
ఇంట్లోకి రానివ్వని తల్లి.. ప్రాణాలొదిలిన కొడుకు!
ఒకవైపు కేన్సర్ బాధ.. మరోవైపు కన్నతల్లి ఇంట్లోకి రానివ్వలేదన్న వ్యథ.. ఈ రెండూ కలిసి ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. రక్తకేన్సర్తో బాధపడుతున్న కన్న కొడుకును ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిందో తల్లి. దాంతో ఇంటి దూలానికే సెలైన్ బాటిల్ కట్టి.. ఆరు బయటే భర్తను పడుకోబెట్టింది అతడి భార్య. చివరకు చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు కలగజేసుకుని ఇంటి తాళం పగలగొట్టి లోపల పడుకోబెట్టినా, కన్నతల్లి ఆదరణకు నోచుకోలేకపోయానన్న మనోవ్యథతో ఆ కన్నకొడుకు ప్రాణం గిలగిలా కొట్టుకుని.. ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయింది! ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది.
కందుకూరులోని ఓ మెడికల్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న తాళ్లూరి కాశీ విశ్వనాథ్ (45) గత డిసెంబర్‌లో అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేయిస్తే బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్లో చికిత్స చేయించుకున్నాడు. రెండు నెలల క్రితం చికిత్స ముగిసి ఇంటికి వచ్చినా, మళ్లీ వారం క్రితం ముక్కు, నోటివెంట రక్తం వచ్చింది. అతడిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమించిందని, ఇక ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ విషయాన్ని కాశీవిశ్వనాథ్ భార్య లక్ష్మీ కమల కందుకూరులో ఉంటున్న అతని తల్లికి చెప్పి, అతని తీసుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చింది.
వారిని ఇంట్లోకి రానివ్వకుండా తల్లి తాళం వేసి మరో కుమారుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటి ముందు అతన్ని పడుకోబెట్టి.. ఇంటికి ఉన్న దూలానికి సెలైన్ బాటిల్ కట్టి ఎక్కిస్తూ రెండు గంటలపాటు గడిపింది. చివరకు పోలీసులు, చుట్టుపక్కల వాళ్లు తాళం పగలగొట్టి విశ్వనాథ్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. అయినా.. ఒకవైపు వ్యాధి తీవ్రత, మరోవైపు మనోవ్యథతో అతడు గురువారం ఉదయం ప్రాణాలు వదిలేశాడు!