- బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం కోసం బాలింత నడక యాతన
- రెండు రోజుల పసిబిడ్డతో 15 కిలోమీటర్లు నడిచివచ్చిన వైనం
- అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
పాడేరు : బిడ్డకు జనన ధ్రువీకరణ చేయించుకోవాలనే ఆశతో ఓ ఆదివాసీ మహిళ పెద్ద సాహసమే చేసింది. ప్రసవమైన రెండు రోజులకే ఓ తల్లి, తన బిడ్డను ఎత్తుకొని సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన రావడం వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. గిరిజనులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. మండలంలోని వనుగుపల్లి పంచాయతీ మారుమూల చింతగున్నల గ్రామానికి చెందిన పాంగి చినతల్లి రెండు రోజుల క్రితం ఈ నెల 12న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఆమెకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన లేకపోవటంతో ఇంట్లోనే నాటుపద్ధతిలో ప్రసవించింది. ప్రసవించిన నెల రోజుల తరువాత కాని బాలింతలు ఏ పనీ చేయలేని పరిస్థితి. బాలింతకు పూర్తి విశ్రాంతితో పాటు పౌష్టికాహారం ఎంతో అవసరం. కాని ఆమెకు ఇవేమీ తెలియదు. బిడ్డ పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందాలని, బిడ్డను చూపెడితేనే ధ్రువీకరణ పత్రం ఇస్తారని ఎవరో చెప్పిన మాటలు విని రెండు రోజుల వయసు ఉన్న బిడ్డ్డను చంకలో వేసుకొని కనీసం ఎవరి తోడు లేకుండానే వచ్చింది.
కొండలూ గుట్టలూ దాటుకుంటూ సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన మండలంలోని మినుములూరు పీహెచ్‌సీకి వచ్చింది. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది, ఇతరులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. వాస్తవానికి బిడ్ద పుట్టిన 21 రోజుల లోపు పంచాయతీలోనే పంచాయతీ కార్యదర్శి ద్వారా జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు.
ఈ విషయం అధికారులులెవరూ చెప్పకపోవడంతో ఆ బాలింత ఇంత ప్రయాసపడాల్సి వచ్చింది. కాగా, పీహెచ్‌సీలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో బాలింత చినతల్లికి, పసిబిడ్డకు సిబ్బంది కొన్ని మందులు అందజేశారు. జనన ధ్రువీకరణ పత్రం పంచాయతీ ఆఫీసులోనే తీసుకోవాలని చెప్పి పంపించారు. తిరిగి ఆ బాలింత కాలినడకన స్వగ్రామానికి వెళ్లింది.