లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు.
నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ‍్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్‌లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు.
"కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు.
ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
Comments
Please login to add a commentAdd a comment