాదు. కానీ కళ్లముందు సాక్ష్యాలు కనబడితే మాత్రం నమ్మకుండా ఉండలేరు. ఇలాంటి కోవలోకే వస్తుంది ఓ డెత్ మిస్టరీ. లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ చనిపోయిన తీరు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ఏంటా కథ? అన్నది ఈ మిస్టరీ స్టోరీలో తెలుసుకుందాం.. లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ విచిత్రమైన రీతిలో మరణించింది. 1965, అక్టోబర్19న యూకేలో జన్మించిన ఈమె పదాహారేళ్ల వయసులో మ్యూజిక్ వైపు దృష్టిపెట్టింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూసేవారు. అయితే ఎందుకో తెలియదు కానీ కొన్నాళ్లకు తన కుటుంబం నుంచి విన్సెంట్ బయటకు వచ్చేసింది. ఓ సంస్థలో చిన్న ఉద్యోగిగి చేరి తన కాళ్లపై తను నిలబడింది. అయితే కుటుంబంతో మాత్రం శాశ్వతంగా బంధాన్ని తెంపేసుకుంది. అప్పటినుంచి విన్సెంట్ ఒంటిరి జీవితానికి అలవాటుపడింది.లండన్‌లోని బెడ్సిట్ అపార్ట్‌మెంట్స్‌లో ఆమె నివసించేది. ఇవి గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలన్నమాట. ఓసారి ట్రస్ట్ అధికారులు ఆమె ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా తలుపుతీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు గుండె జలదరించే దృశ్యం కనిపించింది. ఎదురుగా టీవీ ముందు కుర్చీలో అస్థిపంజరం వాళ్లకు దర్శనం ఇచ్చింది. అది విన్సెంట్దే అని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే.. టీవీ చూస్తేన్నట్లుగానే సోఫాలో కూర్చొని చేతిలో టీవీ రిమోట్ పట్టుకొని ఉండటం అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. 2006 జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఫ్రిజ్‌లోని ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ ఆధారంగా ఆమె చనిపోయి అప్పటికే మూడేళ్లు అయ్యిందని విచారణలో బయటపడింది. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయడం, స్నేహితులతోనూ సంబంధాలు తెంచేసుకొని ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చనిపోవడం, అది మూడేళ్లకు బయటపడటం.. ఇవన్నీ ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయాయి. -
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉధంపూర్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో డొమిల్ చౌక్ వద్ద పార్క్ చేసిన ఖాళీ బస్సులో బధవారం రాత్రి మొదటి పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న కండక్టర్ సునీల్ సింగ్(27), అతని స్నేహితుడు విజయ్ కుమార్(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 8 గంటల్లో రెండు పేలుళ్లు ఉధంపూర్ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద పార్క్ చేసిన బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా 8 గంటల వ్యవధిలో ఉధంపూర్ జిల్లాలో జరిగిన రెండో ప్రమాదం ఇది. మొదటి పేలుడు చోటుచేసుకున్న 4 కిలోమీటర్ల దూరంలోనే ఈపేలుడు జరిగింది. #WATCH | J&K: Investigation underway by Army Bomb Disposal Squad & dog squad at the bus stand in Udhampur. Two blasts occurred within 8 hours in Udhampur; two people got injured in the first blast and are now out of danger, no injury in 2nd blast, says DIG Udhampur-Reasi Range pic.twitter.com/DuCnMngqZq — ANI (@ANI) September 29, 2022 పేలుళ్లకు కారణం? పేలుడు జరిగిన సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఉధంపూర్ డీఐజీ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు నెలల తర్వాత ఉధంపూర్ పట్టణంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. చివరగా ఈ ఏడాది మార్చి 9 న స్లాథియా చౌక్‌లో స్టిక్కీ బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు రానున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
లేడీ ఇన్ బ్లాక్.. చావు అంచుల దాకా వెళ్లి బతికాడు.. ఇప్పటికి మిస్టరీగానే
రెండు విరుద్ధమైన వాదనలెప్పుడూ కథను సుఖాంతం చేయవు. ఏది నిజం? ఏది అబద్ధం? అనే ప్రశ్నలను రగిల్చి, అపరిష్కృతంగా విడిచిపెడతాయి. మిస్టరీలుగా మిగిలిపోతాయి. సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఐ–74 రోడ్డుపై జరిగిన ఘటన అలాంటిదే. అది 1980 జూన్ నెల. కటిక చీకటి, కారుమబ్బులకు హోరుగాలి తోడైంది. రాబర్ట్ డేవిడ్సన్ అనే వ్యక్తి బైక్ మీద ఇండియానాపోలిస్ లోని తన కూతురు ఇంటికి బయలుదేరాడు. వర్షం మొదలయ్యేలోపు అక్కడికి చేరుకోవాలని ఆయన ఆత్రం. కానీ అలా జరగలేదు. ఉన్నపళంగా జోరువాన మొదలైంది. నిజానికి కొన్ని గంటల ముందు నుంచే తుఫాను హెచ్చరికలు సాగుతున్నాయి. ఆ క్రమంలో రాబర్ట్ ఐ–74 రోడ్డుపైకి వచ్చేసరికి వర్షం పెరగడంతో బైక్ బాక్స్‌లోని రెయిన్ జాకెట్ తీసి వేసుకోవడానికి రోడ్డు పక్కకు బండి ఆపాడు. జాకెట్ తీసి, ధరించేలోపు.. ఉరుము ఉరిమి రాబర్ట్‌ను తాకింది. దారిన పోయేవారికి రాబర్ట్ కుప్పకూలడం స్పష్టంగా కనిపించింది ఆ మెరుపులో. చుట్టుపక్కలున్నవారికి అతడి ఆర్తనాదమూ వినిపించింది. పిడుగు దాడిలో 2,00,000 వోల్టుల కరెంటు ఒక్కసారిగా అతనిపై ప్రవహించడంతో రాబర్ట్‌లో ఉలుకూ పలుకూ లేదు. బతికే ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. సమాచారం అందిన కొంతసేపటికే అంబులెన్స్ అక్కడికి వచ్చేసింది. హుటాహుటిన అంబులెన్స్ ఎక్కించారు. రాబర్ట్ పరిస్థితిని గమనించిన వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్సలోనే అతడు ఇక బతకడని నిర్ధారించారు. అతడిలో ఎలాంటి స్పందనా లేదు. ఏ అవయవం పనిచేయట్లేదు. గాలివాన మరింతగా పెరిగిపోతోంది. ఉన్నట్టుండి అంబులెన్స్‌లోని ఎలక్ట్రిక్ పరికరాలన్నీ పని చేయడం మానేశాయి. చుట్టూ ఉన్న వీధి దీపాలు కూడా ఆరిపోయాయి. కరెంట్ పోయిందని అనుకున్నారంతా. మరి అంబులెన్స్‌కి ఏమైంది? రెండు బ్యాకప్ బ్యాటరీలు ఉండగా ఇలా ఎందుకు జరిగింది? అనే అయోమయంలో ఉన్నారా సిబ్బంది. ఇంతలో ఓ అలికిడి. పైనుంచి కింద దాకా నల్లటి వస్త్రాలను ధరించిన ఓ స్త్రీ మూర్తి అక్కడికి వచ్చింది. అంత పెద్ద హోరు వానలో.. ఆమె ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చూడగా... అక్కడ అంబులెన్స్, ఫైరింజిన్, రాబర్ట్ బైక్ తప్ప ఇంకేమీ లేవు. ఆమె చాలా చొరవగా రాబర్ట్‌కు దగ్గరగా వచ్చి.. ‘నేనొకసారి ఇతణ్ణి తాకొచ్చా?’ అని అడిగింది. నిర్ఘాంతపోయారు అక్కడున్నవారు. అంబులెన్స్ సిబ్బందిలో ఒకరు.. ‘ఏదైనా మంచి జరగబోతుందేమో?’ అనుకుంటూ ఆమెకు అనుమతి ఇచ్చారు. దాంతో ఆమె రాబర్ట్‌ని తాకింది. అతడి తలపై చేయి పెట్టి.. ఏవో మంత్రాలు చదివింది. రాబర్ట్‌నే చూస్తూ... మనసులో ఏదో అనుకుంది. కొంత సమయం గడిచాక.. ఆమె అంబులెన్స్ దిగి వెళ్లిపోయింది. ‘మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ తుఫాన్లో ఎలా వెళ్తారు?’ లాంటి ఎన్నో ప్రశ్నలను సంధించారు అక్కడున్నవారు. కానీ ఆమె స్పందించలేదు. ఆమె అలా వెళ్లగానే ఇలా అంబులెన్స్‌లో లైట్లు వెలిగాయి. అప్పుడే రాబర్ట్లోనూ స్పందన కనిపించింది. దాంతో అంబులెన్స్ ఆసుపత్రివైపు కదిలింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్నప్పుడు కూడా రాబర్ట్ స్పృహలో లేడని... దాదాపు చనిపోయినట్లే అని వైద్యులు భావించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడని ప్రకటించారు. రెండు నెలలు గడిచాయి. అతను కోమా నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇలా బతికి ఉన్నాడంటే ఆమే కారణం అన్నారు నాటి ప్రత్యక్షసాక్షులు. ఆమె ఎవరు అని అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదు. నిజానికి అంత పెద్ద పిడుగు పాటుకి గురైన వ్యక్తి బతికి బట్టకట్టడం అనేది మిరాకిల్. అందుకే చాలామంది ఆ సిబ్బంది మాటలను నమ్మసాగారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ధరించిన దుస్తులు 1980 నాటివి కావని, 1800 కాలం నాటివని నాడు అంబులెన్స్‌లో ఉన్న పారామెడికో సిబ్బందిలో ఒకరు బయటపెట్టారు. ఆ విషయం ఆమెని అడుగుదామనుకుంటే.. ఆమె చాలా గంభీరంగా కనిపించిందని.. అడగటానికి భయమేసిందని అతడు చెప్పుకొచ్చాడు. దాంతో ఆ మహిళ ఎవరు అనేదానిపై చర్చ మొదలైంది. ఆమె అనేది అబద్ధమని.. పారామెడికోలు కట్టుకథ అల్లారనే వాదనలు ఒకవైపు నడుస్తుండగానే.. ఆమె దెయ్యమని కొందరు, కాదు దేవదూత అయ్యి ఉంటుందని మరికొందరు వాదనలకు దిగారు. అందుకు తగ్గ ఆధారాలను ఈ కథకు లింక్ చేశారు. ఆమె వచ్చిన సమయంలో అంబులెన్స్‌తో సహా చుట్టూ లైట్స్ ఆరిపోయాయి కాబట్టి.. ఆమె దెయ్యమేనని, పైగా ఆమె ధరించిన దుస్తులు 1800 కాలం నాటివని ప్రత్యక్షసాక్షి చెబుతున్నాడు అందుకని ఆమె కచ్చితంగా దెయ్యమేనని చెప్పుకొచ్చారు చాలామంది. అయితే మరికొందరు మాత్రం ఆమె దేవదూత అనే దానికి ప్రత్యేక కారణం కూడా చెప్పారు. రాబర్ట్‌కి ప్రమాదం జరిగిన రోడ్డు పక్కనే పెద్ద మైదానం ఉందని, అక్కడ 19వ శతాబ్దంలో మతపరమైన ప్రార్థనలు జరిగేవని, వేలమంది ఆ ప్రార్థనల్లో పాల్గొనేవారని, అందువల్ల ఆమె.. దేవదూతేనని వాదించారు. దెయ్యం లేదా దేవదూత లేదా మత ప్రబోధకురాలు కావచ్చు అని కొందరు భావించారు. మొత్తంగా ఆమె ఎవరన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. చావు అంచుల దాకా వెళ్లిన రాబర్ట్‌ని బతకించేంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? అసలు ఆమె ఎవరు? అనేది నేటికీ తేలలేదు. రాబర్ట్ పునర్జన్మ మాత్రం మెడికల్లీ మిస్టరీనే. ∙ఎస్.ఎన్ -
ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ బాల్స్.. తల పట్టుకున్న అధికారులు
Mysterious metal balls raining..ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం కలకలం సృష్టించింది. గుజరాత్ వరుసగా ఇలాంటి గోళాలు పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, సురేంద్ర నగర్ జిల్లాలోని సాయిలా గ్రామంలో సోమవారం కొన్ని లోహపు గోళాలు కనిపించాయి. ఈ లోహపు గోళాలు అక్కడ పడిపోయాయని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. కాగా, గోళాలు ఈకల రూపంలో తీగలుగా ఉండటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక, చాలా వరకు ఈ లోహపు గోళాలు నిర్మానుష్య ప్రాంతంలో ఒకే చోట పడిపోవడంతో అవి ఆకాశం నుంచే పడ్డాయన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో, ఈ వ్యవహారాన్ని తేల్చడానికి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ నిపుణులను సమాచారం అందించారు. ప్రభుత్వ పరిధిలోని ఈ సంస్థ నిపుణులు అంతరిక్షంపై స్పేస్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నిపుణులు లోహపు గోళాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇవి భూమికి సమీప కక్షలో తిరుగుతున్న శాటిలైట్ శకలాలే అయి ఉంటాయని వారు ప్రాథమిక అవగాహనకు వచ్చారు. 'It's a bird. It's a plane...': Mysterious metal balls raining in Gujarat puzzles locals pic.twitter.com/RGKEpPQyoO — Times No1 (@no1_times) May 16, 2022 ఇదిలా ఉండగా.. కొద్ది రోజల క్రితం గుజరాత్లో ఆనంద్ జిల్లాలోని భలేజ్, ఖంబోలాజ్, రాంపుర గ్రామాల్లో సుమారు 5 కిలోల బరువున్న మెటల్ బాల్స్ మొదటిసారిగా ఆకాశం నుంచి భూమిపై పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. Meteorite Or An Alien? Mysterious Metal Balls Fall From Space Video Goes Viral https://t.co/U3dhPxmofB — Trends302 (@Trends_302) May 13, 2022 ఇది కూడా చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్ -
కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!
కరాచి: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇది డెంగ్యూ జ్వరం మాదిరిగానే రోగుల్లో ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తాము డెంగ్యూ కోసం పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ అన్నారు. (చదవండి: వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్ సినిమాలో మాదిరి ఎగురుతోంది!!) పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. అయితే ఈ వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కానీ ఇది డెంగ్యూ జ్వరం కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా?
అపరిష్కృతమైన ప్రతీది మిస్టరీనే కానీ.. కొన్ని మిస్టరీలు వణుకుపుట్టిస్తాయి. నిజమా? అబద్ధమా? అని సందేహించేలోపు ఎన్నో సాక్ష్యాలను ముందుంచి.. నోరువెళ్లబెట్టేలా చేస్తాయి. ఈ స్టోరీ కూడా అలాంటిదే. సుమారు 26 ఏళ్ల కిందట చైనాలో జరిగిన ఈ దుర్ఘటన గురించి.. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి. చైనా రాజధాని బీజింగ్‌లోని టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్‌కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. నిర్మారుష్యమెన రోడ్డుపైన.. చల్లటి ఈదురుగాలుల మధ్య.. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. ఆఖరి బస్సు కావడంతో పెద్దగా ప్రయాణికులు లేరు. డ్రైవర్, కండక్టర్‌తో పాటు బస్సు మొత్తంలో ఒక యువ జంట, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు మాత్రమే ఉన్నారు. కొంత దూరం పోయేసరికి.. కనీకనిపించని చీకటి దారిలో, మలుపుల మధ్యలో కాస్త దూరంగా డ్రైవర్‌కి రెండు నీడలు కనిపించాయి. ఆ ఇద్దరూ బస్ ఆపమన్నట్లు చెయ్యి ఊపుతున్నారు. డ్రైవర్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. కారణం అది స్టాప్ కాదు. బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. కానీ అదంతా గమనించిన కండక్టర్.. ఇదే ఆఖరి బస్సు అని గుర్తు చేసింది. దాంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే ఆ ఇద్దరూ బస్ ఎక్కేటప్పుడు మరో వ్యక్తిని భుజాన్నేసుకుని ఎక్కారు. ఆ మూడో వ్యక్తి తల వెంట్రుకలు ముఖాన్ని కప్పేయడంతో ఆ ముఖం కనిపించలేదు. పైగా ముగ్గురూ విచిత్ర వేషధారణలో ఉన్నారు. రాజుల కాలం నాటి బట్టలు వేసుకుని ఉన్నారు. వాళ్ల మొహాలు కూడా తెల్లగా పౌడర్ కొట్టినట్లుగా ఉన్నాయి. వారిని చూసిన మిగిలిన నలుగురు ప్యాసింజర్స్ భయపడ్డారు. కండక్టర్‌కి ఫిర్యాదూ చేశారు. అయితే కండక్టర్ కూల్‌గా.. ‘వాళ్లు ఏ సినిమా.. డ్రామా ఆర్టిస్టులో అయ్యుంటారు. ఆలస్యం కావడంతో డ్రెస్ మార్చుకునే టైమ్ కూడా లేక అలానే వచ్చేసి ఉంటారు’ అని సర్ది చెప్పింది. అయినా సరే వాళ్ల వాలకం ప్యాసింజర్స్లోని ముసలావిడకు నమ్మశక్యంగా అనిపించలేదు. అనుమానంతో ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉంది. బస్సు వేగం పుంజుకుంది. డ్రైవర్, కండక్టర్ ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. నాలుగు స్టాప్ల తర్వాత ఆ యువజంట బస్ దిగిపోయారు. ఆ జంట దిగిన కాసేపటికే ముసలావిడ రచ్చచెయ్యడం మొదలుపెట్టింది. ఆమెకు దగ్గరలో కూర్చున్న యువకుడిపై అరవటం స్టార్ట్ చేసింది. ‘నువ్వు నా పర్సు దొంగలించావ్, నేను నీపై ఫిర్యాదు చేస్తాను’ అంటూ తిట్టసాగింది. డ్రైవర్, కండెక్టర్ ఎంత నచ్చజెప్పినా∙వినిపించు కోలేదు. ఆ యువకుడు మాత్రం ‘నేను నీ పర్సు తియ్యలేదు’ అని మొరపెట్టుకున్నాడు. అయినా ఆ వృద్ధురాలు ఒప్పుకోలేదు. ‘బస్సు ఆపాల్సిందే.. నువ్వు దిగాల్సిందే.. మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిందే’ అని పట్టుబట్టింది. ఇక లాభం లేదని డ్రైవర్ తర్వాత స్టాప్‌లో ఇద్దరినీ దింపేశాడు. వృద్ధురాలి నిందలతో అప్పటికే విసిగిపోయిన ఆ యువకుడు.. ‘పదా వెళ్దాం.. పోలీస్ స్టేషన్ ఎక్కడా?’ అని అడిగాడు. బస్సు వాళ్లకు దూరంగా వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక ఆ ముసలావిడ ‘నువ్వు ఏ దొంగతనం చెయ్యలేదు. నేనే కావాలని అబద్ధం చెప్పాను. నీ ప్రాణాలు కాపాడ్డానికే అలా చేశాను’ అంది. ‘ఏం అంటున్నావ్?’ అంటూ షాక్ అయ్యాడు యువకుడు. ‘అవును.. నేను నీ ప్రాణాలు కాపాడాను. ఆ ముగ్గురు.. మనుషులు కాదు దెయ్యాలు. గాలికి వాళ్ల బట్టలు పక్కకు జరిగినప్పుడు చూశాను వాళ్లకు కాళ్లు లేవు. అందుకే దొంగతనం నాటకం ఆడాల్సి వచ్చింద’ని అసలు సంగతి చెప్పింది. దాంతో ఆ ఇద్దరూ కలసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు వాళ్లను నమ్మకపోగా పిచ్చివాళ్లని చూసినట్లు చూశారు. మరునాడు 375 బస్సు.. ప్రాగ్రాంట్ హిల్స్‌కు చేరుకోకపోవడంతో వెదకటం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆ ముసలావిడను, యువకుడ్ని ఆరా తీసింది. జరిగింది చెప్పారు వాళ్లు. రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు ప్రాగ్రాంట్ హిల్స్‌కు వంద కిలోమీటర్ల దూరంలో మీయున్ రిజర్వాయరులో ఆ బస్సు ఆచూకీ దొరుకింది. అందులో మొత్తం మూడు శవాలు దొరికాయి. డ్రైవర్, కండక్టర్, మూడో శవం ఓ అజ్ఞాత వ్యక్తిది. అయితే ఆ శవాలు దారుణంగా కుళ్లిపోయున్నాయి. పోస్ట్‌మార్టం తర్వాత డాక్టర్లు చెప్పిందేంటంటే.. ‘కేవలం రెండు రోజుల్లో శవాలు అంతగా కుళ్లిపోవటం సాధ్యం కాదు, ఎవరో కావాలని చేశారు’ అని. లాస్ట్ స్టాప్ అయిన ప్రాగ్రాంట్ హిల్స్ దాటి వంద కిలోమీటర్లు ఆ బస్సు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దిశగా విచారణ మొదలుపెట్టారు. అయితే బస్సులో కేవలం లాస్ట్ స్టాప్‌కి చేరేందుకు సరిపడే పెట్రోల్ మాత్రమే ఉండగా వంద కిలోమీటర్లు ఎలా వెళ్లగలిగిందని పెట్రోల్ ట్యాంక్ చెక్ చేయగా అందులో మొత్తం రక్తమే ఉంది. అది చూసిన పోలీసులు హతాశులయ్యారు. ‘అసలు ఏం జరిగుంటుంద’ని సెక్యూరిటీ కెమెరా టేప్స్ (సీసీటీవీ లాంటివి)లను చెక్ చేయగా ఏ ఒక్క ఫుటేజ్‌లోనూ బస్సు కనబడటం లేదు. ఈ మూడు మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. ఈ ఘటన తర్వాత చాలా ఏళ్లు ఆ దారిలో వెళ్లాలంటేనే వణికిపోయేవారు అక్కడ జనం. నేటికీ ఈ మిస్టరీని కథలుకథలుగా చెప్పుకుంటూంటారు చైనీయులు. ఇదే నేపథ్యంతో పలు సినిమాలూ వచ్చాయి. అయితే సంప్రదాయ చైనీయుల నమ్మకం ప్రకారం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఘోస్ట్ మంత్ నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వర్గ–నరకాల ద్వారాలు తెరుచుకుంటాయని, ఆత్మలు, దెయ్యాలు తిరుగుతుంటాయని వారి నమ్మకం. వాటిని శాంతింపజేయడానికి ఘోస్ట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంటారు. -సంహిత నిమ్మన -
పెళ్లాడిన యువకుడు చిక్కకపోవడంతో..
సాక్షి, చౌటుప్పల్ : ప్రేమ వివాహాన్ని యువతి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకున్న యువకుడి కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆ యువకుడి తండ్రిని పథకం ప్రకారం మాటేసి మట్టుబెట్టారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో ఈ నెల 5వ తేదీన వెలుగుచూసిన వ్యక్తి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం నవనీత అదే గ్రామానికి చెందిన గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబును ప్రేమించింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. ఆ క్రమంలో గతేడాది అక్టోబర్ నెలలో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటున్నారు. అప్పటి నుంచి నవనీత కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేస్తామని నమ్మించి.. ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని నమ్మించిన నవనీత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ నవనీత ప్రేమ వ్యవహారం తెలిసిపోవడంతో మగ పెళ్లివారు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ క్రమంలో అదే నెల 22న నవనీత తాను ప్రేమించిన బాబుతో కలిసి వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంది. కక్ష పెంచుకుని హత్యకు పన్నాగం గ్రామానికి చెందిన గొండిగళ్ల బాబు తన కూతురు నవనీతను పెళ్లిచేసుకోవడాన్ని తల్లిదండ్రులు భరించలేకపోయారు. అదే సమయంలో నవనీత అన్నలు మరింత కక్ష పెంచుకున్నారు. బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపాలనుకున్నారు. అందుకోసం ఇదే మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువైన లౌలేష్తో చర్చించారు. అంతా కలిసి హత్యకు పథకాన్ని రూపొందించారు. ఊర్లోనే మాటు వేసి .. బాబు తండ్రి గొండిగళ్ల గాలయ్య ఈనెల 5న బ్యాంకులో పని నిమిత్తం నారాయణపురం మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఆ సమయంలో నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం గాలయ్య, అతని కుమారులు గడ్డం సురేష్, గడ్డం వెంకటేశ్, గడ్డం రమేష్, సోదరుడి కుమారులు గడ్డం స్వామి, గడ్డం రాజు గ్రామ శివారులో ఉన్న ప్రాథమిక పాఠశాల వద్ద ఉండి గమనించారు. సాయంత్రంలోపు గొండిగళ్ల గాలయ్య తిరిగి స్వగ్రామానికి వస్తాడని భావించి అక్కడే మాటు వేశారు. గొండిగళ్ల గాలయ్య గ్రామానికి వస్తున్న క్రమంలో స్కూల్ వద్ద మాటు వేసి ఉన్న నవనీత అన్న సురేష్ తన వెంట తెచ్చుకున్న ముంజ కొడవలితో నరికి చంపాడు. ఆరుగురు నిందితులు గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద ఉండగా, మరో నిందితుడు దాసరి లౌలేష్‌ను పుట్టపాక గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద కత్తి, స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నల్లగొండ కోర్టుకు తరలించారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు ఉన్నారు. -
మిస్టరీగా మారిన జంట హత్యలు
సాక్షి, రామచంద్రపురం: అత్యంత కిరాతకంగా హత్యకు గురైన తల్లీకూతుళ్ల జంట హత్యల కేసు మిస్టరీగా ఉంది. హత్య జరిగిన రెండో రోజు కూడా హంతకులు ఎవరనేది తెలియరాలేదు. పేదరికంతో ఉన్న ఈ కుటుంబంలో ఎందుకు హత్యలకు పాల్పడ్డారనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. రామచంద్రపురం పట్టణంలో చప్పిడివారి సావరంలో దండుగంగమ్మ గుడి వీధిలో ఒక ఇంట్లో రక్తపు గాయాలతో హత్యకు గురైన బలసా మాధవి, బలసా కరుణల హత్యకేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన నాటి నుంచి రామచంద్రపురం డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు. హత్య జరిగిన రాత్రి నుంచి మృతురాలి మాధవి కుమారుడు విజయ్, భర్త శ్రీనివాసులు ఆచూకీ కనిపించకపోవడంతో వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాకినాడలోని ఒక హోటల్లో పని చేసే తండ్రీకొడుకులు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. హత్య జరిగిన రాత్రి కొడుకు విజయ్ రావడం అనంతరం ఉదయానికి కనిపించకుండా పోవడం కూడా పోలీసులు విజయ్‌పైనే అనుమానంతో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అనుమానంగా సీసీ టీవీ ఫుటేజీలు హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ డాగ్ బ్రాడీపేట రోడ్డు మీదుగా ప్రధాన రహదారిలోకి వచ్చి నిలిచిపోయింది. అయితే ఈ రహదారిలో పోలీసులు షాపుల్లోను విద్యా సంస్థల్లో పెట్టిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్టు తెలిసింది. ఈ సీసీ టీవీ ఫుటేజీలో హత్య జరిగిన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అదే రోడ్డులో ఒక వ్యక్తి సైకిల్‌మీద వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వెళుతున్న దృశ్యాలు రికార్డు అయినట్టు పోలీసులు గమనించారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగిన రాత్రి సైకిల్ మీద వచ్చిన మృతురాలు మాధవి కుమారుడు విజయ్ ఉదయానికి సైకిల్‌తో పాటు కనిపించకపోవడం, సీసీ టీవీ ఫుటేజీల్లో అదే రోడ్డులో సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలు మాధవి సోదరుడు సోమవారం రామచంద్రపురం చేరుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం బల్లిపాడుకు చెందిన గుండా బత్తులు వెంకన్న మృతురాలు మాధవికి అన్నయ్య అవుతాడు. పోలీసుల సమాచారం మేరకు అతడి రక్తసంబంధీకులతో కలసి వెంకన్న రామచంద్రపురం వచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారికి అప్పగించారు. అయితే వెంకన్న పోలీసులకు కొంత సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మాధవి భర్త శ్రీనివాసు తన కుమారుడు విజయ్‌తో కలిసి కాకినాడలో నివసిస్తూ భార్య, కుమార్తెను పట్టించుకునేవాడు కాదని, తరచూ తన వద్దకు డబ్బుల కోసం వేధించేవాడని చెప్పినట్టు తెలిసింది. రెండేళ్ల క్రితం శ్రీనివాసు కాకినాడలో మరో పెళ్లి కూడా చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసినట్టు సమాచారం. తరచూ భార్య మాధవి, కుమార్తె కరుణ వద్దకు వచ్చిన భర్త శ్రీనివాసు డబ్బుల కోసం వేధించేవాడని ఆ కోణంలోనే కుమారుడు, విజయ్‌తో కలిసి వీరిద్దరినీ హతమార్చాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతురాలు కరుణ తణుకులో ఓ కళాశాలలో చదువుతూ మధ్యలోనే నిలిపి రామచంద్రపురం ఇంటికి వచ్చేసిందని తెలుస్తోంది. తణుకులోని ఆమె కుటుంబీకుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్న కరుణ ఎందుకు అర్ధంతరంగా చదువును విరమించిందనేది తెలియాల్సి ఉంది. దీంతో ఆమెకు ప్రేమ వ్యవహారం ఏదైనా నడించిందా? లేక కుటుంబ కలహాల నేపథ్యంలో హత్యలు జరిగాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. దహనసంస్కారాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం రామచంద్రపురం: పట్టణంలోని చప్పిడివారిసావరంలో జరిగిన జంట హత్యల్లో మృతురాళ్లకు అంత్యక్రియల నిర్వహణకు ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ తమ తనయుడు నరీన్ ద్వారా ఆర్థిక సహకారం అందజేశారు. పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుని వారికి సమాచారం అందించారు. మృతురాలు బలసా మాధవి సోదరుడు గుండా బత్తుల వెంకన్నకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. వారు కడుపేద వారు కావటంతో దహన సంస్కారాలకు కూడా సొమ్ములు లేవు. కాజులూరు మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ విషయాన్ని తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే వేణు అదేశాల మేరకు ఆయన తనయుడు నరీన్ మృతుల కుటుంబసభ్యులకు సొమ్ములు అందజేశారు. దాంతో వారు మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
వీడని అస్థిపంజరం మిస్టరీ
సాక్షి, బెల్లంపల్లి: పట్టణంలోని కాంటా చౌరస్తా ప్రాంతం సింగరేణి పాత సివిల్ విభాగానికి చెందిన శిథిలమైన భవనంలో కనిపించిన అస్థిపంజరం మిస్టరీ ఇంకా వీడలేదు. మూడు రోజుల క్రితం వెలుగుచూసిన ఈ అస్థిపంజరం ఎవరిదన్నది తెలియరావడం లేదు. గుర్తు పట్టడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉండడంతో సస్పెన్షన్ వీడడం లేదు. ఈ ఘటనను పోలీసు వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరా మహిళా, ఏ ప్రాం తానికి చెందినది, ఇక్కడకు ఎందుకు వచ్చినట్లు, ఒంటరిగా వచ్చిందా లేదా ఎవరితోనైనా వచ్చిందా, చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఆత్మహత్య చేసుకుందా, కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆనవాళ్లు.. ఘటనా స్థలిలో లభ్యమైన మృతురాలి మోకాలు, కాలి వేలికి ధరించిన మట్టెలు, ఎముకలు, ఇతర పదార్థాలు, ఆ ప్రాంతంలో దొరికిన మరికొన్ని వస్తువులను పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ ల్యా బ్‌కు పంపారు. మరోవైపు క్లూస్ టీమ్ ద్వారా వీలైనంత వరకు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. డాగ్ స్క్వాడ్ ఆగిన ప్రాంత పరిసరా లను కూడా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. ము ఖ్యం గా పాత సివిల్ విభాగం భవనాల వైపు ఇన్నాళ్లుగా ఎవరెవరూ వచ్చారు, ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎందుకోసం ఆ ప్రాం తానికి రాకపోకలు సాగించారు, ఆప్రాంతాన్నే ఎందుకోసం ఎంచుకుని ఉంటారు, ఎన్నిరోజు లుగా తచ్చాడారు ఆ ప్రాంతంలో, ఎంతమంది సంచరించారు, ఏ సమయంలో వచ్చివెళ్లిపోయే వారో తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. రోడ్డుకు కూతవేటు దూరంలో.. శిథిలమైన భవనం మధ్య ఉన్న చెట్ల పొదల్లో అస్థిపంజరం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ ప్రాంతం బజారు ఏరి యా ప్రధాన రహదారిని ఆనుకుని కేవలం 20 మీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో రేయిం బవళ్లు జనసంచారం ఉంటుంది. ఓ వైపు మసీ దు, ముందు ప్రధాన రహదారి, వెనక వైపు పద్మశాలి భవనం, మరోవైపు బాబుక్యాంపు బస్తీకి వెళ్లే అంతర్గత రహదారి ఉంది. మృతురాలు ఆ శిథిలమైన భవనంలోకి ఎందుకు వెళ్లి ఉంటుందో అంతుచిక్కడం లేదు. చెట్ల పొదల్లో చనిపోయి అస్థిపంజరంగా మారే వరకు ఎవరూ గుర్తించలేక పోయారు. రోడ్డు పక్కన మెకానిక్ వర్క్స్ నిర్వహిస్తున్న సయ్యద్ అనే వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లి దుర్వాసన రావడంతో అటువైపు వెళ్లడంతో అస్థిపంజరం వెలుగు చూడడం సంచలనమైంది. గుర్తింపే అత్యంత కీలకం.. మిస్టరీగా మారిన మహిళ అస్థిపంజరం ఘట నను చేధించడం పోలీసులకు సవాల్‌గా మారిం ది. ఇటీవలి కాలంలో అదృశ్యమైన మహిళలు ఎంత మందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏడేళ్ల్ల క్రితం బెల్లంపల్లి టేకుల బస్తీలో జనావాసాలను ఆనుకుని గోనే సంచిలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపో యి బయట పడింది. ఇప్పటికీ ఆ మృతదేహం మిస్టరీగానే మారింది. అదే తరహాలో తాజాగా మహిళ అస్థిపంజరం వెలుగుచూడడం చర్చనీయాంశమైంది. -
ఆర్లపెంట అడవిలో మృతదేహం
దమ్మపేట : మండలంలోని అంకంపాలెం శివారు ఆర్లపెంట అడవిలో ఓ వ్యక్తి మృతదేహం గురువారం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు గాంధీనగరం గ్రామానికి చెందిన బైట శివ(28) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం, అదే మండలం రుద్రాక్షపల్లికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం బైక్(ఏపీ 37–ఏఎల్ 4520)పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శివ తండ్రి సురేష్(లారీ డ్రైవర్)కు కుటుంబీకులు తెలిపారు. డ్యూటీలో ఉన్న సురేష్, వెంటనే తన సోదరుడు బైట కృష్ణ, మేనల్లుడు పద్దం ప్రసాద్‌కు సమాచారమిచ్చాడు. వారు శివ కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. గురువారం ఉదయం దమ్మపేట మండలం ఆర్లపెంట సమీపంలో వినాయకపురం రోడ్డు సమీపంలోగల జామాయిల్ తోటలో శివ తీసుకెళ్లిన బైక్ ఉందని తండ్రికి సమాచారం అందింది. శివ కుటుంబీకులు అక్కడికెళ్లారు. వినాయకపురం రోడ్డు పక్కనున్న ఇందిరాసాగర్ కాలువ కోసం గతంలో తీసుకొచ్చి పడేసిన పైపులో శివ మృతదేహం కనిపించింది. తల భాగంలో, ముక్కు నుంచి రక్తం కారింది. తన కుమారుడిని ఎవరో కొట్టి చంపి, మృతదేహాన్ని ఇక్కడ పెట్టారని పోలీసులకు సురేష్ ఫిర్యాదు చేశాడు. ఈ స్థలాన్ని గురువారం అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, దమ్మపేట ఎస్ఐ జలకం ప్రవీణ్ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా ఏఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో తల్లీపిల్లల మృతి
విద్యుదాఘాతమేనంటున్న బంధువులు ఫుడ్ పాయిజన్‌పై అనుమానాలు ముంజులూరు (బంటుమిల్లి) : మండలంలోని ముంజులూరు గ్రామంలో ధాన్యం, బియ్యం వ్యాపారం చేసుకునే సొలసా చంద్రశేఖర్ భార్య, పిల్లలు సోమవారం ఉదయం బెడ్ రూంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెంది ఉండటం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలో దాదాపు 15 సంవత్సరాలకు పైగా సొలసా చంద్రశేఖర్, హరికిషోర్ అన్నదమ్ములు రైస్ మిల్లు నడుపుతూ ధాన్యం, బియ్యం కమీషన్ వ్యాపారం చేస్తుంటారు. జాయింట్ కుటుంబంగా ఉంటున్న వీరు ఒకే ఇంట్లో ఉంటూ వంట, వార్పు కలసి చేసుకుంటారు. రాత్రి వేళ ఎవరికి వారు వేర్వేరు గదుల్లో నిద్రిస్తారు. రోజులాగానే ఉదయం 7 గంటలకు నిద్ర లేచి ఇంటి పనులు చేయాల్సిన చిన్న కోడలు ఇంకా బయటకు రాకపోవడంతో నిద్ర లేపుదామని సుమారు 10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లిన అత్త శారదకు మంచంపై పడి ఉన్న కోడలు రాధిక(29), పెద్ద మనుమడు చంద్రహాస్(5), చిన్న మనుమడు లక్ష్మి చరణ్(3) ఎటువంటి కదలికలు లేకుండా పడి ఉండటం చూసి ఆందోళనకు గురై పెద్ద కొడుకు, కోడలుని కేక వేసింది. అక్కడికి వచ్చిన వారు చూసి ఆందోళనకు గురైన వారు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది పరిశీలించి అప్పటికే తల్లి పిల్లలు మరణించినట్లు పేర్కొన్నారు. మృతురాలు భర్త శేఖర్ ఆదివారం రాత్రి ధాన్యం సొమ్ములు వసూలు చేసుకువచ్చేందుకు మచిలీపట్నం వెళ్లాడు. ఆలస్యం కావడంతో అక్కడే అత్త ఇంటి వద్ద నిద్రించాడు. మృతురాలు రాధిక, భర్త శేఖర్లు మేనత్త, మేనమామ పిల్లలు కావడంతో వారి మధ్య ఎటువంటి వివాదాలు లేవని, ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమీ లేవని గ్రామస్తులు చెబుతున్నారు. భార్య మరణ సమాచారం బందరులో ఉన్న భర్త శేఖర్‌కు సమాచారం ఇవ్వడంతో భర్త, ఆమె తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని విగతజీవులై పడి ఉన్న భార్యాపిల్లలను చూసి రోదించారు. తల్లీపిల్లల మృతిపై అనుమానాలు రాధిక, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించారని భర్త, తల్లిదండ్రులు పేర్కొం టున్నారు. కూలర్‌కు ఉన్న వైరు కారణంగా ప్రమాదం సంభవించిందని వారు చెబుతుండగా మృతదేహాల ఉన్న తీరు చూచిన వారు ప్రమాదానికి కరెంటు కారణం కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత శేఖర్ పిల్లల్లో ఒకరు వాంతులు చేసుకున్నట్టు తెలుస్తోంది. అది ఎవరికీ తెలియరాలేదు. సంఘటన జరిగి న ప్రదేశంలో మృతదేహాలు ఉన్న తీరును బట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుదని పలువురు భావిస్తున్నారు. పోలీసులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలుస్తోంది. కానీ సమాచారం అందుకున్న బంటుమిల్లి ఎస్.ఐ పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విచారణ జరిపి మృతి కారణాలు తెలుసుకోవలసి ఉందని హెచ్చరించడంతో మృతురాలి తండ్రి పువ్వాడ సంపత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్.ఐ అనుమానాస్పద కేసు నమోదు చేశా రు. తన కూతురు, పిల్లలు విద్యుదాఘాతం కారణంగా మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని, పంచనామా, పోస్ట్‌మార్టం మంగళవారం నిర్వహిస్తామని ఎస్.ఐ తెలిపారు.