- బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి మృతి
- కాన్పు తర్వాత ఊరికి తిరిగి వెళ్తూ ఉండగా విషాదం
- ఆస్పత్రిలో ఉండాలని చెప్పినా వినకుండా తిరిగి వెళ్లిన గిరిజన దంపతులు
- ఆస్పత్రి అంబులెన్స్ ఇవ్వలేదని భర్త ఆరోపణ
పెదబయలు : ప్రభుత్వం మాత, శిశుమరణాలు అరకట్టాలనే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా మన్యంతో వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. మండలంలోని రూడకోట పీహెచ్‌సీ పరిధిలోని జామిగుడ పంచాయతీ గుంజివాడ గ్రామానికి చెందిన వంతాల జమ్మి(28) రూడకోట పీహెచ్‌సీలో మగబిడ్డకు జన్మనిచ్చి, తిరుగు ప్రయాణంతో దిగువ కుమడ గ్రామ సమీపంలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు.
బంధువుల అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం వంతాల జమ్మికి పురిటినొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్ చేయడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు రూఢకోట పీహెచ్‌సీలో చేర్పించినట్టు చెప్పారు. అర్ధగంట వ్యవధిలో మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి తీసుకువెళ్తుండగా కుమడ ఘాట్‌లో తల్లి మృతి చెందినట్టు భర్త ఉర్బోబు తెలిపారు.
రూడకోట పీహెచ్‌సీలో రాత్రి సమయంలో సిబ్బంది ఉండరనే ఉద్దేశ్యంతో ప్రైవేటు జీపులో ఇంటికి తీసుకువెళ్తుండగా మృతి చెందిందని వాపోయాడు. ఆస్పత్రి అంబులెన్స్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై రూడకోట పీహెచ్‌సీ వైద్యాధికారి నాగ ప్రవీణ్ వద్ద సాక్షి ప్రస్తావించగా మొదటి కాన్పు నార్మల్ డెలివరీ అయ్యిందన్నారు. బిడ్డ 3.3 కేజీలు బరువు ఉన్నాడని, తల్లీకి బీపీ, రక్తస్రావం తగ్గిందని, అన్నీ రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు.
అయినప్పటికీ ఒక్క రోజు ఆస్పత్రిలో ఉంచాలని బంధువులకు సూచించినప్పటికీ ససేమిరా అంటూ ప్రైవేటు జీపులో సాయంత్రం 5 గంటలకు తీసుకువెళ్లారని తెలిపారు. కనీసం ముంచంగిపుట్టు పీహెచ్‌సీ తీసుకుని రావాలని భర్తకు సూచించినట్టు చెప్పారు. గంట తర్వాత మృతి చెందినట్టు ఫోన్‌లో సమాచారం అందజేశారని తెలిపారు. పీహెచ్‌సీలో ఉంచి ఉంటే ఆమె బతికి ఉండేదని వైద్యాధికారి స్పష్టం చేశారు.